రెవెన్యూ రికవర్రీ! | Revenue Dues To The Government Is Slow | Sakshi
Sakshi News home page

రెవెన్యూ రికవర్రీ!

Published Thu, Aug 22 2019 7:24 AM | Last Updated on Thu, Aug 22 2019 7:24 AM

Revenue Dues To The Government Is Slow - Sakshi

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సిన వారు డిఫాల్ట్‌ అయినప్పుడు, సంస్థలు మూతపడినప్పుడు, ప్రభుత్వ పథకాల్లో అక్రమాలకు పాల్పడ్డప్పుడు, ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని కన్నా అదనంగా బకాయిలు పడినప్పుడు వాటిని రాబట్టడం కోసం నోటీసులు ఇస్తారు. నోటీసులకు స్పందించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వారికి ఉన్న ఆస్తులను వేలం వేసి ఆ డబ్బులు జమ చేస్తారు. అయితే గత ప్రభుత్వ హయాం నుంచి ఈ బకాయిలు వసూలు చేయకపోవడం వల్ల ఇవి కొండంత పెరిగిపోయాయి.  జిల్లాలో ఎక్కువగా డ్వామా, సినిమా థియేటర్ల నుంచి రావాల్సిన బకాయిలు, భూసేకరణలో జరిగిన అక్రమాలకు సంబంధించిన బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. 

డివిజన్ల వారీగా బకాయిలు ఇలా.
ఏలూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 93 మంది వ్యక్తులు, సంస్థల నుంచి రూ.122 కోట్ల 96 లక్షలు రావాల్సి ఉంది. కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 46 మంది వ్యక్తుల నుంచి రూ.11 కోట్ల 87 లక్షలు రావాల్సి ఉండగా, నరసాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 38 మంది వ్యక్తుల నుంచి రూ.8 కోట్ల 22 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్‌ పరిధిలో 23 మంది వ్యక్తుల నుంచి రూ.11 కోట్ల 13 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. 

భూ సేకరణ అక్రమాలు అ‘ధనం’ 
వీటికి భూసేకరణ అక్రమాలు అదనంగా తోడయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు గిరిజనేతరులకు ఇళ్ల నిర్మాణానికి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలోని తాడువాయి, మంగిశెట్టిగూడెం, చల్లవారిగూడెం గ్రామాల పరిధిలో సుమారు 1100 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో సేకరించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద కుక్కునూరు, వేలేరుపాడు నిర్వాసితులకు తొలివిడతగా ఇళ్లు నిర్మించేందుకు ఈ భూములు సేకరించారు. అయితే ఈ భూముల సేకరణలో భారీ అవినీతి కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అవినీతిపై ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేనివి ఉన్నట్లు చూపించి

రూ.కోట్ల పరిహారాన్ని నొక్కేశారు.
వర్జీనియా పొగాకు బ్యారన్‌లు లేకపోయినా ఉన్నట్లు, వ్యవసాయ బోర్లు లేకపోయినా ఉన్నట్లు, లేని మామిడి తోటలు, కోకో, ఆయిల్‌పామ్, కొబ్బరి తోట తదితర పంటలు ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ.కోట్లు నొక్కేశారు. దీనికి అధికారులు, సిబ్బంది కూడా తమ వంతు సహకారం అందించారు. అయితే ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో అధికారులు స్పందించి వరుసగా మూడుసార్లు సర్వే చేశారు. ఈ సర్వేల్లో అవినీతి బయటపడటంతో వివిధ శాఖలకు సంబంధించిన సుమారు 13మందిని విధుల నుంచి తొలగించారు. సర్వేల అనంతరం చివరకు అవినీతి జరిగిందని గుర్తించి రైతులకు చెల్లించిన పరిహారం సొమ్ము రికవరీకి నడుంబిగించారు. 

స్పందించని రైతులు 
ఇందుకోసం ఏయే రైతులు అవినీతికి పాల్పడ్డారో గుర్తించి, లేనివి ఉన్నట్లు చూపించి అదనంగా పొందిన సొమ్ములు రికవరీ చేసేందుకు నోటీసులు జారీ చేశారు. ఇలా మూడుసార్లు రైతులకు నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కరూ స్పందించలేదు. అయితే అధికారులు నోటీసులు జారీ చేయడంతో కేవలం రూ. 97 లక్షలు మాత్రం రికవరీ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.16 కోట్ల పైచిలుకు సొమ్ము రైతుల నుంచి రివకరీ కావాల్సి ఉంది. తాడువాయి భూసేకరణలో అవినీతికి పాల్పడిన 51 మందిని అధికారులు గుర్తించారు.

మూడు సార్లు నోటీసులు ఇచ్చినా రైతులు స్పందించకపోవడంతో చివరకు ఐటీడీఏ పీఓ, భూసేకరణ అధికారి హరీంద్రియ ప్రసాద్, రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగించారు. అయితే అధికారులు వేగంగా స్పందించకపోవడంతో అక్రమార్కులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.  తాజాగా జిల్లా అధికారులు ఈ బకాయిల వసూలుపై దృష్టి పెట్టారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆర్‌ఆర్‌ యాక్టు బకాయిల వసూలుపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఇటీవల వరదలు రావడంతో కొంత ఆలస్యమైందని, త్వరలోనే ఈ బకాయిలు అన్నీ వసూలు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ‘సాక్షి’కి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement