మాజీ సైనికుల భూముల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయం
సాక్షి టాస్క్‌ఫోర్స్: మదనపల్లె పట్టణంలో గూడులేని పేదవాడికి సెంటు స్థలం ఇవ్వాలంటే మీనమేషాలు లెక్కించే రెవెన్యూ అధికారులు.. అధికారం అండగా టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములన్నింటినీ దర్జాగా కబ్జా చేస్తున్నా చూస్తుండిపోయారు. నకిలీ పట్టాలు, పత్రాలతో యథేచ్చగా రూ.వేల కోట్ల విలువ చేసే వందల ఎకరాల భూములు స్వాహా చేస్తున్నా.. ఎందుకు వచ్చిన గొడవలే అని ఊరకుండిపోయారు. ఫలితంగా ప్రభుత్వ భూములకు ప్రహరీగోడలు ఏర్పాటు చేసుకుని రియల్ ఎస్టేట్ ముసుగులో వెంచర్లు వేసి అమ్మేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోనే డీకేటీ బ్రదర్స్‌గా పేరుమోసిన టీడీపీ నాయకుల్లో ఒకరిని ఏకంగా ముఖ్యమంత్రి మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే అభద్రతా భావంలో ఉంటున్న ప్రజలకు ఈయన ఎమ్మెల్యేగా అయితే ప్రైవేటు భూములు వదలిపెట్టడన్న బెంగ పట్టుకుంది.
మాజీ సైనికుల భూముల్లో టీడీపీ కార్యాలయం..
బీకే.పల్లెలోని సర్వేనెంబరు 8లో ఉన్న భూమి చెరువు పొరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీనిపక్కనే ఉన్న స్థలాన్ని మాజీ సైనికులకు ఇళ్ల పట్టాల కింద ప్రభుత్వం కేటాయించింది. సర్వేనెంబర్ 8/1లో 142 మంది మాజీ సైనికులకు 2సీ పట్టాలు ఇచ్చారు. దీనిపై కన్నేసిన టీడీపీ అభ్యర్థి ఇదే నెంబరులో 2.07 ఎకరాల భూమిని మాజీ సైనికుడు ఇంద్రసేన రాజు పేరుతో 1984 సెప్టెంబర్ 23న పట్టా ఇచ్చినట్లు తహసీల్దార్ సంతకాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు.
2016 జూన్‌లో ఇంద్రసేన రాజుకు చెందిన భూమిని అనంతపురం జిల్లాకు చెందిన జాస్తి నాగేంద్ర పేరుతో జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. 2016 ఆగస్టులో నాగేంద్ర నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నెంబరు చెరువు పొరంబోకుగా ఉన్నందున రిజిస్ట్రేషన్‌కు అనుమంతించమని అధికారులు సూచిస్తే హైకోర్టును ఆశ్రయించారు. రెండుసార్లు తీర్పు ప్రతికూలంగా వచ్చింది.
మూడోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం మాజీ సైనికులకు, అభ్యర్థి దొమ్మలపాటి రమేష్‌కు మధ్య వివాదం కోర్టులో నడుస్తోంది. భూముల విషయంలో మాజీ సైనికులపై దొమ్మలపాటి రమేష్ అనుచరులు మాజీ సైనికులను గాయపరిచిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆక్రమిత స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు.
విలేకరులకు కేటాయించిన భూమిని కూడా..
మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి ఆక్రమణలో ఉన్న జర్నలిస్టులకు కేటాయించిన స్థలం
మదనపల్లె బైపాస్ రోడ్డులో జర్నలిస్టులకు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు స్థలాన్ని ఎంపిక చేశారు. స్కెచ్ సహా వేసి జర్నలిస్టులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించి స్థలాన్ని చూపించి చదును చేసుకోమన్నారు. విలేకరులు హౌసింగ్ కమిటీగా ఏర్పడి స్థలాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో భూమికి తప్పుడు పత్రాలను సృష్టించి 3.5 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు.
జర్నలిస్టులకు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వ భూమి కాదని, తనదేనంటూ బెదిరింపులకు దిగారు. చంద్రాకాలనీ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుచరుడితో కలిసి భారీ వెంచర్ వేశారు. అందుకు సంబం ధించి అన్ని అనుమతులున్నట్లు ప్లాట్లు కావాల్సిన వారు సంప్రదించాలని బోర్డులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా టీడీపీ నాయకుల అక్రమాలపై విచారణ చేపట్టాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఇతర నియోజకవర్గానికి పాకిన ఆక్రమణలు
తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు రెవెన్యూ పరిధి 111 సర్వేనెంబరులోని 22 ఎకరాల ప్రభుత్వభూమిని పేదలకు పంపిణీ చేయాలని రెవె న్యూ అధికారులు నిర్ణయించారు. సర్వేనెంబర్‌ను 13 భాగాలుగా డివిజన్ చేసి వాటిలో 111/2,4,5,8,9,11,13 సర్వే నెంబర్లలో భూమి వ్యవసాయానికి పనికిరాదనే ఉద్దేశంతో పంపిణీ చేయలేదు. మిగతాభూమిని అర్హతను ఆధారంగా చేసుకుని రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు పట్టాను ఇచ్చారు.
అంగళ్లు గ్రామానికి చెందిన తిరుమలక్క, కమలమ్మ, యల్లయ్య, బొగ్గుల ఏసయ్య, రామలింగమ్మలకు పంపిణీ చేశారు. ఈ భూమి అనంతపురం హైవేకి పక్కగా ఉండటం, కోట్ల విలువ చేసేది కావడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొమ్మలపాటి రమేష్ ఆయన కుటుంబసభ్యులు వీరిని బెదిరించి భూమిని ఆక్రమించుకున్నారు. 111/5 సర్వేనెంబర్‌లో 42 సెంట్లు పెద్ద బండ ఉంది. దీనిని ఎవరికి పంపిణీ చేయకుండా వదిలేయడంతో మొదట దీన్ని ఆక్రమించుకున్నారు.
బండరాయిని 1.33 ఎకరాల భూమిగా చూపిస్తూ దొమ్మలపాటి రమేష్ బావ కృష్ణమూర్తినాయుడు పేరుతో పట్టా చేయించుకున్నారు. వీటికి కొత్త సర్వేనెంబర్లు 111/3ఈ, 569/9, 111/3డీ, 142/1, 192 సర్వేనెంబర్లతో 4 ఎకరాల భూమిని భార్య సరళ పేరుతో పట్టా చేసుకున్నారు. 111/3డీ సర్వే నెంబరుతోనే భార్య, బామ్మర్ది శ్రీనివాస రెడ్డి, అక్క పేరుతో దొంగ పట్టాలు సృష్టించుకున్నారు. రెవెన్యూ రికార్డులో ఈ సర్వేనెంబర్లు లేకపోవడం ప్రస్తావించదగ్గ విషయం. కేవలం ఈ నెంబర్లతోనే మొత్తం భూమిని ఆక్రమించుకుని పేదోళ్ల పొట్ట కొట్టారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశారనే ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment