revenue stamps
-
సకుటుంబ కరెన్సీ ముద్రణ!
మహబూబాబాద్ రూరల్: చిన్నచిన్న వ్యాపారాలు చేసినా కలిసి రాలేదు. దీంతో డబ్బుల కోసం దొంగ నోట్లు ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. యూ ట్యూబ్‌లో తయారీ విధానం నేర్చుకుని దొంగ నోట్లు ముద్రించాక చలామణి ప్రారంభించాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడగా భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు కుమారులను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సామల శ్రీనివాస్ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేసేవాడు. భార్య, ఇద్దరు కుమారులతో హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు సాయిచరణ్ డిగ్రీ చదువుతూ సినిమా రంగం వైపు మళ్లాడు. షార్ట్ ఫిల్మ్‌లు, ప్రైవేటు సాంగ్ ఆల్బమ్ లు తయారు చేస్తున్నాడు. ఇంతలో ఓ పెద్ద సినిమాలో నటించేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ దగ్గర పనిచేసే పేట శ్రీనివాస్ అవకాశం ఇచ్చినా పెట్టుబడి కావాలనడంతో మరోమా ర్గంలేక యూట్యూబ్‌లో నకిలీ నోట్లు తయారీ విధానం నేర్చుకుని ఒక కలర్ ప్రింటర్, రెవెన్యూ స్టాంప్లకు ఉపయోగించే పేపర్లను కొనుగోలు చేసుకుని రూ.200, రూ. 500, రూ.2వేల నకిలీ నోట్లను తయారు చేశాడు. గ్రామాల్లోనైతే సులువు నకిలీ నోట్లు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మార్పిడి చేస్తే గుర్తు పడతారని భావించిన శ్రీనివాస్ గ్రామాలను ఎంచుకున్నాడు. ఇందుకు ఓ మహింద్రా జైలో వాహనాన్ని సమకూర్చుకుని మూడు నెలల నుంచి వరంగల్, ఖమ్మం, నల్ల గొండ ఉమ్మడి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతా ల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లిలో బెల్టు షాపులో రూ.500 నోటు, మరో మహిళ వద్ద రూ.500 నోటు మార్పిడి చేద్దామని యత్నించాడు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసముద్రం ఎస్సై బి.సతీశ్ విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కేసముద్రం వద్ద మహింద్రా జైలో వాహనంలో వెళ్తున్న సామల శ్రీనివాస్, ఆయన భార్య నాగలక్ష్మి, వారి కుమారులు సాయిచరణ్, అఖిల్ పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.69,900 నకిలీ నోట్లు, రూ.29,870 అసలైన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
కొత్త దందా!
సాక్షి, కర్నూలు : పూర్వం సామంతరాజులు తమ రాజ్యాలపై దండెత్తకుండా ఉండేందుకు చక్రవర్తులకు కప్పం కట్టేవారు. ఇప్పుడు జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. కొందరు అధికారులు తమ సీటుకు ఎసరు రాకుండా.. మరికొందరు అధికారులు తాము కోరుకున్న చోటు దక్కించుకునేందుకు ప్రతి నెలా అధికార పార్టీ నేతలకు భారీగా మామూళ్లు అప్పజెప్పడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఇటీవల రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ల్లో జరిగిన బదిలీల్లో కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పించినందుకు భారీగా నజరానాలు పుచ్చుకున్నా.. అంతటితో సంతృప్తి చెందని అధికార పార్టీ నేతలు సరికొత్త దందాకు తెరలేపారు. బదిలీ సమయంలో ఒక్కసారి ఇస్తే సరిపోదని.. ప్రతి నెలా ఎంతోకొంత ఇవ్వాల్సిందేనని షరతు విధించారు. బదిలీ అనంతరం పోస్టులో కొంత కాలంపాటు పదిలంగా పనిచేసుకోవాలన్నా.. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి కదలకుండా మరికొంత కాలం ఉండాలన్నా.. నెలనెలా కప్పం కట్టాల్సిందే. అందుకు సిద్ధపడితేనే పోస్టు పదిలం. లేకపోతే బదిలీ ఖాయమని చెబుతున్నారు. ఇటీవల జరిగిన తహశీల్దార్ల బదిలీలే ఇందుకు అద్దం పడుతున్నాయి. బదిలీలు జరిగిన 24 గంటల్లోనే మార్పులు జరిగాయి. మండలస్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు అమలు చేయాలంటే కీలకం ఎమ్మార్వో. సదరు మండలంలో వచ్చే ఆదాయాన్ని బట్టి ఆ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొనడంతో అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు ఒక్కో పోస్టుకు ఒక్కో ధరను నిర్ణయించారు. ముడుపులు ముట్టచెప్పిన వారికి కోరిన చోట పోస్టింగులను ఇచ్చారు. సాధారణంగా అయితే బదిలీకి ఎంతో కొంత ముడుపులు అప్పజెపుతారు. కానీ, కోరుకున్న చోటికి పోస్టింగ్ ఇచ్చే సమయంలోనే నెలనెలా కప్పం కట్టే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెలవారీ మామూళ్లు ఇచ్చేందుకు ‘సై’.. డోన్ నియోజకవర్గంలో ఓ మండలంలో పనిచేస్తున్న పోలీసు అధికారికి మైనింగ్ వ్యాపారులతో భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసు నిఘా వర్గాలే ధృవీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీ తప్పదేమోనన్న ముందుచూపుతో అక్కడి అధికారి టీడీపీ నాయకుల్ని కలుసుకుని నెలవారీ మామూళ్లు ఇచ్చేవిధంగా ఒప్పందం చేసుకుని సీటును పదిలం చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా బదిలీలపై పోలీసుశాఖలో చర్చ ఊపందుకోవడంతో లాభాలున్న స్థానం కోసం ఎవరికి వారు అధికారపార్టీ నేతల్ని ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగా కోరుకున్న సీటు ఖాయం కాకపోతే ఉన్న సీటునే పదిలం చేసుకునేందుకు రూ. 10 నుంచి 15 లక్షల దాకా గుట్టుగా ముడుపులు ముట్టజెప్పి బదిలీ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో పెట్టుబడులను రాబట్టుకునేందుకు పోలీసు అధికారులు ఆదాయ వనరులపై దృష్టి సారించారు. స్టేషన్లను ఆశ్రయించిన బాధితుల న్యాయఅన్యాయాలు పక్కన పెట్టి పైరవీకారులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ విభాగంలోనూ ఇలాంటి ఒప్పందాలే జరిగినట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. కల్లూరు మండలంలో ఎమ్మార్వోగా ఉన్న సమయంలో ఏసీబీ కేసులో ఇరుక్కున్న ఒక అధికారిణిని అప్పట్లో కోనేరు రంగారావు కమిటీ (కేఆర్ఆర్సీ) వేశారు. అయితే, ఆమె రాజకీయ సిఫార్సుతో ఏకంగా మంత్రి లెటర్ పెట్టి మరీ... సిమెంటు ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న మండలానికి బదిలీ చేయించుకోగలిగారు. ప్యాపిలీ ఎమ్మార్వోగా ఉన్న తులసీనాయక్‌ను గత నెల చివర్లో బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కలెక్టరేట్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అయితే, ఆయన రాజకీయ అండదండలతో మళ్లీ ప్యాపిలీకే బదిలీ చేయించుకోగలిగారు. మహానంది తహశీల్దార్ నరసింహులును డోన్‌కు బదిలీ చేశారు. అయితే, మంచి ఫోకల్ పోస్టు కావడంతో ఈ పోస్టుకు డిమాండ్ పెరిగింది. తిరిగి ఈ పోస్టుకు బాలగణేషయ్యను పంపారు. నరసింహులను నందికొట్కూరుకు బదిలీ చేశారు. నంద్యాల తహశీల్దార్ శివరాంరెడ్డిని బనగానపల్లెకు వేశారు. పత్తికొండలోని రామకృష్ణను నంద్యాలకు వేశారు. రెండోసారి జరిగిన బదిలీల్లో శివరాంరెడ్డిని మళ్లీ నంద్యాలకు మార్చారు. రామకృష్ణను బనగానపల్లెకు మార్చారు. వెలుగోడు నుంచి మిడుతూరుకు వేసిన తిరుమలవాణిని తిరిగి వెలుగోడుకు మార్చారు. జూపాడుబంగ్లాకు బదిలీ అయిన సుజాతను మిడుతూరు మండలానికి మార్చారు. కల్లూరులో ఉన్న శివరాముడు రాజకీయ పలుకుబడితో అక్కడే కొనసాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఇసుక, మైనింగ్ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీ ప్రాంతాల్లో ఎమ్మార్వో పోస్టులకు భారీగా డిమాండ్ ఉంది. అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు మైనింగ్‌ను చూసీచూడనట్టు ఉండేందుకుగానూ మైనింగ్, ఇసుక మాఫియా ద్వారా ప్రతీ నెలా ఠంచనుగా లక్షలాది రూపాయలు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఆయా మండలాల్లో వచ్చే ఆదాయాన్ని అంచనా వేసి.. జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత నెలవారీ మామూళ్లు వసూళ్లకు శ్రీకారం చుట్టారనే విషయంపై ఆ పార్టీకి చెందిన కొందరు జిల్లా నేతలు అధినేతకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెళ్లడం.. ఆ వెంటనే ‘‘మనకు అనుకూలంగా ఉండే అధికారులను మంచి పోస్టులో పెట్టుకోమంటే.. దీన్ని కూడా మీకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఒక్కో అధికారికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి.. అమ్మేసుకున్నారు. ఇదేం పద్ధతి. కాంగ్రెస్ నేతల్లా వ్యవహరిస్తున్నారు. ఇలా చేస్తే మనకు విలువేం ఉంటుంది’’ అంటూ సీఎం జిల్లా నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆంధ్రాలో భారీగా రిజిస్ట్రేషన్ల ఆదాయం
* సెప్టెంబర్‌లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చింది రూ. 255 కోట్లు * పన్నుల ద్వారా ఆదాయం రూ. 2,747 కోట్లు * ఈ ఆర్థిక ఏడాది సెప్టెంబరు వరకు రూ. 24,070 కోట్ల ఆర్జన * గతేడాది ఇదే కాలంలో వచ్చింది రూ. 22,557 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో భూముల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఇందుకు ప్రబల నిదర్శనం రాష్ట్రం విడిపోయిన తరువాత వరుసగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడమే. సెప్టెంబర్ నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.255 కోట్లు వచ్చింది. జూలై నెలలో 250 కోట్ల రూపాయలు ఆదాయం రాగా, ఆగస్టు నెలలో 213 కోట్లు సమకూరింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పన్నుల ద్వారా 2,747 కోట్ల రూపాయల ఆదాయం రాగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాకు 58 శాతం మేర ఆదాయం లెక్క కడితే 2,854 కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మే వరకు ఆంధ్రాకు 58 శాతం, జూన్ నుంచి రాష్ట్రం విడిపోయాక సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను ఆదాయం లెక్క కడితే 24,070 కోట్ల రూపాయలు వచ్చింది. ఇదే గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 58 శాతం మేర లెక్క కడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22,557 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇదే తరహాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు పన్నేతర ఆదాయం 2,246 కోట్ల రూపాయలు రాగా గత ఆర్థిక సంవత్సరంలో 2,165 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం పెద్దగా రావడం లేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నా యి. పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.