సాక్షి, కర్నూలు : పూర్వం సామంతరాజులు తమ రాజ్యాలపై దండెత్తకుండా ఉండేందుకు చక్రవర్తులకు కప్పం కట్టేవారు. ఇప్పుడు జిల్లాలో కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. కొందరు అధికారులు తమ సీటుకు ఎసరు రాకుండా.. మరికొందరు అధికారులు తాము కోరుకున్న చోటు దక్కించుకునేందుకు ప్రతి నెలా అధికార పార్టీ నేతలకు భారీగా మామూళ్లు అప్పజెప్పడానికి సిద్ధమయ్యారు.
జిల్లాలో ఇటీవల రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ల్లో జరిగిన బదిలీల్లో కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పించినందుకు భారీగా నజరానాలు పుచ్చుకున్నా.. అంతటితో సంతృప్తి చెందని అధికార పార్టీ నేతలు సరికొత్త దందాకు తెరలేపారు. బదిలీ సమయంలో ఒక్కసారి ఇస్తే సరిపోదని.. ప్రతి నెలా ఎంతోకొంత ఇవ్వాల్సిందేనని షరతు విధించారు. బదిలీ అనంతరం పోస్టులో కొంత కాలంపాటు పదిలంగా పనిచేసుకోవాలన్నా.. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి కదలకుండా మరికొంత కాలం ఉండాలన్నా.. నెలనెలా కప్పం కట్టాల్సిందే. అందుకు సిద్ధపడితేనే పోస్టు పదిలం. లేకపోతే బదిలీ ఖాయమని చెబుతున్నారు. ఇటీవల జరిగిన తహశీల్దార్ల బదిలీలే ఇందుకు అద్దం పడుతున్నాయి. బదిలీలు జరిగిన 24 గంటల్లోనే మార్పులు జరిగాయి. మండలస్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు అమలు చేయాలంటే కీలకం ఎమ్మార్వో. సదరు మండలంలో వచ్చే ఆదాయాన్ని బట్టి ఆ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొనడంతో అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు ఒక్కో పోస్టుకు ఒక్కో ధరను నిర్ణయించారు. ముడుపులు ముట్టచెప్పిన వారికి కోరిన చోట పోస్టింగులను ఇచ్చారు. సాధారణంగా అయితే బదిలీకి ఎంతో కొంత ముడుపులు అప్పజెపుతారు. కానీ, కోరుకున్న చోటికి పోస్టింగ్ ఇచ్చే సమయంలోనే నెలనెలా కప్పం కట్టే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నెలవారీ మామూళ్లు ఇచ్చేందుకు ‘సై’..
డోన్ నియోజకవర్గంలో ఓ మండలంలో పనిచేస్తున్న పోలీసు అధికారికి మైనింగ్ వ్యాపారులతో భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసు నిఘా వర్గాలే ధృవీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీ తప్పదేమోనన్న ముందుచూపుతో అక్కడి అధికారి టీడీపీ నాయకుల్ని కలుసుకుని నెలవారీ మామూళ్లు ఇచ్చేవిధంగా ఒప్పందం చేసుకుని సీటును పదిలం చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా బదిలీలపై పోలీసుశాఖలో చర్చ ఊపందుకోవడంతో లాభాలున్న స్థానం కోసం ఎవరికి వారు అధికారపార్టీ నేతల్ని ఆశ్రయిస్తున్నారు.
ఇందులో భాగంగా కోరుకున్న సీటు ఖాయం కాకపోతే ఉన్న సీటునే పదిలం చేసుకునేందుకు రూ. 10 నుంచి 15 లక్షల దాకా గుట్టుగా ముడుపులు ముట్టజెప్పి బదిలీ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో పెట్టుబడులను రాబట్టుకునేందుకు పోలీసు అధికారులు ఆదాయ వనరులపై దృష్టి సారించారు. స్టేషన్లను ఆశ్రయించిన బాధితుల న్యాయఅన్యాయాలు పక్కన పెట్టి పైరవీకారులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెవెన్యూ విభాగంలోనూ ఇలాంటి ఒప్పందాలే జరిగినట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. కల్లూరు మండలంలో ఎమ్మార్వోగా ఉన్న సమయంలో ఏసీబీ కేసులో ఇరుక్కున్న ఒక అధికారిణిని అప్పట్లో కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌ఆర్‌సీ) వేశారు. అయితే, ఆమె రాజకీయ సిఫార్సుతో ఏకంగా మంత్రి లెటర్ పెట్టి మరీ... సిమెంటు ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న మండలానికి బదిలీ చేయించుకోగలిగారు. ప్యాపిలీ ఎమ్మార్వోగా ఉన్న తులసీనాయక్‌ను గత నెల చివర్లో బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కలెక్టరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అయితే, ఆయన రాజకీయ అండదండలతో మళ్లీ ప్యాపిలీకే బదిలీ చేయించుకోగలిగారు. మహానంది తహశీల్దార్ నరసింహులును డోన్‌కు బదిలీ చేశారు. అయితే, మంచి ఫోకల్ పోస్టు కావడంతో ఈ పోస్టుకు డిమాండ్ పెరిగింది. తిరిగి ఈ పోస్టుకు బాలగణేషయ్యను పంపారు. నరసింహులను నందికొట్కూరుకు బదిలీ చేశారు. నంద్యాల తహశీల్దార్ శివరాంరెడ్డిని బనగానపల్లెకు వేశారు. పత్తికొండలోని రామకృష్ణను నంద్యాలకు వేశారు. రెండోసారి జరిగిన బదిలీల్లో శివరాంరెడ్డిని మళ్లీ నంద్యాలకు మార్చారు. రామకృష్ణను బనగానపల్లెకు మార్చారు. వెలుగోడు నుంచి మిడుతూరుకు వేసిన తిరుమలవాణిని తిరిగి వెలుగోడుకు మార్చారు. జూపాడుబంగ్లాకు బదిలీ అయిన సుజాతను మిడుతూరు మండలానికి మార్చారు. కల్లూరులో ఉన్న శివరాముడు రాజకీయ పలుకుబడితో అక్కడే కొనసాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఇసుక, మైనింగ్ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీ ప్రాంతాల్లో ఎమ్మార్వో పోస్టులకు భారీగా డిమాండ్ ఉంది.
అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు మైనింగ్‌ను చూసీచూడనట్టు ఉండేందుకుగానూ మైనింగ్, ఇసుక మాఫియా ద్వారా ప్రతీ నెలా ఠంచనుగా లక్షలాది రూపాయలు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఆయా మండలాల్లో వచ్చే ఆదాయాన్ని అంచనా వేసి.. జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత నెలవారీ మామూళ్లు వసూళ్లకు శ్రీకారం చుట్టారనే విషయంపై ఆ పార్టీకి చెందిన కొందరు జిల్లా నేతలు అధినేతకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెళ్లడం.. ఆ వెంటనే ‘‘మనకు అనుకూలంగా ఉండే అధికారులను మంచి పోస్టులో పెట్టుకోమంటే.. దీన్ని కూడా మీకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఒక్కో అధికారికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి.. అమ్మేసుకున్నారు. ఇదేం పద్ధతి. కాంగ్రెస్ నేతల్లా వ్యవహరిస్తున్నారు. ఇలా చేస్తే మనకు విలువేం ఉంటుంది’’ అంటూ సీఎం జిల్లా నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొత్త దందా!
Published Wed, Dec 3 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement