Revenue villages
-
ఆ 23 గ్రామాలు ఆదివాసీలవే
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు ఆదివాసీలకే చెందుతాయని పేర్కొంటూ హైకోర్టు ధర్మాసనం బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఆ గ్రామాలన్నీ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని తేల్చిచెప్పింది. 2014 ఏప్రిల్ 17న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని చెప్పింది. ఆ గ్రామాలు 5వ షెడ్యూల్ పరిధిలోకి రావన్న ఆదివాసీయేతరుల వాదనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం తప్పుబట్టింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ 2014 మేలో దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను కొట్టివేసింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేశారని స్పష్టం చేసింది. 75 ఏళ్ల క్రితం నుంచీ వివాదం.. దాదాపు 75 ఏళ్ల క్రితం నుంచి ఈ గ్రామాలకు సంబంధించి ఆదివాసీ, ఆదివాసీయేతరుల మధ్య వివాదం ఉంది. ఇరువర్గాలు ఈ వివాదంపై పలుమార్లు కోర్టులను కూడా ఆశ్రయించాయి. మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు 2005 వరకు జనరల్ రొటేషన్ (జనాభా దామాషా) పద్ధతిన జరిగాయి. అయితే 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను ‘షెడ్యూల్డ్ ఏరియా’గా పేర్కొంటూ, ఎస్టీలకు 100 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ సంబంధిత చట్టాల మేరకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ఆదివాసీయేతరులు కొందరు కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేయడంతో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇదే అంశంపై వివాదం కొనసాగుతుండటం, గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. ఇదే క్రమంలో 2014లో వరంగల్ జిల్లాకు చెందిన మర్రి వెంకటరాజం, మరికొందరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 21లను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం రాష్ట్రపతి ఈ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తించకున్నా.. ప్రభుత్వం మాత్రం వీటి పరిధిలో ఎన్నికలను ఆ చట్టాల మేరకే నిర్వహిస్తోందని తెలిపారు. ఈ గ్రామాల పరిధిలోని అన్ని పదవులను ఆదివాసీలకే రిజర్వు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు భూరియా కమిషన్ నివేదికను, దాదాపు 70కి పైగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు కాపీలను పరిశీలించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయమూర్తి.. సరిగా పరిశీలన చేయని కారణంగానే రాజ్యాంగం ప్రకారం ఈ గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతాల జాబితాలోకి చేరలేదని చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ, ఆ గ్రామాలు షెడ్యూల్డ్ ప్రాంతం కిందికే వస్తాయని తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ వెంకటరాజం అప్పీల్ దాఖలు చేయగా, సుదీర్ఘ విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. తాజాగా తీర్పును వెలువరించింది. తప్పుడు కేసులతో ఎన్నో కోల్పోయాం తప్పుడు లిటిగేషన్ కేసులతో ఎన్నో ఏళ్లుగా విద్య, ఉద్యోగాలు, ఉపాధి, నీరు, నిధులు కోల్పోయాం. రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను పొందేందుకు 2005 నుంచి తుడుందెబ్బ, ఆదివాసీ సేన, వివిధ గిరిజన ప్రజా సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సహకారంతో పోరాటం ప్రారంభించాం. 2006లో కేసు గెలిచాం. కానీ గిరిజనేతరులు మళ్లీ మా హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించారు. అయితే హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో పూర్తిస్థాయిలో విజయం సాధించాం. – గొప్ప వీరయ్య, మన్యసీమ పరిరక్షణ సమితి, డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈ తీర్పుతో ఆదివాసీలకు సకల హక్కులు హైకోర్టు తీర్పుతో ఆ 23 గ్రామాల్లో ఆదివాసీ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం తొలగిపోనుంది. ఈ ఎన్నికల్లో ఆదివాసీయేతరులు పోటీ చేయడానికి అనర్హులు. ఆదివాసీలు మాత్రమే పోటీ చేయాలి. అటవీ హక్కుల చట్టం ఈ గ్రామాలకు కూడా వర్తిస్తుంది. ఆదివాసీల నుంచి ఇతరులకు భూ బదలాయింపు నిషేధ చట్టం అమల్లోకి వస్తుంది. ఇకపై ఇతర ఆదివాసీలు పొందిన 5వ షెడ్యూల్లోని హక్కులన్నీ వీరూ పొందుతారు. – న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ -
ఆంగ్ల వికీపీడియాకు దీటుగా..‘తెలుగు ‘వికీ’కి వందనం!..
సాక్షి, అమరావతి: మనకు ఏదైనా సమాచారం అవసరమైతే మొదటగా వెదికేది వికీపీడియా. ప్రపంచంలో ఎటువంటి సమాచారాన్నైనా ఒక్క క్లిక్‌తో మనకు అందిస్తుంది వికీపీడియా. ఇప్పుడు వికీపీడియా తెలుగులోనూ విశ్వ విజ్ఞానాన్ని అందిస్తోంది. మధురమైన తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేస్తూనే.. ప్రపంచ విశేషాలను తెలుగు వారికి అందిస్తోంది ‘తెలుగు వికీపీడియా’. తొలినాళ్లలో ఎవరూ గుర్తించని ఈ ‘అద్భుత తెలుగు సమాచార వేదిక’ ఆంగ్ల వికీపీడియాను సైతం అధిగమిస్తోంది. దేశంలోని ఇతర భారతీయ భాషల వికీపీడియాలు కూడా ఇవ్వలేనంతగా తెలుగులో ఖచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని సమకూరుస్తోంది. ఈ క్రమంలోనే 2016లో తెలంగాణలో, తాజాగా ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత వాటి భౌగోళిక సరిహద్దుల వివరాలను ఒకచోట చేర్చి సమగ్రమైన రూపాన్ని తెలుగు వికీపీడియన్లు అందించడం విశేషం. 2003లో డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చినప్పటికీ, 2006 నుంచి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందిస్తోంది. 27వేలకుపైగా గ్రామాల సమాచారం ఆంగ్ల వికీపీడియాలో వేలాది మంది లక్షల వ్యాసాలు రాస్తుంటారు. కానీ తెలుగు వికీపీడియాలో రాసే వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. ఐతేనేం.. ఆ కొద్దిమందే సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 27 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలు, వాటి మండలాలు, జిల్లాలపై వ్యాసాలు రాయడం ఒక చరిత్ర. ఈ సమాచారం ఒక్క తెలుగు వికీలో తప్ప ఎక్కడా లభించదు. ఈ మొత్తం సమాచారాన్ని ముద్రిస్తే 60 వేల పేజీల గ్రంథం అవుతుంది. దీనిని ఎవరైనా ఉచితంగా వినియోగించుకోవచ్చు. అడ్మిన్ల పర్యవేక్షణలో.. తెలుగు వికీపీడియాలో ఖచ్చితమైన సమాచారానికి మాత్రమే చోటు లభిస్తుంది. ఔత్సాహికుల్లో అనుభవజ్ఞులు అడ్మిన్లుగా వ్యవహరిస్తూ నిత్యం వ్యాసాలను పరిశీలిస్తుంటారు. పొరపాట్లు ఉంటే వాటిని సరి చేస్తూ పాఠకులకు చేరవేస్తున్నారు. ఇక్కడ ఓటింగ్ ద్వారా అడ్మిన్లను ఎంపిక చేయడం, అవసరమైతే తొలగించడం కూడా చేస్తారు. తెలుగు వికీలో 14 మంది అడ్మిన్లుగా పని చేస్తున్నారు. ప్రపంచంతో పాటు భారతదేశ రాష్ట్రాలు, జిల్లాల సమాచారం తెలుగులో అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల అనువాద వ్యాసాలను కూడా పెంచుతున్నారు. మీరూ వికీపీడియన్ కావొచ్చు వెబ్సైట్లో ఖాతాను సృష్టించుకోవడం లేదా గెస్ట్‌గా అయినా ఎవరైనా వికీపీడియన్‌గా మారవచ్చు. ఎటువంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెన్నేమ్తో కూడా వ్యాసాలు అందించవచ్చు. కొత్తగా వచ్చిన వారికి ఒక గురువును కూడా జత చేస్తారు. వారి సూచనలతో నెమ్మదిగా అక్షర దోషాలను గుర్తించడం, వ్యాసాలు రాయడం అలవాటు చేస్తారు. ప్రతి వికీపీడియా వ్యాసానికి ప్రత్యేక శైలి ఉంటుంది. దానిని అనుసరించే వ్యాసాలు రాయాలి. మారుమూల గ్రామాల్లోని విశేషాలు, సంస్కృతితో పాటు ఎవరైనా సామాజిక కోణంలో స్వయంగా తీసిన ఫొటోలు కూడా పొందుపరచవచ్చు. ముఖ్యంగా ఇవి.. ► ఆంగ్ల వికీలో ఇప్పటి వరకు 66.10లక్షల వ్యాసాలు నాలుగు బిలియన్లకుపైగా పదాలతో ఉన్నాయి. నిత్యం ఎన్నో అప్డేట్లు వస్తున్నాయి ► కానీ, తెలుగు వికీలో సమాచారం ఆశించినంత స్థాయిలో లేదు. తెలుగులో 80,778 వ్యాసాలు మాత్రమే ఉన్నాయి. ► వాస్తవానికి వందల సంఖ్యలో ఔత్సాహికులు స్వచ్ఛందంగా తెలుగు వికీపీడియాకు వ్యాసాలు రాస్తుండగా, ఇందులో నిత్యం పని చేసే వారు 50 మంది లోపే. ► తెలుగు వికీపీడియన్లలో రిటైర్డ్ ఉద్యోగులు, ఔత్సాహిక తెలుగు ప్రేమికులు, గృహిణులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు ఇలా అనేక వర్గాలు పని చేస్తూ తెలుగు పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ► 2014లో విజయవాడలో జరిగిన తెలుగు వికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 80 మంది వికీపీడియన్లు హాజరయ్యారు. ఇందులో 20 మంది ఇతర భాషల వారు ఉన్నారు. 2015లో తిరుపతిలో జరిగిన 11వ వార్షికోత్సవంలో 80 మంది వరకు పాల్గొన్నారు. మరింత బలోపేతానికి కృషి నేను ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూ తెలుగు వికీపీడియాకు పని చేస్తున్నాను. ప్రభుత్వాలు విడుదల చేసిన డేటాపై ఆధారపడి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వాడి జిల్లాలు, మండలాల సరిహద్దులు, మ్యాపులను స్వయంగా తయారు చేశాం. ఈ పేజీల్లో రాసిన ప్రతి అంకె, ప్రతి సమాచారమూ ఖచ్చితత్వంతో ఉండేలా చూస్తాం. ఆధారాన్ని ప్రతి పేజీలోనూ మూలాలుగా చూపిస్తాం. అంతేకాదు.. ఏ పేజీలోనైనా ఏదైనా సమాచారం తప్పుగా ఉందనో, అసలు లేదనో మీరు గమనిస్తే, మీరే స్వయంగా మార్పులు చెయ్యవచ్చు. తెలుగు వికీపీడియాలో ఉన్న సమాచారానికి కాపీరైట్ ఉండదు. తెలుగు వికీపీడియా బలోపేతానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. – పవన్ సంతోష్, తెలుగు వికీపీడియన్, విజయవాడ -
3 దశల్లో భూముల రీసర్వే పూర్తికి ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని మూడు దశల్లో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో 5,300, రెండో దశలో 5,700, మూడో దశలో 6,460 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోంది. సర్వే ప్రక్రియలో చేపట్టాల్సిన నాలుగు కీలక పనుల్ని ఎప్పటిలోగా పూర్తి చేయాలో కూడా షెడ్యూల్ రూపొందించారు. డ్రోన్ సర్వే పూర్తి చేసి ఆ ఫొటోలను ఇవ్వడం, క్షేత్ర స్థాయి సర్వే, సర్వే పూర్తయినట్లు ప్రకటించే నోటిఫికేషన్ (నంబర్ 13), వైఎస్సార్ జగనన్న భూహక్కు పత్రం జారీకి ఈ షెడ్యూల్ ఇచ్చారు. మొదటి దశ గ్రామాల్లో వచ్చే ఏడాది జూలై 31, రెండో దశ గ్రామాల్లో వచ్చే ఏడాది ఆగస్టు 30, మూడో దశ గ్రామాల్లో వచ్చే ఏడాది నవంబర్ 30 నాటికి భూ హక్కు పత్రాలు జారీ చేయనున్నారు. ప్రస్తుతం 2,562 రెవెన్యూ గ్రామాల్లో (4,593 ఆవాసాలు) డ్రోన్ సర్వే పూర్తయింది. వాటిలో 1,272 రెవెన్యూ గ్రామాల డ్రోన్ ఫొటోలను సర్వే బృందాలకు అందించారు. ఇప్పటివరకు దాదాపు వెయ్యి గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ప్రస్తుతం 67 డ్రోన్లు వినియోగిస్తుండగా త్వరలో వాటి సంఖ్యను పెంచనున్నారు. బాగా పనిచేసిన జిల్లాలు.. రీసర్వేలో కీలకమైన క్షేత్ర స్థాయి నిజ నిర్థారణలో బాగా పనిచేసిన జిల్లాలుగా శ్రీకాకుళం, అన్నమయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాలను రెవెన్యూ ఉన్నతాధికారులు గుర్తించారు. పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలు ఇంకా సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉందన్నారు. గ్రామాల్లో సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు బాగా పనిచేయగా.. ఎన్టీఆర్, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలు బాగా పనిచేయాల్సి ఉందని తేల్చారు. మార్గదర్శకాలు జారీ.. షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తి చేయడానికి యంత్రాంగానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా గ్రామాల్లో డ్రోన్లు ఎగరేయకముందే గ్రామ రికార్డులను అప్డేట్ చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో చేపట్టిన సర్వేను 5 నెలల్లో పూర్తి చేసి.. భూముల రిజిస్ట్రేషన్లను సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రారంభించాలని ఆదేశించింది. ఈ గడువు ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదని స్పష్టం చేసింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వైఎస్సార్ భూ హక్కు పత్రాల జారీని పకడ్బందీగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15న 41 ఆవాసాల్లో హక్కు పత్రాలు జారీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
ఇళ్ల నిర్మాణాలతో ప్రగతి పరుగులు
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.13 వేల కోట్లకుపైగా వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భారీగా గృహ నిర్మాణాలతో జిల్లాల ఆర్థిక ప్రగతి, రాష్ట్ర జీఎస్డీపీ పెరగడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. ఉత్పత్తి రంగం సామర్థ్యం పెరిగి ప్రతి జిల్లా జీడీపీ మరోస్థాయికి చేరుకుంటుందన్నారు. ఆప్షన్ 3 లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నామని, అదే రోజు విశాఖలో 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కూడా ఇస్తామని చెప్పారు. అదేరోజు 1.79 లక్షల పీఎంఏవై – వైఎస్సార్ గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు మొదటి దశ పేదల ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షల గృహాలు, 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కలిపి మొత్తం 21.24 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. స్పందనలో భాగంగా పేదల ఇళ్ల నిర్మాణం, పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం జగన్ ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు. 1,000 ఇళ్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టి సారించి ప్రతి వెయ్యి ఇళ్లకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను నియమించాలి. ఇళ్ల నిర్మాణంపై రోజూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. లే అవుట్లలో నీరు, విద్యుత్తు లాంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలి. మురుగునీరు బయటకు వెళ్లే సదుపాయాలను కూడా కల్పించాలి. పెద్ద లే అవుట్లలో ఇటుకల తయారీ యూనిట్లు నెలకొల్పాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం. మండలానికో సర్పంచి, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు అందచేస్తాం. మే 31లోగా గృహ హక్కు పెండింగ్ రిజిస్ట్రేషన్లు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద పెండింగ్‌లో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్లు మే 31 లోగా పూర్తి చేయాలి. 21 ఏ డిలీషన్ ప్రక్రియను జూన్ చివరినాటికి పూర్తి చేయాలి. ఈ పథకాన్ని వినియోగించుకున్న వారికి రూ.3 లక్షలు చొప్పున రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. పథకం వల్ల చేకూరే లబ్ధిని తెలియచేస్తూ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. పేదలకు 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. అవసరమైన భూమిని సేకరించి వెంటనే పట్టాలు అందించేలా చర్యలు చేపట్టాలి. 14 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర సర్వే జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం కింద 14 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో మూడు విడతల్లో సమగ్ర సర్వే పూర్తవుతుంది. రికార్డుల స్వచ్ఛీకరణ కూడా వెంటనే జరుగుతుంది. నవంబర్ 30లోగా మొదటి విడతలో సర్వే చేస్తున్న 5,200 గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ డేటా వస్తుంది. డిసెంబర్ 31లోగా రెండో విడత సర్వే చేస్తున్న 5,700 గ్రామాల ఓఆర్ఐ డేటా సిద్ధమవుతుంది. 2023 జనవరి నెలాఖరున మూడో విడతలో భాగంగా సర్వే చేస్తున్న 6,460 గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ డేటా వస్తుంది. డేటా వచ్చాక ఐదు నెలల్లో మొత్తం సర్వే ప్రక్రియ పూర్తి కావాలి. అనంతరం గ్రామ సచివాలయాల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు కావాలి. ఎంత ఖర్చైనా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పేదలకు తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో పడింది. ఈ కేసుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలి. అర్హులకు ఇళ్లు రాకుండా కత్తిరించడం సరైనది కాదు. అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే. దీనికి ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. -
కొత్త కొత్తగా..
మెదక్‌జోన్: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు. రెవెన్యూ గ్రామాలలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం 44 బృందాలు పని చేస్తున్నాయి. ప్రతి మం డలంలో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులతో కూడిన రెండు, మూడు బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఊరూరా తిరుగుతూ భూ రికార్డుల ప్ర క్షాళనను ముమ్మంగా కొనసాగిస్తున్నారు. రైతుల నుంచి సమస్యలను, వివరాలను రాత పూర్వకంగా తీసుకుని వాటిని తమ రికార్డులతో సరిపోల్చుకుంటున్నారు. ఆ తరువాత చట్టబద్ధం గా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రతి రోజు ఏ గ్రామంలో ఎన్ని సమస్యలు పరిష్కరిం చారు? ఏ తరహా సమస్యలు ఉన్నాయి? అనేది ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. రైతుల వారసత్వ హక్కులు, పట్టాదా రు పుస్తకాలలో మార్పులు, చేర్పుల వంటి పక్రియకు సంబంధించి సమాచారం తీసుకుని నమోదు చేస్తున్నారు. చట్టపరమైన అభ్యంతరాలు, ప్రభుత్వ భూ ములు, అసైన్డ్ భూముల లావాదేవీలవంటివి తలెత్తితే వాటిని సైతం సేకరించుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. తొలగుతున్న చిక్కులు భూముల సమస్యలను తొలగించేలా రెవెన్యూ అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సమస్యలున్న సర్వే నంబర్లను రైతులు ఆ న్లైన్లో ఫామ్(1)బి తీసుకుని పాస్‌బుక్ జిరాక్స్‌ను జతచేసి సర్వే అధికారులకు అందిస్తున్నారు. భూ సమస్యలను అధికారులు రెండు రకాలుగా విభజించారు. మొదటగా ఎలాంటి వివాదాలు లేని వాటిని పరిష్కరిస్తూ నమోదు చేస్తున్నారు. సర్వేలో తప్పిదాలు చోటుచేసుకోకుండా ఉండేందు కు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ముందుగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఎలాంటి వివాదాలు లేనివాటికే ప్రాధాన్యం కల్పించారు. సమగ్ర భూసర్వే లో పలు రకాల సమస్యలు బహిర్గతమవుతున్నాయి. రైతుకుల అవగాహన కలెక్టర్ భారతీహోళికేరి, జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు, ఇతర రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ భూ రికార్డుల ప్రక్షాళన మీద రైతులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లినప్పడు రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవ డం, వాటి పరిష్కారం సులభతరం అవుతున్నాయి. రైతులు తమకు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 40 శాతం అస్పష్టతగా గుర్తింపు ఇప్పటి వరకు జరిగిన సర్వేను పరిశీలిస్తే స్పష్టత లేని సమస్యలు సుమారు 40 శాతం వరకు ఉన్నాయని తెలుస్తోంది. రైతుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా భూముల వివరాలను నవీకరిస్తున్నారు. ఒకే సర్వే నంబర్లో విస్తీర్ణంలో వ్యత్యాసం, వారసత్వ వివాదాలు, భూతగాదాలు హ ద్దుల సమస్యలు అన్నదమ్ముల మధ్య ఘర్షణలతోపాటు, అమ్మడానికి వీల్లేని అసైన్డ్ భూముల కొనుగోలు వంటివాటిని మొదటి విడతలో అపరి ష్కృత సమస్యలుగానే నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 99,078 సర్వే నంబర్లను పరిశీలించగా ఇందులో 68,925 సర్వే నంబ ర్లు సరిగ్గా ఉన్నవిగా తేలింది. 30,148 సర్వే నంబర్లను సమస్యలున్నవిగా గుర్తించారు. వీటిని పార్టు(బి)గా తీసుకుని వివాదాలను పరిష్కరిస్తామ ని అధికారులు చెబుతున్నారు. తేలుతున్న ప్రభుత్వ భూముల లెక్క... ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూమి ఎంతుందో అధికారుల వద్ద సమాచారం ఉండటంతో భూ రికార్డుల ప్రక్షాళన సజావుగా సాగుతోంది. ప్రభుత్వ భూమి ఎంత ఉందనే వివరాలను పక్కాగా సేకరిస్తున్నారు. అది ఏ రూపంలో ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తున్నారు. ర హదారులకు, ఇతర ప్రయోజనాలకు, చెరువులు, కుంటల రూపంలో ఉన్న భూమి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూమి ఎవరి ఆధీనంలో ఉంది. చేతులు మారిన తీరు వంటి అంశాలను సైతం సేకరించి నివేదికలో పొందుపరుస్తున్నారు. ఖాళీగా ఉ న్న ప్రభుత్వ భూములు ఖబ్జాకు గురైన తీరు, వాటి అనుభవదారులు ఎవరు? అనే పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఆక్రమణదారుల్లో గుబులు భూములులేని నిరుపేదల ఉపాధి కోసం ప్రభుత్వం అసైన్డ్ భూమిని కేటాయిస్తుంది. ఆ భూముల్లో వారే పంటలు సాగు చేస్తూ జీవనం కొనసా గించాలి. స్థానికులకే భూమిని అప్పగిస్తారు. ఆయా భూముల క్రయవిక్రయాలు చెల్లవు. జిల్లాలో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఎవ రికి ఎన్ని అసైన్డ్ భూములు ఇచ్చారు. ఇచ్చిన భూముల్లో వారే ఉన్నారా? లేక ఇతరులకు అమ్మేశారా! ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు ఎన్ని? తదితర వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆక్రమణదారుల్లో గుబులు పుడుతోంది. పెండింగ్ సమస్యలు పరిష్కారం... ఇక రైతులకు ఎప్పట నుంచో పెండింగ్‌లో ఉన్న పాస్ పుస్తకాల మ్యూటేషన్, రికార్డుల్లో పేర్లు తప్పుగా నమోదు కావ డం వంటి సమస్యలకు తక్షణ పరిష్కారం లభించేలా రికార్డులను సరి చేస్తున్నారు. ఏళ్ల నాటి తప్పులకు వెనువెంటనే పరి ష్కారం లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత 70 గ్రామాల్లో ప్రక్షాళన పూర్తి అయింది పారదర్శకంగా ప్రక్షాళన జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళనకు అనూహ్య స్పందన లభిస్తోంది. రైతులు రికార్డుల పరంగా ఎదుర్కుంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీ సుకొచ్చి పరిష్కరించుకుంటున్నారు. ఇప్పటికే 70 గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశాం. రైతులు ముందుకొచ్చి వివరాలను చెబుతున్నా రు. నిర్ణీత గడువు డిసెంబరులోగా భూ ప్రక్షాళనను పూర్తి చేస్తాం. –సురేష్‌బాబు, జాయింట్ కలెక్టర్ -
అధికారుల నిర్లక్ష్యం.. అవస్థలే సమస్తం
చామలపల్లి (చండూరు) : సాక్షాత్తూ సీఎం చెప్పినా ఆ మాటలు మాకు కాదనుకున్నారేమో గానీ ఆ అధికారులు పట్టించుకోలేదు. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడి ముచ్చటగా మూడు వారాలు కావొస్తోంది. దసరా ముందు రోజే పంపాల్సిన రికార్డులను నేటికీ పంపలేదు. ఫలితంగా పాలనలో స్తబ్దత నెలకొంది. నాంపల్లి, చండూరు మండల శాఖాధికారుల నిర్లక్ష్యం మూలంగా మూడు రెవెన్యూ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లాల, మండలాల విభజనలో అధికారులు ఏమరపాటుగా ఉండడంతో ఆ గ్రామం ఏ మండలం కిందుందో తెలియక ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. దీంతో చామలపల్లి గ్రామస్తులు ప్రభుత్వ పాలనను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిమిత్తం ఏ మండలానికి వెళ్ళాలో తెలియక తికమక పడుతున్నారు. ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం దసరా సందర్భంగా జిల్లాల, మండలాల విభజనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నాంపల్లి మండలం పరిధిలోని చామలపల్లి గ్రామాన్ని చండూరు మండలంలో విలీనం చేసింది. ఇదంతా ఒక ఎత్తై ఆనాటి నుంచి ఏదైనా పని కోసం నాంపల్లి మండల శాఖ అధికారుల దగ్గరకు వెళ్తే తమకేం సంబంధం లేదని సమాధానమిస్తున్నారు. మరోవైపు చండూరుకు వెళ్తే రికార్డులు ఇంకా అందలేదనే సాకులు చెప్తుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. మా గ్రామానికి ఏ మండలం అధికారులు సేవలు అందిస్తారో చెప్పండని ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. నిత్యం వివిధ పనుల నిమిత్తం విద్యార్థులు, రైతులు రెండు మండలాల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. అసలేం జరుగుతుందటే.. దసరా రోజు నాంపల్లి మండలం నుంచి చామలపల్లి గ్రామాన్ని చండూరులో కలుపుతున్నట్లు అధికారులకు ప్రభుత్వం నుంచిఉత్తర్వులు అందాయి. 13 రోజు లుగా ఆ గ్రామానికి చెందిన రికార్డులను చండూరు మండల శాఖాధికారులకు పంపించడంలో నాంపల్లి మండల శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ నాంపల్లి మండల అధికారులు అంటూ కాలయాపన చేస్తుండడంతో ఈ సమస్య ఉత్పన్న మైంది. అధికారుల తప్పిదంతోనే ఇలా.. ఇదిలావుంటే దీనికితోడు మరో సమస్య ఉత్పన్నమవుతుంది. అదెంటంటే చామలపల్లి గ్రామ పంచాయతీని చండూరు మండలం లో విలీనం చేస్తున్నట్లు నాంపల్లి మండల శాఖాధికారులు గతం లో ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ పం చాయతీకి బదులుగా మూడు రెవిన్యూ గ్రామాలని నివేదిక అందిస్తే ఆ గ్రామ పంచాయతీకి ఆవాస గ్రామాలైన కుందేలు తిరుమలగిరి, గానుగుపల్లి సైతం మండలం చేరేవి. ఇలా కాకుండా ఒక్క చామలపల్లి గ్రామపంచాయతీ పేరుతో నివేదిక పంపడంతో మిగతా రెండు ఆవాస గ్రామాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. అధికారులు చేసిన పొరపాటు ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు నానాఅవస్థలు ఎదుర్కొంటున్నారు. రెండు ఆవాస గ్రామాలు చామలపల్లికి లేకపోతే జనాభా పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గానుగుపల్లి దాటే చామలపల్లికి పోవల్సిఉంది. ఇదంతా చూస్తుంటే చిన్న తప్పిదం కాస్త పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.