జగనన్న సంపూర్ణ గృహ హక్కు, జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకాలపై సమీక్షిస్తున్న సీఎం
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.13 వేల కోట్లకుపైగా వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. భారీగా గృహ నిర్మాణాలతో జిల్లాల ఆర్థిక ప్రగతి, రాష్ట్ర జీఎస్‌డీపీ పెరగడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. ఉత్పత్తి రంగం సామర్థ్యం పెరిగి ప్రతి జిల్లా జీడీపీ మరోస్థాయికి చేరుకుంటుందన్నారు. ఆప్షన్ 3 లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నామని, అదే రోజు విశాఖలో 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కూడా ఇస్తామని చెప్పారు. అదేరోజు 1.79 లక్షల పీఎంఏవై – వైఎస్సార్ గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు మొదటి దశ పేదల ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షల గృహాలు, 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కలిపి మొత్తం 21.24 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. స్పందనలో భాగంగా పేదల ఇళ్ల నిర్మాణం, పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం జగన్ ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు.
1,000 ఇళ్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్
ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టి సారించి ప్రతి వెయ్యి ఇళ్లకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను నియమించాలి. ఇళ్ల నిర్మాణంపై రోజూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. లే అవుట్లలో నీరు, విద్యుత్తు లాంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలి. మురుగునీరు బయటకు వెళ్లే సదుపాయాలను కూడా కల్పించాలి. పెద్ద లే అవుట్లలో ఇటుకల తయారీ యూనిట్లు నెలకొల్పాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం. మండలానికో సర్పంచి, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు అందచేస్తాం.
మే 31లోగా గృహ హక్కు పెండింగ్ రిజిస్ట్రేషన్లు
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద పెండింగ్‌లో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్లు మే 31 లోగా పూర్తి చేయాలి. 21 ఏ డిలీషన్ ప్రక్రియను జూన్ చివరినాటికి పూర్తి చేయాలి. ఈ పథకాన్ని వినియోగించుకున్న వారికి రూ.3 లక్షలు చొప్పున రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. పథకం వల్ల చేకూరే లబ్ధిని తెలియచేస్తూ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. పేదలకు 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. అవసరమైన భూమిని సేకరించి వెంటనే పట్టాలు అందించేలా చర్యలు చేపట్టాలి.
14 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర సర్వే
జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం కింద 14 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో మూడు విడతల్లో సమగ్ర సర్వే పూర్తవుతుంది. రికార్డుల స్వచ్ఛీకరణ కూడా వెంటనే జరుగుతుంది. నవంబర్ 30లోగా మొదటి విడతలో సర్వే చేస్తున్న 5,200 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐ డేటా వస్తుంది. డిసెంబర్ 31లోగా రెండో విడత సర్వే చేస్తున్న 5,700 గ్రామాల ఓఆర్‌ఐ డేటా సిద్ధమవుతుంది. 2023 జనవరి నెలాఖరున మూడో విడతలో భాగంగా సర్వే చేస్తున్న 6,460 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐ డేటా వస్తుంది. డేటా వచ్చాక ఐదు నెలల్లో మొత్తం సర్వే ప్రక్రియ పూర్తి కావాలి. అనంతరం గ్రామ సచివాలయాల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు కావాలి.
ఎంత ఖర్చైనా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
పేదలకు తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో పడింది. ఈ కేసుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలి. అర్హులకు ఇళ్లు రాకుండా కత్తిరించడం సరైనది కాదు. అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే. దీనికి ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment