సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెలలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా.. ఇప్పటివరకూ 4.82 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తి కానుంది.రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ పథకం కింద 31 లక్షలకు పైగా పేదింటి అక్కచెల్లెమ్మలకు పట్టాలు అందించారు. రెండు దశల్లో 21.25 లక్షలకు పైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 18.63 లక్షలు సాధారణ ఇళ్లు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఈ నెలలో పూర్తిచేయాల్సి ఉంది. రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు చేస్తూనే, మౌలిక సదుపాయాలు కూడా చకచకా కల్పిస్తున్నారు. పూర్తయిన ఇళ్లకు కరెంటు, మంచి నీటి కనెక్షన్లు ఇస్తున్నారు.
అన్ని విధాలా అండగా..
నిజానికి.. మనిషి కనీస అవసరాల్లో ఒకటైన పక్కా ఇంటిని పేదలకు సమకూర్చడానికి సీఎం జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా వారికి అండగా నిలిచింది. ప్రాంతాన్ని బట్టి రూ.15 లక్షల వరకు విలువైన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం లబి్ధదారులకు ఉచితంగా పంపిణీ చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంకు రుణం సమకూరుస్తోంది.
అంతేకాక.. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తోంది. మిగిలిన ఐరన్, సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరలకన్నా తక్కువకు సరఫరా చేయడం ద్వారా ఒక్కో లబి్ధదారుడికి రూ.54,518 మేర అదనపు సాయం చేస్తోంది. సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో మార్కెట్‌లో తక్కువ ధరకు నిర్మాణ సామగ్రిని సరఫరా చేసే కంపెనీలను ఎంపిక చేసి ప్రభుత్వం పేదలకు ఈ వస్తువులు సమకూరుస్తోంది.
సొంతింటి కల నెరవేరింది
నా భర్త ఆటో డ్రైవర్. ఆయన సంపాదన ఇంటి అద్దె, ఇతర కుటుంబ అవసరాలకు సరిపోయేది. దీంతో సొంతిల్లు కలగానే మిగిలిపోయింది. ఇల్లు కట్టుకుందామంటే అంత స్థోమత మాకులేదు. ప్రభుత్వం ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని దరఖాస్తు చేశాం. స్థలం, ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం కూడా పూర్తయింది. ప్రస్తుతం సొంతింటిలో సంతోషంగా ఉంటున్నాం. సీఎం జగన్ దశాబ్దాల మా కలను నెరవేర్చారు. – షేక్ మహబూబ్ బీ, వినుకొండ, పల్నాడు జిల్లా
మరింత వేగంగా నిర్మాణాలు
ఇళ్ల నిర్మాణాల్లో మరింత వేగం పెంచుతున్నాం. ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని ఈ నెలలో ఛేదిస్తాం. వచ్చే డిసెంబర్ నెలాఖరు లోగా మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులతో పాటు, నిర్మాణ సామగ్రిని సమకూరుస్తున్నాం. – లక్ష్మీషా, ఎండీ, గృహ నిర్మాణ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment