సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణంలో షీర్ వాల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30 లక్షలకు పైగా గృహాల నిర్మాణాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులివ్వగా ఇప్పటికే 17.22 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఆప్షన్–3(ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఇళ్లు) గృహాల నిర్మాణానికి షీర్ వాల్ పరిజ్ఞానాన్ని వినియోగించటాన్ని గృహ నిర్మాణ శాఖ పరిశీలిస్తోంది.
అమలాపురం మున్సిపాలిటీలో..
లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రూ.1.80 లక్షలు, అదనపు సాయం కింద బ్యాంక్ రుణం రూపంలో అందచేసే రూ.35 వేలతోనే షీర్ వాల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి కొందరు నిర్మాణదారులు ముందుకొచ్చారు. వేగంగా ఇళ్ల నిర్మాణంతో పాటు భూకంపాలు, తుపాన్లను సైతం తట్టుకునేలా ఇంటి నిర్మాణం పూర్తవుతుండటంతో ఈ పరిజ్ఞానం వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించిన బోడసకుర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో కొఫియ గ్రూప్‌నకు చెందిన అజయ్‌హోమ్స్ అనే సంస్థ పైలట్‌గా షీర్ వాల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. నాణ్యతను పరీక్షించిన అనంతరం ఈ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన లేఅవుట్లకు విస్తరించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్ణయించారు. షీర్ వాల్ పద్ధతిలో ఇటుకలు అవసరం లేకుండా సిమెంట్, కాంక్రీట్, ఇనుముతో కాంక్రీట్ గోడలు నిర్మిస్తారు.
ఉగాదికి ఐదు లక్షల ఇళ్లు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రెండు దశల్లో 17.22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా ఇప్పటికే 3,00,986 గృహాల నిర్మాణం పూర్తయ్యింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 25,573, చిత్తూరులో 25,072, పశ్చిమ గోదావరిలో 19,205 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గడువులోగా లక్ష్యాన్ని చేరుకునేలా నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
నాణ్యత పరీక్షల అనంతరం..
షీర్ వాల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి నిర్మాణదారులు ముందుకొస్తున్నారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో పైలెట్‌గా ఈ పద్ధతిలో ఒకటి రెండు ఇళ్లను నిర్మిస్తాం. వీటి నాణ్యతను పరీక్షించిన అనంతరం ఈ పద్ధతిని కొనసాగిస్తాం.
– లక్ష్మి షా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ.
Comments
Please login to add a commentAdd a comment