ఇండియన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ షురూ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు పలు అంతర్జాతీయ టోర్నమెంట్లకు ఆతిథ్యమిచ్చిన భాగ్యనగరం తొలిసారి ఇండియన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌కు వేదికైంది. శనివారం ఈ టోర్నమెంట్ ప్రారంభం కావడంతో నగరంలోని ప్రఖ్యాత గచ్చిబౌలి స్టేడియం యువ జిమ్నాస్ట్‌లతో కళకళలాడింది. స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల కార్యదర్శి బి. వెంకటేశం, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రాణిస్తోన్న 65 మంది జిమ్నాస్ట్‌లు ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో భారత్‌తో పాటు స్లోవేనియా, ఇటలీ, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేసియా దేశాలకు చెందిన జిమ్నాస్ట్‌లు తలపడనున్నారు.
ఒలింపిక్స్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన స్పెలా డ్రాగస్... ఈ టోర్నీలోనూ జడ్జీగా విధులు నిర్వహించనున్నారు. మొత్తం 10 మంది సభ్యులు గల జడ్జీల బృందం టోర్నీలో విజేతలను నిర్ణయించనుంది. అండర్–10, 12, 15, సీనియర్ బాలికల విభాగాల్లో బాల్, క్లబ్స్, హూప్, రోప్, రిబ్బన్ కేటగిరీలలో పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన స్టార్ జిమ్నాస్ట్ జి. మేఘన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఘనంగా జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య ఉపాధ్యక్షులు రియాజ్ భటి, అజర్బైజాన్ కోచ్ లాలా యుసిఫోవా తదితరులు పాల్గొన్నారు.