మాఫియా.. ప్రేమయా...
ఒకప్పుడు హజీ మస్తాన్, కరీంలాలా, దావూద్ ఇబ్రహీం వంటి అండర్వరల్డ్ బాద్షాలు అధికారం చెలాయించిన మాఫియా ఇలాఖా డోంగ్రీలో ఇప్పుడు సరికొత్త బాద్షా ‘రాజా’ వచ్చాడు. అతడికి సలాం చేసినోళ్లకు ఏ సమస్యా ఉండదు.. ఎదురు తిరిగినోళ్లను అడ్డు తొలగిస్తాడు. డోంగ్రీలో రాజ్యమేలుతోన్న రాజా మనసులో సామ్రాజ్యాన్ని మాత్రం ఓ అమ్మాయి ఏలుతోంది. మాఫియా ఇలాఖాలో ఈ ప్రేమకథ ఏ కంచికి చేరిందనే కథతో రూపొందుతోన్న సినిమా ‘డోంగ్రీ కా రాజా’.
హదీ అలీ అబ్రార్ దర్శకత్వంలో పీఎస్ ఛట్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గష్మీర్ మహాజని, రిచా సిన్హా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. రోణిత్ రాయ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని పీఎస్ ఛట్వాల్ తెలిపారు.