Right to information law
-
పారదర్శకతకే స.హ.చట్టం
తెనాలి రూరల్, న్యూస్‌లైన్: పరిపాలనలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం 2005లో సమాచారహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కార్యాలయ అదనపు డెరైక్టర్ జనరల్ ఎంవీవీఎస్ మూర్తి అన్నారు. స్థానిక అన్నాబత్తుని పురవేదిక వద్ద జరుగుతున్న ‘భారత్ నిర్మాణ్’ పౌర సమాచార ఉత్సవం సోమవారం రెండో రోజు సభా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యుడు సైతం అధికారులను ప్రశ్నించే అవకాశం ఈ చట్టం కల్పించిందన్నారు. కేవలం రూ.10తో సామాన్యుడికి కావాల్సిన ఏ సమాచారం అయినా అన్ని శాఖల నుంచి పొందే వీలువుందని చెప్పారు. నెల రోజు ల్లోగా సమాచారం అందించకపోతే, సమాచార కమిషనర్‌కు లేదా పై అధికారికి ఫిర్యాదు చేయవచ్చని, అప్పటికీ సమాచారం ఇవ్వని పక్షంలో సంబంధిత అధికారి వేతనం నుంచి రూ.25 వేల వరకు జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. జిల్లా మలేరియా నియంత్రణ అధికారి రవీంద్ర, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి శైలజ, జిల్లా ఆరోగ్యాధికారి ఆర్.రామారావు, జిల్లా క్షయ నియంత్రణాధికారి శ్రావణచైతన్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం. గోపినాయక్‌లు తమ శాఖల పురోగతి గురించి మాట్లాడారు. భారత్ నిర్మాణ్ ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రసార, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వివిధ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, విద్యాహక్కు చట్టాలు, ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకం, గ్రామీణాభివృద్ధి, రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ, గ్రామీణ సాగునీరు, తాగునీటి పథకం, మధ్యాహ్న భోజన పథకం వంటి అంశాలకు సంబంధించిన వివరాలు, ప్రధాన మంత్రి ప్రసంగాల ప్రతులను ప్రజలకు అందజేశారు. ఆయా కార్యక్రమాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డెరైక్టర్ టి.విజయకుమార్‌రెడ్డి, అసిస్టెంట్ డెరైక్టర్ రత్నాకర్, క్షేత్ర ప్రచార అధికారి వెంకటప్పయ్య, ఆర్డీవో ఎస్.శ్రీనివాసమూర్తి, తహశీల్దార్ ఆర్వీ రమణనాయక్, మున్సిపల్ కమిషనర్ బి.బాలస్వామి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రశేఖర్, సీడీపీవోలు సులోచన, అనూరాధ, కృష్ణవందన, మహంకాళి శ్రీనివాస్ తదితర అధికారులు పర్యవేక్షించారు. -
అధికారిక బంగ్లా ఆధునీకరణకు డైరెక్టర్ రూ. 42 లక్షల ఖర్చు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ డెరైక్టర్ ఆర్.సి. డేకా అధికార దుర్వినియోగం మరోసారి బట్టబయలైంది. నిబంధనలు లేకపోవడాన్ని అవకాశంగా మలచుకొని తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనుల కోసం ఏకంగా రూ. 42.13 లక్షల ఆస్పత్రి సొమ్మును డేకా ఖర్చు పెట్టిన విషయం సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడింది. 2009-10లో ఎయిమ్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే డేకా ఆదేశాల ప్రకారం ఆయన బంగ్లాతోపాటు డిప్యూటీ డెరైక్టర్, డీన్, మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ ఆర్థిక సలహాదారు బంగ్లాల ఆధునీకరణ కోసం రూ. 73.6 లక్షల సంస్థ సొమ్మును ఖర్చు చేసినట్లు ఎయిమ్స్ తెలిపింది. ఈ నిధుల్లో అత్యధికంగా డేకా బంగ్లా ఆధునీకరణ పనుల కోసం రూ. 42.13 లక్షలు (57 శాతం) ఖర్చు చేసినట్లు వివరించింది. ప్రముఖ సామాజిక కార్యకర్త సుభాష్ అగర్వాల్ ఆర్టీఐ చట్టం కింద ఈ అంశంపై అడిగిన సమాచారాన్ని అందించింది. ఇప్పటికే తన భార్య, ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ అయిన డాక్టర్ దీపికా డేకా కోసం విచక్షణాధికారాల పేరుతో సీనియారిటీ జాబితాను పక్కనపెట్టి ఓ బంగ్లాను కేటాయించడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ ఉదంతం బయటపడటం గమనార్హం. కాగా, ఈ అంశంపై డేకా స్పందిస్తూ ఎయిమ్స్ ఇంజనీరింగ్ విభాగం అంచనా ప్రకారమే పాత బంగ్లా ఆధునీకరణ జరిగినట్లు చెప్పుకొచ్చారు. -
ఆదాయం, ఉద్యోగుల వివరాలివ్వొద్దు
ఆర్థిక శాఖకు మినహా ఎవరికైనా ఇస్తే క్రమశిక్షణ చర్యలు అంతర్గత సర్క్యులర్ జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ, ఉద్యోగుల వివరాల వెల్లడిపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. ఆదాయం, ఉద్యోగులకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ మినహా ఎవరు అడిగినా ఇవ్వరాదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ అంతర్గత సర్క్యులర్‌ను గురువారం జారీ చేశారు. సర్క్యులర్‌కు విరుద్ధంగా ఎవరు వివరాలిచ్చినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ప్రాం తాల వారీగా ఆదాయ వివరాలు, ఉద్యోగుల వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే సర్క్యులర్ జారీ చేసి ఉండవచ్చుననే అనుమానాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఎవరు అడిగినా ఇవ్వాల్సి ఉంటుంద న్న విషయాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమలు చేయాల్సిన శాఖాధిపతే ఆ చట్టం నిబంధనలకు విరుద్ధంగా సర్క్యులర్ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. విభజనకు సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు రానప్పటికీ ఆర్థిక శాఖ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సర్వీసు రిజిస్టర్ ఆధారంగా వారి స్వస్థలాల సమాచారాన్ని అంతర్గతంగా సేకరిస్తోంది. సర్వీసు రిజిస్టర్లో పేర్కొన్న స్వస్థలం ఆధారంగా ఏ జిల్లాకు చెందిన ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలను తయారు చేస్తోంది. ఏ జిల్లా నుంచి ఎంత ఆదాయం వస్తోంది. ఏ జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా సేకరిస్తోంది. ఇవన్నీ కూడా అనధికారికంగానే అంతర్గత సమాచారం పేరుతో ఉన్నతస్థాయి సూచనల మేరకు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయ, ఉద్యోగుల వివరాల సమాచారం కావాలంటూ ఎప్పుడు ఆదేశాలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకే అంతర్గతంగా సమాచార సేకరణ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.