ఆర్థిక శాఖకు మినహా ఎవరికైనా ఇస్తే క్రమశిక్షణ చర్యలు
అంతర్గత సర్క్యులర్ జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ, ఉద్యోగుల వివరాల వెల్లడిపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. ఆదాయం, ఉద్యోగులకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ మినహా ఎవరు అడిగినా ఇవ్వరాదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ అంతర్గత సర్క్యులర్‌ను గురువారం జారీ చేశారు. సర్క్యులర్‌కు విరుద్ధంగా ఎవరు వివరాలిచ్చినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ప్రాం తాల వారీగా ఆదాయ వివరాలు, ఉద్యోగుల వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే సర్క్యులర్ జారీ చేసి ఉండవచ్చుననే అనుమానాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఎవరు అడిగినా ఇవ్వాల్సి ఉంటుంద న్న విషయాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమలు చేయాల్సిన శాఖాధిపతే ఆ చట్టం నిబంధనలకు విరుద్ధంగా సర్క్యులర్ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. విభజనకు సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు రానప్పటికీ ఆర్థిక శాఖ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సర్వీసు రిజిస్టర్ ఆధారంగా వారి స్వస్థలాల సమాచారాన్ని అంతర్గతంగా సేకరిస్తోంది.
సర్వీసు రిజిస్టర్‌లో పేర్కొన్న స్వస్థలం ఆధారంగా ఏ జిల్లాకు చెందిన ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలను తయారు చేస్తోంది. ఏ జిల్లా నుంచి ఎంత ఆదాయం వస్తోంది. ఏ జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా సేకరిస్తోంది. ఇవన్నీ కూడా అనధికారికంగానే అంతర్గత సమాచారం పేరుతో ఉన్నతస్థాయి సూచనల మేరకు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయ, ఉద్యోగుల వివరాల సమాచారం కావాలంటూ ఎప్పుడు ఆదేశాలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకే అంతర్గతంగా సమాచార సేకరణ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆదాయం, ఉద్యోగుల వివరాలివ్వొద్దు
Published Fri, Aug 9 2013 4:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement