Employees details
-
ఆన్లైన్లో ఉద్యోగుల వివరాలు
- శాఖలవారీగా సర్దుబాటు, కేటాయింపు - రెండో రోజూ కొనసాగిన సీఎస్ టాస్క్‌ఫోర్స్ సమీక్ష - ఇంజనీరింగ్ విభాగాల విలీనంపై నేడు సమావేశం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు కొలువుదీరక ముందే ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలు పొందుపరిచేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆన్లైన్ ఫార్మాట్‌ను తయారు చేసింది. సర్దుబాటు ఎలా ఉండాలో నిర్దేశిస్తూ.. ఉద్యోగుల కేటాయింపు వివరాలన్నీ ఆన్లైన్లోనే పొందుపరచాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాలకు అవసరమయ్యే సిబ్బంది, మౌలిక వసతుల కల్పనపై సీఎస్ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ సచివాలయంలో వరుసగా రెండో రోజు సమావేశమైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12 విభాగాలతో సీఎస్ సమీక్షించారు. వ్యవసాయం, పశు సంవర్థకం, మార్కెటింగ్, విద్య, ప్రణాళిక, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగుల సర్దుబాటుపై చర్చించారు. విద్యా శాఖ పరిధిలో డిప్యూటీ డీఈ వోలు, అసిస్టెంట్ డెరైక్టర్లను కొత్త జిల్లాల్లో ఇన్చార్జీ డీఈవోలుగా నియమించాలని నిర్ణయిం చారు. తర్వాత సీనియారిటీ క్రమంలో వారికి ప్రమోషన్లు ఇచ్చే పద్ధతిని అనుసరించనున్నారు. ఒకే గొడుగు కింద విద్యా శాఖ విభాగాలు విద్యాశాఖ పరిధిలో ప్రస్తుతం విడివిడిగా ఉన్న సర్వశిక్ష అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, మోడల్ స్కూళ్లన్నీ ఇకపై డీఈవో పరిధిలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. దీంతో ఉద్యోగుల కొరత తీరుతుందని, సర్దుబాటు సమస్య పరిష్కారమవుతుందని చర్చించారు. మండల స్థాయిలోనూ ఇదే తీరుగా విద్యా సంబంధిత యూనిట్లను విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాఖలోనూ ఇప్పుడున్న జాయింట్ డెరైక్టర్లను రీజనల్ డెరైక్టర్లుగా నియమించనున్నారు. వీరి స్థానంలో డిప్యూటీ డెరైక్టర్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులుగా సర్దుబాటు చేయనున్నారు. దసరా నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కేవలం నలభై రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఉద్యోగుల తుది కేటాయింపులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా రెండు రోజుల పాటు నిర్దేశించిన శాఖల వారీ సమావేశాలను శనివారం కూడా కొనసాగించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ, పబ్లిక్ హెల్త్, రహదారులు భవనాలు తదితర శాఖల పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలపై నేడు సమీక్ష జరపనున్నారు. ఇంజనీరింగ్ విభాగాలు కొన్నింటిని విలీనం చేసే అవకాశమున్నందున, అదే కోణంలో ఉద్యోగుల కేటాయింపు ప్రతిపాదనలతో హాజరుకావాలని సీఎస్ ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు సూచించారు. -
6లోగా ఆన్లైన్లో ఉద్యోగుల వివరాలను పొందుపరచాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను వచ్చే ఏడాది జనవరి 6వ తేదీలోగా వెబ్సైట్లో పొందుపరచాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి బీవీ రమేశ్ కలెక్టర్‌ను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఓ నంబరు 334 ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు జీవో 334కు సంబంధించి పూర్తి వివరాలను నిర్ణీత సమయంలోగా ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఈ నెల 24లోగా స్వీకరించాలని అందులో ఏమైన తప్పులు ఉంటే సరిచేసి జనవరి 6వ తేదీ నాటికి వెబ్సైట్లో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల డీడీవోలు అటెస్టేషన్ చేసి వేతనం బిల్లులతో పాటు పంపించాలన్నారు. వెబ్సైట్లో పొందుపరచని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్, జెడ్పీ సీఈవో ఆశీర్వాదం, ఇన్చార్జి డీఆర్వో సాయిలుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆదాయం, ఉద్యోగుల వివరాలివ్వొద్దు
ఆర్థిక శాఖకు మినహా ఎవరికైనా ఇస్తే క్రమశిక్షణ చర్యలు అంతర్గత సర్క్యులర్ జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ, ఉద్యోగుల వివరాల వెల్లడిపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. ఆదాయం, ఉద్యోగులకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ మినహా ఎవరు అడిగినా ఇవ్వరాదని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ అంతర్గత సర్క్యులర్‌ను గురువారం జారీ చేశారు. సర్క్యులర్‌కు విరుద్ధంగా ఎవరు వివరాలిచ్చినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ప్రాం తాల వారీగా ఆదాయ వివరాలు, ఉద్యోగుల వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే సర్క్యులర్ జారీ చేసి ఉండవచ్చుననే అనుమానాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఎవరు అడిగినా ఇవ్వాల్సి ఉంటుంద న్న విషయాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమలు చేయాల్సిన శాఖాధిపతే ఆ చట్టం నిబంధనలకు విరుద్ధంగా సర్క్యులర్ జారీ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. విభజనకు సంబంధించి కేంద్రం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు రానప్పటికీ ఆర్థిక శాఖ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సర్వీసు రిజిస్టర్ ఆధారంగా వారి స్వస్థలాల సమాచారాన్ని అంతర్గతంగా సేకరిస్తోంది. సర్వీసు రిజిస్టర్లో పేర్కొన్న స్వస్థలం ఆధారంగా ఏ జిల్లాకు చెందిన ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలను తయారు చేస్తోంది. ఏ జిల్లా నుంచి ఎంత ఆదాయం వస్తోంది. ఏ జిల్లాలో ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా సేకరిస్తోంది. ఇవన్నీ కూడా అనధికారికంగానే అంతర్గత సమాచారం పేరుతో ఉన్నతస్థాయి సూచనల మేరకు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయ, ఉద్యోగుల వివరాల సమాచారం కావాలంటూ ఎప్పుడు ఆదేశాలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకే అంతర్గతంగా సమాచార సేకరణ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.