- శాఖలవారీగా సర్దుబాటు, కేటాయింపు
- రెండో రోజూ కొనసాగిన సీఎస్ టాస్క్‌ఫోర్స్ సమీక్ష
- ఇంజనీరింగ్ విభాగాల విలీనంపై నేడు సమావేశం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు కొలువుదీరక ముందే ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలు పొందుపరిచేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆన్‌లైన్ ఫార్మాట్‌ను తయారు చేసింది. సర్దుబాటు ఎలా ఉండాలో నిర్దేశిస్తూ.. ఉద్యోగుల కేటాయింపు వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే పొందుపరచాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు.
కొత్త జిల్లాలకు అవసరమయ్యే సిబ్బంది, మౌలిక వసతుల కల్పనపై సీఎస్ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ సచివాలయంలో వరుసగా రెండో రోజు సమావేశమైంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12 విభాగాలతో సీఎస్ సమీక్షించారు. వ్యవసాయం, పశు సంవర్థకం, మార్కెటింగ్, విద్య, ప్రణాళిక, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగుల సర్దుబాటుపై చర్చించారు. విద్యా శాఖ పరిధిలో డిప్యూటీ డీఈ వోలు, అసిస్టెంట్ డెరైక్టర్లను కొత్త జిల్లాల్లో ఇన్‌చార్జీ డీఈవోలుగా నియమించాలని నిర్ణయిం చారు. తర్వాత సీనియారిటీ క్రమంలో వారికి ప్రమోషన్లు ఇచ్చే పద్ధతిని అనుసరించనున్నారు.
ఒకే గొడుగు కింద విద్యా శాఖ విభాగాలు
విద్యాశాఖ పరిధిలో ప్రస్తుతం విడివిడిగా ఉన్న సర్వశిక్ష అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, మోడల్ స్కూళ్లన్నీ ఇకపై డీఈవో పరిధిలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. దీంతో ఉద్యోగుల కొరత తీరుతుందని, సర్దుబాటు సమస్య పరిష్కారమవుతుందని చర్చించారు. మండల స్థాయిలోనూ ఇదే తీరుగా విద్యా సంబంధిత యూనిట్లను విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాఖలోనూ ఇప్పుడున్న జాయింట్ డెరైక్టర్లను రీజనల్ డెరైక్టర్లుగా నియమించనున్నారు. వీరి స్థానంలో డిప్యూటీ డెరైక్టర్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులుగా సర్దుబాటు చేయనున్నారు. దసరా నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కేవలం నలభై రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.
అందులో భాగంగానే ఉద్యోగుల తుది కేటాయింపులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా రెండు రోజుల పాటు నిర్దేశించిన శాఖల వారీ సమావేశాలను శనివారం కూడా కొనసాగించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ, పబ్లిక్ హెల్త్, రహదారులు భవనాలు తదితర శాఖల పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలపై నేడు సమీక్ష జరపనున్నారు. ఇంజనీరింగ్ విభాగాలు కొన్నింటిని విలీనం చేసే అవకాశమున్నందున, అదే కోణంలో ఉద్యోగుల కేటాయింపు ప్రతిపాదనలతో హాజరుకావాలని సీఎస్ ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు సూచించారు.