ఆన్‌లైన్‌లో గడ్డి మందు కొనుగోలు చేసి వివాహిత బలవన్మరణం
మియాపూర్: మనస్పర్థలు, కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా చత్రి మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన మొక్కపాటి వెంకట నాగలక్ష్మి(28) వివాహం భీమవరానికి చెందిన సామినేని సతీష్ తో 2018లో జరిగింది. వీరికి 2019లో కుమార్తె జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వారు విడిపోయారు. 2023 నవంబర్‌లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుమార్తె వెంకటనాగలక్ష్మి దగ్గరే ఉంటుంది. నాగలక్ష్మి కూతురుతో కలిసి మియాపూర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది.
ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 22న నాగలక్ష్మి ఏలూరు జిల్లా తోచిలుక గ్రామానికి చెందిన మువ్వా మణికంఠ మనోజ్‌ను రెండవ వివాహం చేసుకుంది. మనోజ్ సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగాయి. నాగలక్ష్మి పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని మనోజ్ తన పేరుపై నమోదు చేయాలని, బ్యాంక్ అకౌంట్‌కు తన ఫోన్ నంబర్‌ను యాడ్ చేయించాలని ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ పాస్‌వర్డ్‌లు చెప్పాలని తరచూ వేధిస్తుండేవాడు. ఇటీవల కాలంలో రెండుసార్లు ఆమెను విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
మనస్తాపం చెందిన నాగలక్ష్మి గత నెల 28వ తేదీన ఆన్‌లైన్‌లో గడ్డిమందు ఆర్డర్ చేయగా ఈ నెల 4వ తేదీ డెలివరీ అయ్యింది. కాగా బుధవారం మనోజ్, నాగలక్ష్మిల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నాగలక్ష్మి భర్త మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment