ఫోన్ ఇచ్చేస్తా... ఐస్‌క్రీమ్ తిననిస్తా
ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధుకు నజరానాలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల నగదుతో పాటు అమరావతిలో ఇంటిస్థలం ఇస్తామని ప్రకటించింది. గ్రూప్–1 స్థాయి అధికారి ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపింది. అలాగే కోచ్ గోపీచంద్‌కు 50 లక్షల రూపాయల నగదు నజరానాతో పాటు అకాడమీ ఏర్పాటు కోసం ఐదెకరాలు స్థలాన్ని కేటాయించనుంది. ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్లు, హర్యానా 50 లక్షల రూపాయలు సింధుకు ఇస్తున్నాయి. సింధుతో పాటు పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చి సహకరిస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తమ ఉద్యోగికి రూ.75 లక్షలు ప్రకటించింది.
సింధుని అంబాసిడర్ చేయాలి: చాముండేశ్వరినాథ్
సాక్షి, తిరుమల: ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన పీవీ.సింధును తెలంగాణ అంబాసిడర్‌గా ప్రకటింవచ్చని ఏపీ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ అన్నారు. ‘బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక్కరనేం లేదు కనుక.. ఇద్దరినైనా ప్రకటించవచ్చు’ అని అభిప్రాయం వ్యక్తంచేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో రజతం గెలవడం దేశానికి గర్వకారణం అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో సింధు బాగా పోరాడిందని అభినందించారు. భవిష్యత్‌లో తప్పక స్వర్ణపతకాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.
రియో: ఒలింపిక్స్ పతకం కోసం ఆరు నెలలుగా సాగిన ఓ మిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆరు నెలల కాలంలో సింధు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోయింది. తనకు ఇష్టమైన ఎన్నో రుచులను వదిలేసుకుంది. అందుకే పతకం గెలవగానే సింధుపై ఉన్న ఆంక్షలను గోపీచంద్ ఎత్తేశారు. ‘గత మూడు నెలలుగా సింధు దగ్గర ఫోన్ లేదు. నేను తీసేసుకున్నా ఇక వెంటనే సింధు ఫోన్ ఇచ్చేస్తా. అలాగే ఆమెకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ కూడా తిననిస్తా’ అని పతకం గెలవగానే గోపీ చెప్పేశారు. అంతెందుకు సింధుకు ఎంతో ఇష్టమైన ‘స్వీట్ పెరుగు’కు కూడా ఆమె గత మూడు వారాలుగా దూరంగా ఉంది. ‘గత మూడు నెలలుగా ఏం చెబితే అది చేసింది. తన ఇష్టాలను వదిలేసుకుంది. ఎక్కడా ఇది ఎందుకు అని అడగలేదు. ఈ పతకం కోసం తను ఎంత కష్టపడిందో నాకు మాత్రమే తెలుసు’ అంటూ శిష్యురాలి గురించి మురిపెంగా చెప్పుకున్నారు కోచ్.