రియోలో తంగం
సాక్షి, చెన్నై: రియోలో తమిళ తంగం (బంగారం) మెరిశాడు. తమిళ ఖ్యాతిని ఎలుగెత్తి చాటే రీతిలో, భారత దేశ క్రీడాలోకానికి మరెంతో వన్నె చేకూర్చాడు. పారాలింపిక్లో హైజంప్ విభాగంలో మారియప్పన్ తంగవేల్ బంగారు పతకం కైవసం చేసుకున్న సమాచారంతో సేలం జిల్లా పెరియవడగం పట్టి గ్రామం ఆనంద సాగరంలో మునిగింది. తమిళ సత్తాను ప్రపంచ దేశాలకు చాటిన మారియప్పకు అమ్మ జయలలిత రూ. రెండు కోట్లు ప్రకటించారు. తరగతి స్థాయిలో క్రీడల్లో ప్రేక్షకుడిగా ఓ మూలన కూర్చుని, ఇప్పుడు రియో పతకంతో హీరోగా అవతరించిన ఈ తంగంకు అభినందనలు, ప్రశంసలు హోరెత్తుతున్నాయి.
రియో వేదికగా గత నెల భారతవనితలు షట్లర్ పీవీ సింధు రాకెట్ వేగంతో వెండి, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కంచు మోత మోగించి కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. వీరిని అభినందనలతో ముంచెత్తే రీతిలో తమిళనాట అభిమానులు ఆనంద తాండ వం చేశారు. తాజాగా, తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు ఏకంగా బంగారం తన్నుకు వస్తుండడంతో తమిళులకు గర్వకారణంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఆ క్రీడాకారుడెవరో కూడా తెలియని వాళ్లు, ఇప్పుడు మా బంగారమే అని గొప్పలు చెప్పుకునే పనిలో పడడం గమనార్హం.
మా బంగారం : రియో వేదికగా ప్రస్తుతం పారాలింపిక్ పోటీలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన హైజంప్‌లో తమిళనాడుకు చెందిన ఇరవై ఏళ్ల వయసు కల్గిన క్రీడాకారుడు మారియప్పన్ తంగవేల్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడన్న సమచారం తమిళనాట ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపింది. ప్రధానంగా మారియప్ప స్వగ్రామం సంబరాల్లో మునిగింది. చిన్న పాటి గ్రామంలో బాణా సంచాల మోత రాష్ట్రాన్ని తాకింది. రాష్ట్ర వ్యాప్తంగా మారియప్పన్‌ను అభినందించే వాళ్లే. చొక్క తంగం (స్వచ్ఛమైన బంగారం) అని మారియప్పన్‌ను ప్రశంసలతో ముంచెత్తే వాళ్లే అధికం. రాష్ర్ట గవర్నర్(ఇన్) సీహెచ్ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో తదితర పార్టీల నాయకులు అభినందనలతో ముంచెత్తే పనిలో పడ్డారు. నిన్న మొన్నటి వరకు మారియప్పన్ అంటే, ఎవరో తెలియని వాళ్లకు ఇప్పడు ఆ బంగారం హీరో అయ్యాడు. ఏ నోట విన్నా, బంగారం మాటే. సోషల్ మీడియాల్లో, వాట్సాప్‌లలో మారియప్పన్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారడం విశేషం.
అమ్మ రూ. రెండు కోట్లు : మారియప్పన్‌కు బంగారం దక్కిందన్న సమాచారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత స్పందించారు. అభినందనలు తెలుపుతూ, రూ. రెండు కోట్లు ప్రకటించారు. తమిళనాడు ఖ్యాతిని ఎలుగెత్తి చాటిన మారియప్పన్, క్రీడాలపై ఉత్సాహాన్ని చూపుతున్న ఇక్కడి పిల్లలకు ఆదర్శంగా నిలిచే స్థాయి ఎదిగాడని అభినందించారు.ప్రేక్షకుడి నుంచి : సేలం నగరానికి యాభై కిమీ దూరంలో పెరియవడగం పట్టి గ్రామం ఉంది. ఇది ఓమలూరు డివిజన్ పరిధిలో కుగ్రామం. మారియప్పన్ తండ్రి తంగవేలు, తల్లి సరోజ.
ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద వాడైన మారియప్పన్ ఐదో ఏట స్కూల్‌కు వెళ్తూ, జరిగిన ప్రమాదంలో కుడి కాలు పాదం కోల్పోవాల్సి వచ్చింది. కూలి పనులకు వెళ్తే గానీ పూట గడవని ఆ కుటుంబాన్ని ఈ ప్రమాదం కృంగ దీసింది. బిడ్డను రక్షించుకునేందుకు అప్పట్లో ఆ కుటుంబం తీవ్రంగానే కష్ట పడింది. పాదం కోల్పోయినా బిడ్డ తమకు ప్రాణాలతో దక్కడం ఆనందమే. తాను దివ్యాంగుడు కావడంతో ఆటల్లో ఎవ్వరూ అక్కున చేర్చుకోక పోవడంతో తరగతి స్థాయిలో ఓ మూలన కూర్చుని ప్రేక్షకుడి పాత్ర పోషించే వాడు.
ఆరో తరగతిలో మారియప్పన్ క్రీడాస్ఫూర్తిని పీఈ మాస్టర్ రాజేంద్రన్ గుర్తించారని చెప్పవచ్చు. హైజంప్‌లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటుంటే, ఓ మూలన కూర్చుని తదేకంగా వారి ఎత్తుగడలను వీక్షించడమే కాకుండా, ఎవ్వరూలేని సమయంలో తాను సైతం అంటూ హైజంప్ చేస్తుండడం రాజేంద్రన్ కంట పడింది.
రియోకు : మారియప్పన్లో ఉన్న ఉత్సాహానికి ప్రోత్సాహం లభించినట్టు అయింది. తాను దివ్యాంగుడు అన్న విషయాన్ని మరచే స్థాయిలో అతడికి రాజేంద్రన్ శిక్షణ ఇచ్చినట్టుగా పెరియవడగం పట్టి వాసులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు, అతడి మిత్రులు ఇచ్చిన సహకారం ప్రోత్సాహం మండల స్థాయిలో పతకాలను, తదుపరి జిల్లా స్థాయిలో, తదనంతరం రాష్ట్ర స్థాయి నుంచి విదేశీ స్థాయి పోటీలకు చేర్చాయని చెబుతున్నారు. కడు పేదరికంలో పుట్టిన మారియప్పన్ అనేక సార్లు కూలి పనులకు సైతం వెళ్లినట్టు పేర్కొంటున్నారు.
ఇప్పుడు అందరి సహకారంతో రియోలో అడు పెట్టి బంగారంతో తిరిగి వస్తున్న మారియప్పన్‌కు తమ గ్రామంలో ఘన స్వాగతం పలికేందుకు అక్కడి యువత సిద్ధం అవుతున్నది. తనయుడు బంగారం పట్టాడన్న సమాచారంతో తల్లి సరోజ ఉద్వేగానికి గురి అయ్యారు. తన బిడ్డ ఈ స్థాయికి చేరడంలో అందరి సహకారం ఉందని, అమ్మ రూ. రెండు కోట్లు ప్రకటించడం ఆనందంగా ఉందంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక, రియో నుంచి మారియప్పన్ మీడియాతో మాట్లాడుతూ అమ్మ జయలలిత క్రీడాకారులకు మంచి సహకారం అందించారని, అందిస్తూనే ఉన్నారని పేర్కొంటూ, అమ్మతో పాటు అందరికీ తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.