సీఎం అవుదామని.. ఓటమి అంచుల్లో!
ఉత్తరప్రదేశ్‌లోని యాదవ్ కుటుంబంలో చెలరేగిన చిచ్చులో.. పార్టీ ఆధిపత్యం ములాయం వర్గానికి వచ్చి ఉంటే ముఖ్యమంత్రి కూడా అవ్వాలని భావించిన ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ ఘోరంగా దెబ్బతిన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా టికెట్ ఇవ్వండి, పోటీచేసి గెలుస్తానని ధీమాగా చెప్పిన అపర్ణ.. లక్నో కంటోన్మెంటు నియోజకవర్గంలో బీజేపీ నాయకురాలు రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమి అంచుల్లో ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రీటా బహుగుణకు 52,856 ఓట్లు రాగా, అపర్ణాయాదవ్‌కు 25,925 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి యోగేష్ దీక్షిత్ 13,194 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. దాదాపు 27వేల ఓట్లతో వెనకబడిన అపర్ణ.. అంత తేడాను అధిగమించి ముందుకు రావడం దాదాపు అసాధ్యం.
ములాయం, సాధనాగుప్తా తనయుడైన ప్రతీక్ సతీమణి అపర్ణ. ఎస్పీకి యువ వారసురాలిగా తానే తెరపైకి రావాలని ఆమె కలలు కన్నారు. పార్టీ తరఫున భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా ఆమెలో ఉండేది. కొన్ని నెలల కిందట అఖిలేశ్, శివ్‌పాల్ మధ్య గొడవ హోరాహోరీగా సాగుతుండగా పార్టీ ప్రజాప్రతినిధి అయిన ఉదయ్‌వీర్ సింగ్ లేఖ రాస్తూ.. ములాయం రెండో భార్య కుటుంబమే సీఎం అఖిలేశ్‌ను టార్గెట్ చేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు.
పాలిటిక్స్‌లో పీజీ చేసిన అపర్ణ, మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాల కోర్సు కూడా చేశారు. అపర్ణ మంచి గాయని. నిజానికి ప్రతీక్ యాదవ్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది ఆయన తల్లి సాధన కోరిక. కానీ ప్రతీక్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండి.. వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. దాంతో సవతి కొడుకు అఖిలేష్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో కోడలు అపర్ణను సాధన ప్రోత్సహించారు. తత్ఫలితంగానే అపర్ణా యాదవ్ ముందుకు వచ్చారు.
వివాదాలతో సావాసం
బావగారు తనకు టికెట్ ఇస్తే ఎక్కడైనా గెలుస్తానని చెప్పిన అపర్ణా యాదవ్‌కు ఆమె కోరుకున్న లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచే అవకాశం కల్పించారు. అయితే, ఎన్నికలకు కొద్ది ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన సీనియర్ మోస్ట్ నాయకురాలు రీటా బహుగుణ జోషి ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆమెను ఢీకొంటానని చెప్పిన అపర్ణ.. ముందునుంచి వివాదాలతో సావాసం చేశారు. లక్నోలో ఓ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీ దిగడాన్ని ఆమె సమర్థించుకున్నారు. ఇందులో తప్పేముందని, మోదీ అందరికీ ప్రధాని అని, తన మామ ములాయం కూడా ఆయనతో ఫొటోలు దిగారని చెప్పారు.