RK guptha
-
కృష్ణా బోర్డు నుంచి గుప్తా ఔట్
►తెలంగాణ విజ్ఞప్తి మేరకు తొలగించిన కేంద్రం ►గోదావరి బోర్డు సభ్య కార్యదర్శికి అదనపు బాధ్యతలు ►తెలంగాణ అభిప్రాయం కోరకుండానే ప్రాజెక్టుల ►నియంత్రణపై మొండిగా వ్యవహరించిన గుప్తా సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్య కార్యదర్శి పదవి నుంచి ఆర్కే గుప్తాను తొలగిస్తూ కేంద్ర జల వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల నియంత్రణ అంశంలో గుప్తా వ్యవహార శైలి వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్న సమీర్ ఛటర్జీని గుప్తా స్థానంలో నియమించింది. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న గుప్తా.. కృష్ణా బోర్డు మొదట్నుంచీ సభ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతోపాటు తుంగభద్ర బోర్డు చైర్మన్‌గా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కృష్ణా జలాల నీటి వినియోగం, విడుదలకు సంబంధించిన ఎలాంటి అంశాల్లో అయినా గుప్తా తీసుకునే నిర్ణయాల ఆధారంగానే ఆదేశాలు వెలువడుతుంటాయి. నీటి పంపకాల్లో ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తొలి నుంచీ గుప్తాపై తెలంగాణ గుర్రుగా ఉన్నా.. ఆయనపై నేరుగా కేంద్రానికి ఏనాడూ ఫిర్యాదు చేయలేదు. అయితే ఇటీవల కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే అంశంలో గుప్తా కొంత మొండిగా వ్యవహరించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనందున ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవసరం లేదని పలు వేదికలపై తెలంగాణ పదేపదే విన్నవిస్తున్నా.. వాటిని గుప్తా పట్టించుకోకుండా డ్రాప్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేసి, దాన్ని ఆమోదించాలంటూ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. ప్రాజెక్టుల నియంత్రణ నోటిఫికేషన్‌పై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా కేంద్రానికి పంపడంపై బోర్డు సమావేశంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయినా పట్టించుకోని గుప్తా.. పదిహేను రోజుల్లో నియంత్రణ అంశంపై అభిప్రాయం చెప్పకుంటే ఆమోదం తెలిపినట్లుగా పరిగణిస్తామంటూ రాష్ట్రానికి లేఖలు రాశారు. ఈ లేఖలతో అగ్గిమీద గుగ్గిలమైన తెలంగాణ.. గుప్తా వ్యవహారాన్ని నేరుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేసింది. పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డెరైక్షన్‌లో గుప్తా పనిచేస్తున్నారని, ఆయన వల్లే వివాదాలు జటిలం అవుతున్నాయని వివరించింది. దీనిపై వివిధ వర్గాల నుంచి సమాచారం తీసుకున్న కే ంద్ర జల వనరుల శాఖ గుప్తాను బోర్డు బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. -
ఏపీకి తాగునీరివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. సాగర్‌లో ప్రస్తుతం 507.10 అడుగుల వద్ద నీరుందని, 503.50 అడుగుల కింది వరకు వెళ్తే సుమారు 5.89 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని పేర్కొంది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉందని, అందుకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా సోమవారం రాత్రి లేఖ రాశారు. బోర్డు చైర్మన్‌కు వీడ్కోలు.. కృష్ణా బోర్డు చైర్మన్ నాథన్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జలసౌధలోని బోర్డు కార్యాలయంలో అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు. నాథన్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గోదావరి బోర్డు చైర్మన్ రామ్శరణ్కే మరోమారు కృష్ణా బోర్డు తాత్కాలిక పగ్గాలను కేంద్రం అప్పగించే అవకాశం ఉంది. -
శ్రీశైలం డ్యాం ను సందర్శించిన కృష్ణా రివర్‌బోర్డు కార్యదర్శి
శ్రీశైలం ప్రాజెక్టు(కర్నూలు): శ్రీశైలం జలాశయాన్ని శనివారం కృష్ణా రివర్‌బోర్డు కార్యదర్శి ఆర్కె గుప్తా సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఆయన జలాశయాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటి లభ్యత, వర్షాభావ పరిస్థితులు, గ్యాలరీ పనులు, ప్రస్తుతం డ్యాం వద్ద జరుగుతున్న వార్షిక మెయింటెనెన్స్ పనులను ఆయన పరిశీలించారు. పరిశీలన అనంతరం శ్రీశైల జలాశయానికి సంబంధించిన ఇంజనీర్లతో ఆయన సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కార్యదర్శి ఆర్కె గుప్తతో పాటు చీఫ్ఇంజనీర్ చిట్టిబాబు, ఎస్ఈ రాంబాబు, ఈఈ మాణిక్యాల రావు, ఇతర ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు.