RLDA
-
రూ.660 కోట్లతో తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో తిరుపతి, నెల్లూరు స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.660 కోట్లను వెచ్చించి మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్‌లుగా ఈ రెండు స్టేషన్లను తీర్చి దిద్దనున్నారు. ఇందుకోసం రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) టెండర్లు ఆహ్వానించింది. ముందుగా నిర్మాణ సంస్థలకు అవగాహన కల్పించేందుకు ఆన్లైన్లో ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించగా జీఎంఆర్, ఒబెరాయ్, ఆంబియెన్స్, అదానీ గ్రూప్, గోద్రేజ్ ప్రాపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రా, శోభా, బ్రిగేడ్, ఎంబసీ గ్రూప్ తదితర నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. జూన్ రెండో వారంలో టెండర్లను ఆర్ఎల్డీఏ ఖరారు చేయనుంది. టెండర్లు ఖరారైన తర్వాత మూడేళ్లలోపు రీ డెవలప్మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసి నిర్వహణకు 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో షాపింగ్, సినిమా హాళ్లు, హాస్పిటాలిటీ, ఫుడ్ కోర్టులు, క్లోక్ రూంలు, వసతి గృహాలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు వంటివి ప్రపంచ స్థాయిలో నిర్మాణం చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకు వస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను రూ.530 కోట్లతో, నెల్లూరు స్టేషన్‌ను రూ.130 కోట్లతో రీ డెవలప్మెంట్ చేయనున్నారు. పీపీపీ విధానంలో అభివృద్ధి ► డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) విధానంలో పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద అభివృద్ధి చేస్తారు. ► కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసి 60 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ► తిరుపతి, నెల్లూరులలో ఉన్న రైల్వే భూములు వాణిజ్య అభివృద్ధికి, డెవలపర్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ఉపయోగపడతాయి. ► ఈ సందర్భంగా ఆర్ఎల్డీఏ వైస్ చైర్మన్ వేద ప్రకాష్ దుడేజా మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్ ఆ ప్రాంతాల వాణిజ్య అభివృద్ధికి, పర్యాటక సామర్థ్యం, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడుతుంది అన్నారు. -
రైల్వే స్థలాల లీజుతో రూ. వెయ్యి కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిరుపయోగంగా ఉన్న సొంత స్థలాలను ఆదాయార్జనకు ఉపయోగించుకోవడంపై రైల్వేస్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వాణిజ్యపరంగా అనువైన ప్రాంతాల్లో స్థలాలను (కమర్షియల్ సైట్లు) లీజుకిచ్చి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సుమారు రూ. 1,000 కోట్లు ఆదాయం సాధించాలని రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) లక్ష్యంగా నిర్దేశించుకుంది. రైల్వేస్టేషన్లలో మల్టీఫంక్షనల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు సంబంధించి గురువారం ఇక్కడ ప్రి-బిడ్ సమావేశం నిర్వహించిన సందర్భంగా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం జీఎం అనిల్ కుమార్ గుప్తా ఈ విషయాలు తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖతో పాటు ఇతర రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇలాంటి స్థలాలను గుర్తించినట్లు ఆయన వివరించారు. వీటిని సుమారు 35-45 ఏళ్ల దాకా లీజుకివ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 502 హెక్టార్ల విస్తీర్ణం ఉండే 53 కమర్షియల్ సైట్లు తమ చేతిలో ఉన్నాయని, వీటి ద్వారా రూ. 7,000 కోట్ల దాకా ఆదాయం వచ్చే అవకాశముందని గుప్తా చెప్పారు. ఈ స్థలాలు షాపింగ్ మాల్స్, హోటళ్ళు, ఇతర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనువుగా ఉంటాయన్నారు. ప్రయాణికుల కోసం ఎంఎఫ్‌సీలు.. ప్రముఖ పర్యాటక స్థలాల్లోని రైల్వేస్టేషన్లలో ఖాళీగా ఉన్న స్థలాలను ఉపయోగంలోకి తేవడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పించే దిశగా మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్‌లను (ఎంఎఫ్సీ) ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. వీటిలో బడ్జెట్ హోటల్స్, ఏటీఎంలు, బుక్‌స్టాల్స్ మొదలైన సదుపాయాలు ఉంటాయని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సుమారు 164 ఎంఎఫ్‌సీల కోసం లీజుకిచ్చే స్థలాల ద్వారా మొత్తం రూ.300-400 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ల ఆవరణలో సుమారు 1,000-3000 చ.మీ.ల విస్తీర్ణంలో ఇవి ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో కాచిగూడ, ధర్మవరం, కరీంనగర్, కర్నూలు పట్టణం, నెల్లూరు, నిజామాబాద్, విజయవాడ, జహీరాబాద్ వంటి 8 రైల్వేస్టేషన్లలో ఎంఎఫ్సీలకి స్థలాలని లీజుకిచ్చే దిశగా బిడ్లను ఆహ్వానించినట్లు ఆయన వివరించారు. వీటి ద్వారా సుమారు రూ. 25 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. గురువారం జరిగిన కార్యక్రమానికి 15 మంది దాకా బిడ్డర్లు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం 75 ఎంఎఫ్‌సీలకు బిడ్డింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి 2 ఏళ్ల లోగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాంటలూన్స్, కెఫే కాఫీ డే, టాటా గ్రూప్‌లో భాగమైన జింజర్ హోటల్స్ వంటి సంస్థలు.. ఎంఎఫ్సీలపై ఆసక్తి చూపినట్లు గుప్తా పేర్కొన్నారు. మొత్తం మీద ఎంఎఫ్‌సీల లీజు కాలం పూర్తయ్యే నాటికి ఒకవైపు ఆదాయంతో పాటు సుమారు రూ. 1,000 కోట్ల విలువ చేసే నిర్మాణాలు కూడా రైల్వేస్‌కి దఖలు పడగలవని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంఎఫ్‌సీల కోసం లీజుకిచ్చే స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న దానిపై పరిమితులు ఉంటాయని గుప్తా చెప్పారు. అదే కమర్షియల్ సైట్లలో మాత్రం ఎటువంటి ఆంక్షలు ఉండవని వివరించారు. స్థలాల లీజు ప్రక్రియకు నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ కన్సల్టింగ్ సర్వీసులు అందిస్తోంది.