రైల్వే స్థలాల లీజుతో రూ. వెయ్యి కోట్లు
రైల్వే స్థలాల లీజుతో రూ. వెయ్యి కోట్లు
Published Fri, Sep 13 2013 2:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిరుపయోగంగా ఉన్న సొంత స్థలాలను ఆదాయార్జనకు ఉపయోగించుకోవడంపై రైల్వేస్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వాణిజ్యపరంగా అనువైన ప్రాంతాల్లో స్థలాలను (కమర్షియల్ సైట్లు) లీజుకిచ్చి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సుమారు రూ. 1,000 కోట్లు ఆదాయం సాధించాలని రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) లక్ష్యంగా నిర్దేశించుకుంది. రైల్వేస్టేషన్లలో మల్టీఫంక్షనల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు సంబంధించి గురువారం ఇక్కడ ప్రి-బిడ్ సమావేశం నిర్వహించిన సందర్భంగా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం జీఎం అనిల్ కుమార్ గుప్తా ఈ విషయాలు తెలిపారు.
రాష్ట్రంలోని విజయవాడ, విశాఖతో పాటు ఇతర రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇలాంటి స్థలాలను గుర్తించినట్లు ఆయన వివరించారు. వీటిని సుమారు 35-45 ఏళ్ల దాకా లీజుకివ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 502 హెక్టార్ల విస్తీర్ణం ఉండే 53 కమర్షియల్ సైట్లు తమ చేతిలో ఉన్నాయని, వీటి ద్వారా రూ. 7,000 కోట్ల దాకా ఆదాయం వచ్చే అవకాశముందని గుప్తా చెప్పారు. ఈ స్థలాలు షాపింగ్ మాల్స్, హోటళ్ళు, ఇతర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనువుగా ఉంటాయన్నారు.
ప్రయాణికుల కోసం ఎంఎఫ్‌సీలు..
ప్రముఖ పర్యాటక స్థలాల్లోని రైల్వేస్టేషన్లలో ఖాళీగా ఉన్న స్థలాలను ఉపయోగంలోకి తేవడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పించే దిశగా మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్‌లను (ఎంఎఫ్‌సీ) ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. వీటిలో బడ్జెట్ హోటల్స్, ఏటీఎంలు, బుక్‌స్టాల్స్ మొదలైన సదుపాయాలు ఉంటాయని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సుమారు 164 ఎంఎఫ్‌సీల కోసం లీజుకిచ్చే స్థలాల ద్వారా మొత్తం రూ.300-400 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ల ఆవరణలో సుమారు 1,000-3000 చ.మీ.ల విస్తీర్ణంలో ఇవి ఉంటాయని చెప్పారు.
రాష్ట్రంలో కాచిగూడ, ధర్మవరం, కరీంనగర్, కర్నూలు పట్టణం, నెల్లూరు, నిజామాబాద్, విజయవాడ, జహీరాబాద్ వంటి 8 రైల్వేస్టేషన్లలో ఎంఎఫ్‌సీలకి స్థలాలని లీజుకిచ్చే దిశగా బిడ్లను ఆహ్వానించినట్లు ఆయన వివరించారు. వీటి ద్వారా సుమారు రూ. 25 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. గురువారం జరిగిన కార్యక్రమానికి 15 మంది దాకా బిడ్డర్లు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం 75 ఎంఎఫ్‌సీలకు బిడ్డింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి 2 ఏళ్ల లోగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాంటలూన్స్, కెఫే కాఫీ డే, టాటా గ్రూప్‌లో భాగమైన జింజర్ హోటల్స్ వంటి సంస్థలు.. ఎంఎఫ్‌సీలపై ఆసక్తి చూపినట్లు గుప్తా పేర్కొన్నారు.
మొత్తం మీద ఎంఎఫ్‌సీల లీజు కాలం పూర్తయ్యే నాటికి ఒకవైపు ఆదాయంతో పాటు సుమారు రూ. 1,000 కోట్ల విలువ చేసే నిర్మాణాలు కూడా రైల్వేస్‌కి దఖలు పడగలవని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంఎఫ్‌సీల కోసం లీజుకిచ్చే స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న దానిపై పరిమితులు ఉంటాయని గుప్తా చెప్పారు. అదే కమర్షియల్ సైట్లలో మాత్రం ఎటువంటి ఆంక్షలు ఉండవని వివరించారు. స్థలాల లీజు ప్రక్రియకు నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ కన్సల్టింగ్ సర్వీసులు అందిస్తోంది.
Advertisement