సామర్థ్యాన్ని బట్టి శాఖలు...
సతీష్ జారకీహోళీ పై పరమేశ్వర్ పరోక్ష విమర్శలు
బెంగళూరు: ‘వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తారు, అందరికీ మంచి శాఖలే కావాలంటే ఎలా? ఇచ్చిన శాఖను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి’ అంటూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు పరమేశ్వర్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సతీష్ జారకీహోళీపై పరోక్ష విమర్శలు చేశారు. బుధవారమిక్కడ తన నివాసంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలిసి సతీష్ జారకీహోళీ రాజీనామా వెనక్కు తీసుకునేలా ఒప్పిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సతీస్ జారకీహోళీ రాజీనామాను తనకు పంపారని, పదవికి రాజీనామా చేసినా పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు.
ఒకవేళ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు సతీష్ జారకీహోళీ అంగీకరించకపోతే పార్టీని రాష్ట్రంలో మరింత పటిష్టం చేసేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. ఇక పోర్ట్ఫోలియో మార్పును కోరుతూనే సతీష్ జారకీహోళీ రాజీనామా చేశారనే అంశంపై తనకెలాంటి సమాచారం లేదని పరమేశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన సతీష్ జారకీహోళీ ఏదో చిన్నపాటి మనస్పర్థ కారణంగా రాజీనామా చేసి ఉండవచ్చని, అయితే అవన్నీ చర్చల ద్వారా సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.