rock art
-
1,500 ఏళ్ల క్రితమే పట్నం చిత్రాలు?
సాక్షి, హైదరాబాద్: కొమురవెల్లి మల్లికార్జున దేవాలయం, ఇతర దేవాలయాల్లోనూ జాతరలసమయంలో పట్నం ముగ్గు వేయడం ఆచారం. అయితే దాదాపు 1,500 ఏళ్ల కిందటే ఈ తరహా చిత్రాలను ఓ పెద్ద బండరాతిపై వేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. చూడడానికి కొంత భిన్నంగా ఉన్నా.. అది పట్నం ముగ్గు లాంటిదేనని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. ఆదిమానవులు బండ రాళ్లపై చెట్ల పసరు, జంతు రక్తం, చమురు, రంగురాళ్ల పొడితో ఎర్ర రంగు తయారుచేసి గీసిన బొమ్మలు చాలాచోట్ల వెలుగు చూశాయి. అలాగే ఇక్కడ కూడా ఎర్ర రంగుతో ఈ చిత్రాలు వేసి ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామ శివారులోని అడవిలో శితారి (చిత్తారు)గట్టు మైసమ్మ గుట్టమీద వీటిని గుర్తించారు. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శివానంద వెలుగులోకి తెచ్చారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. అందులో వృత్తం, వాటిలోపల మళ్లీ వృత్తాలు, మధ్యలో చేతులెత్తి నిలబడ్డ మనిషి ఆకృతిని పోలిన చిత్రం, వృత్తం నుంచి బయటకు పొడుచుకొచ్చినట్టుగా కిరణాలు గీశారు. స్థానికులు దీన్ని మైసమ్మగా కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవి మత, ధార్మిక విశ్వాసాలకు సంబంధించినవని, 1,500 ఏళ్లకు పూర్వం గీసినవై ఉంటాయని హరగోపాల్ చెప్పారు. -
రాళ్లపై 'రాత'నాలు
శిలలపై శిల్పాలు చెక్కి సృష్టికే అందాలు తెచ్చినవారు కొందరైతే.. రాళ్లపై అక్షరాలను రతనాలుగా మలిచి చెక్కుచెదరని జ్ఞాపకాలను పదిలపర్చుకునేలా చేస్తున్నారు ఈ కళాకారులు. మాటల్లో చెప్పలేని మధుర స్మృతులు, గత కాలపు వైభవాన్ని ఏళ్లపాటు చెరగని ముద్రలు వేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు.ఆ వాక్యం స్ఫూర్తిమంతంగా నిలిచేదై ఉండొచ్చు. జీవన గమనాన్ని మలిచేది కావచ్చు. ఇలా ఎలాంటి జ్ఞాపకమైనా సమ్‌థింగ్ స్పెషలే కదా. అలాంటి మెమరీస్‌ను అందంగా పదిలపరుస్తోంది ఈ కష్ట జీవుల కళ. రాళ్లపై అక్షరాలా.. అద్భుతమైన అక్షరానుభూతులను ద్విగుణీకృతం చేస్తున్నారు నగరంలోనిపలువురు కళాకారులు. సాక్షి, సిటీబ్యూరో :ఆదిమ కాలంలో మానవుడు తొలిసారిగా రాతిపైనే కొన్ని గుర్తులు రాశాడు. కాలగమనంలో చక్రవర్తులు, రాజులు సైతం తమ శాసనాలను రాతిపై చెక్కించేవారు. అప్పటి పాలకులు నిర్మించిన రాతి కట్టడాలపై శిల్పాలు చెక్కించేవారు. రాళ్లపై రాసిన రాతలు, శాసనాలు శతాబ్దాలుగా గడిచినా ఇప్పటికీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. ఇలాగే హైదరాబాద్ నగరం చార్మినార్ ఏర్పాటుతో ప్రారంభమైంది. గోల్కొండలోని పలు ప్రాంతాల్లో నాడు రాళ్లపై రాసిన ఆనవాళ్లు ఇప్పటికీ అబ్బురపరుస్తుంటాయి. చెరిగిపోవు.. మరిచిపోము ముచ్చటపడి నిర్మించుకున్న ఇంటికి అడిషనల్ అట్రాక్షన్ నేమ్‌ప్లేట్.. సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమ వివరాలు తెలిపేది.. పెద్ద పెద్ద కంపెనీల ఓపెనింగ్ సెరిమనీలకు గుర్తుగా నిలిచేది శిలాఫలకం. ఆత్మీయుల సమాధులపై ప్రేమను వ్యక్తపరిచేది రాతి పలక. హనుమాన్ చాలీసా కోసమైనా.. మసీదు నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసే పలకైనా.. సందర్భమేదైనా.. ఏ వేడుకైనా తమకు స్పెషల్‌గా నిలిచిపోవాలని ప్రస్తుత జనరేషన్ కోరుకుంటోంది. దీంతో ఇటీవల రాళ్లపై అక్షరాలు చెక్కే కళకు గిరాకీ పెరిగిందంటున్నారు సయ్యద్ అబ్దుల్ రఫీక్. ఎందరికో బతుకుదెరువు.. నగరంలోని మొజాంజాహీ మార్కెట్ 60 ఏళ్లుగా శిలాఫలకాల కళాకారుల అడ్డాగా ఉంది. ఇక్కడ నిత్యం రాళ్లపై అక్షరాలు చెక్కే పని నిర్విరామంగా కొనసాగుతోంది. అఫ్జల్‌గంజ్‌కు వెళ్లే దారిలో కుడివైపు వరుసగా ఈ దుకాణాలే కన్పిస్తాయి. ఒక్కో దుకాణంలో పదుల సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సుమారుగా 200 మంది కళాకారులు ఉలి, సుత్తి చేత బట్టి రాళ్లు చెక్కుతూ కన్పిస్తారు. విభిన్న ప్రాంతాల వ్యక్తులు ఇక్కడే తమకు కావాల్సిన రీతిలో ఆర్డర్లు ఇస్తుంటారు. సదరు వ్యక్లు కోరిన రీతిలో కావాలన్న భాషల్లో ఆయా సందేశాలను.. సమాచారం చెక్కి ఇస్తారు. భిన్న భాషలు.. విభిన్న డిజైన్లు వినియోగదారుల కోసం ఇక్కడ ప్రధానంగా పలు భాషల్లో అక్షరాలు చెక్కుతున్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లం, మరాఠీ తదితర భాషల్లో రాళ్లపై అక్షరాలను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. సందర్భాన్ని బట్టి ఫలకాల డిజైన్‌ను ఎంచుకుంటారు. సమాధులపై ప్రతిష్టించే పలకలపై చతరురస్రాకారంలో చిన్న చిన్నగా ఉంటాయి. మసీదుల ముందు ఏర్పాటు చేసేవి గోపురాన్ని తలపించేలా ఉంటాయి. ప్రారంభోత్సవాల్లో ఉపయోగించే పలకలు పొడవుగా పెద్దగా ఉంటాయి. ఇటీవల కంప్యూటర్ సహాయంతో తీసిన ఫొటోలను కూడా రాళ్లపై చెక్కుతున్నారు. అన్ని రంగుల్లో, వినియోగదారులు తమకు కావాల్సిన పేర్లను, సైజులను ఒక కాగితంపై రాసి ఇచ్చేస్తే ధరను బట్టి వారు కోరుకున్న రంగుల్లో అక్షరాలు చెక్కి ఇస్తారు. మూడు తరాలుగా ఇదే వృత్తి.. మా తాత ముత్తాతల నుంచీ ఈ కళపై ఆధారపడి బతుకుతున్నాం. ఆర్డర్ ఇచ్చిన రెండు మూడు రోజుల్లో డెలివరీ ఇస్తాం. వీటి ధరలు పరిమాణాన్నిబట్టి రూ.2,500 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయి. వందల ఏళ్లనాటి ఈ కళను ప్రభుత్వం ఆదరించాల్సిన అవసరముంది. – సయ్యద్ ఫయ్యాజ్ -
సౌదీ ఎడారిలో అద్భుతం..!
రియాద్, సౌదీ అరేబియా : దాదాపు 2 వేల ఏళ్ల క్రితం రాతిపై చిత్రించిన అరుదైన ఒంటె చిత్రాలను సౌదీ అరేబియా ఎడారిలో పరిశోధకులు కనుగొన్నారు. వాస్తవానికి సౌదీ అరేబియాలో ఇలాంటి చిత్రాలు లభ్యకావడం కొత్తేమీ కాదు. అయితే, ఈ సారి పరిశోధకులు కనుగొన్న ఒంటెల చిత్రాలు భారీ ఆకారంలో ఉన్నాయి. ఒకే ప్రాంతంలో దాదాపు 12 ఒంటెల చిత్రాలు ఉన్నాయని, ఇలా ఒకే చోట ఇన్ని చిత్రాలు ఉండటం అరుదని చెప్పారు. కొన్ని చిత్రాలను పూర్తిగా చెక్కకుండా వదిలేసినట్లు వెల్లడించారు. బహుశా ఈ ప్రదేశం నుంచి ప్రార్థనలు చేయడం వల్ల ఈ చిత్రాలను చెక్కి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అరేబియన్ రాక్ ఆర్ట్‌లో పెయింటింగ్, శిలలపై చెక్కడానికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. ముఖ్యంగా యుద్ధం, వేట, జంతువులకు సంబంధించిన బొమ్మలను రాక్ ఆర్ట్‌లో భాగంగా పూర్వకాలపు అరేబియన్లు చిత్రించేవారని వివరించారు. సౌదీ అరేబియా - రాక్ ఆర్ట్ : అరేబియా పెనిసులాపై ఒకే మిలియన్ సంవత్సరాల క్రితమే మనిషి నివసించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. సౌదీ అరేబియాలో 4 వేల రిజిస్టర్డ్ ఆర్కియలాజికల్ సంస్థలు ఉండగా.. అందులో 1500 రాక్ ఆర్ట్‌పై పరిశోధనలు చేస్తున్నాయి. అందుకు కారణం రాక్ ఆర్ట్‌కు సౌదీ అరేబియన్లు ఇచ్చిన ప్రాధాన్యమే. 10 వేల నుంచి 8 వేల సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో జంతువుల చిత్రాలను రాళ్లపై చిత్రించడం మొదలైంది. ముఖ్యంగా ఆవులు, ఒంటెలు, కుక్కల చిత్రాలు సౌదీ అరేబియా చారిత్రక ప్రదేశాల్లో కనిపిస్తాయి.