రాళ్లపై 'రాత'నాలు | Name Plates on Rocks Special Story | Sakshi
Sakshi News home page

రాళ్లపై 'రాత'నాలు

Published Mon, Aug 5 2019 9:00 AM | Last Updated on Thu, Aug 8 2019 12:23 PM

Name Plates on Rocks Special Story - Sakshi

శిలలపై శిల్పాలు చెక్కి సృష్టికే అందాలు తెచ్చినవారు కొందరైతే.. రాళ్లపై అక్షరాలను రతనాలుగా మలిచి చెక్కుచెదరని జ్ఞాపకాలను పదిలపర్చుకునేలా చేస్తున్నారు ఈ కళాకారులు. మాటల్లో చెప్పలేని మధుర స్మృతులు, గత కాలపు వైభవాన్ని ఏళ్లపాటు చెరగని ముద్రలు వేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు.ఆ వాక్యం స్ఫూర్తిమంతంగా నిలిచేదై ఉండొచ్చు. జీవన గమనాన్ని మలిచేది కావచ్చు. ఇలా ఎలాంటి జ్ఞాపకమైనా సమ్‌థింగ్‌ స్పెషలే కదా. అలాంటి మెమరీస్‌ను అందంగా పదిలపరుస్తోంది ఈ కష్ట జీవుల కళ. రాళ్లపై అక్షరాలా.. అద్భుతమైన అక్షరానుభూతులను ద్విగుణీకృతం చేస్తున్నారు నగరంలోనిపలువురు కళాకారులు. 

సాక్షి, సిటీబ్యూరో :ఆదిమ కాలంలో మానవుడు తొలిసారిగా రాతిపైనే కొన్ని గుర్తులు రాశాడు. కాలగమనంలో చక్రవర్తులు, రాజులు సైతం తమ శాసనాలను రాతిపై చెక్కించేవారు. అప్పటి పాలకులు నిర్మించిన రాతి కట్టడాలపై శిల్పాలు చెక్కించేవారు. రాళ్లపై రాసిన రాతలు, శాసనాలు శతాబ్దాలుగా గడిచినా ఇప్పటికీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. ఇలాగే హైదరాబాద్‌ నగరం చార్మినార్‌ ఏర్పాటుతో ప్రారంభమైంది. గోల్కొండలోని పలు ప్రాంతాల్లో నాడు రాళ్లపై రాసిన ఆనవాళ్లు ఇప్పటికీ అబ్బురపరుస్తుంటాయి.  

చెరిగిపోవు.. మరిచిపోము
ముచ్చటపడి నిర్మించుకున్న ఇంటికి అడిషనల్‌ అట్రాక్షన్‌ నేమ్‌ప్లేట్‌.. సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమ వివరాలు తెలిపేది.. పెద్ద పెద్ద కంపెనీల ఓపెనింగ్‌ సెరిమనీలకు గుర్తుగా నిలిచేది శిలాఫలకం. ఆత్మీయుల సమాధులపై ప్రేమను వ్యక్తపరిచేది రాతి పలక. హనుమాన్‌ చాలీసా కోసమైనా.. మసీదు నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసే పలకైనా.. సందర్భమేదైనా.. ఏ వేడుకైనా తమకు స్పెషల్‌గా నిలిచిపోవాలని ప్రస్తుత జనరేషన్‌ కోరుకుంటోంది. దీంతో ఇటీవల రాళ్లపై అక్షరాలు చెక్కే కళకు గిరాకీ పెరిగిందంటున్నారు సయ్యద్‌ అబ్దుల్‌ రఫీక్‌.  

ఎందరికో బతుకుదెరువు..
నగరంలోని మొజాంజాహీ మార్కెట్‌ 60 ఏళ్లుగా శిలాఫలకాల కళాకారుల అడ్డాగా ఉంది. ఇక్కడ నిత్యం రాళ్లపై అక్షరాలు చెక్కే పని నిర్విరామంగా కొనసాగుతోంది. అఫ్జల్‌గంజ్‌కు వెళ్లే దారిలో కుడివైపు వరుసగా ఈ దుకాణాలే కన్పిస్తాయి. ఒక్కో దుకాణంలో పదుల సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సుమారుగా 200 మంది కళాకారులు ఉలి, సుత్తి చేత బట్టి రాళ్లు చెక్కుతూ కన్పిస్తారు. విభిన్న ప్రాంతాల వ్యక్తులు ఇక్కడే తమకు కావాల్సిన రీతిలో ఆర్డర్లు ఇస్తుంటారు. సదరు వ్యక్లు కోరిన రీతిలో కావాలన్న భాషల్లో ఆయా సందేశాలను..  సమాచారం చెక్కి ఇస్తారు.

భిన్న భాషలు.. విభిన్న డిజైన్లు
వినియోగదారుల కోసం ఇక్కడ ప్రధానంగా పలు భాషల్లో అక్షరాలు చెక్కుతున్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లం, మరాఠీ తదితర భాషల్లో రాళ్లపై అక్షరాలను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. సందర్భాన్ని బట్టి ఫలకాల డిజైన్‌ను ఎంచుకుంటారు. సమాధులపై ప్రతిష్టించే పలకలపై చతరురస్రాకారంలో చిన్న చిన్నగా ఉంటాయి. మసీదుల ముందు ఏర్పాటు చేసేవి గోపురాన్ని తలపించేలా ఉంటాయి. ప్రారంభోత్సవాల్లో ఉపయోగించే పలకలు పొడవుగా పెద్దగా ఉంటాయి. ఇటీవల కంప్యూటర్‌ సహాయంతో తీసిన ఫొటోలను కూడా రాళ్లపై చెక్కుతున్నారు. అన్ని రంగుల్లో, వినియోగదారులు తమకు కావాల్సిన పేర్లను, సైజులను ఒక కాగితంపై రాసి ఇచ్చేస్తే ధరను బట్టి వారు కోరుకున్న రంగుల్లో అక్షరాలు చెక్కి ఇస్తారు.  

మూడు తరాలుగా ఇదే వృత్తి..   మా తాత
ముత్తాతల నుంచీ ఈ కళపై ఆధారపడి బతుకుతున్నాం. ఆర్డర్‌ ఇచ్చిన రెండు మూడు రోజుల్లో డెలివరీ ఇస్తాం. వీటి ధరలు పరిమాణాన్నిబట్టి రూ.2,500 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయి. వందల ఏళ్లనాటి ఈ కళను ప్రభుత్వం  ఆదరించాల్సిన అవసరముంది.    – సయ్యద్‌ ఫయ్యాజ్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement