rock attack
-
మరాఠా ఆందోళనలో మళ్లీ హింస
సాక్షి, ముంబై/పుణె/ఔరంగాబాద్: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని పుణెలో మరాఠాలు సోమవారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్ల కోసం నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఇద్దరు మరాఠాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పుణెలోని చకన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 40 బస్సులకు నిప్పంటించారు. మరో 50 బస్సులతో పాటు పలు ప్రైవేటు వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అయినా అల్లరిమూకలు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఆందోళనలు షోలాపూర్, ముంబైకి కూడా విస్తరించాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను అధికారులు మోహరించారు. ఫడ్నవిస్ క్షమాపణ కోరుతూ.. రాష్ట్రంలో కొందరు మరాఠాలు హింసకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ క్షమాపణ చెప్పాలని కోరుతూ మరాఠా క్రాంతి మోర్చా అనే సంస్థ పుణె బంద్‌కు పిలుపునిచ్చిందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఆస్తుల విధ్వంసానికి దిగారన్నారు. దీంతో పలువురు ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారనీ, కొందరైతే సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో దాక్కున్నారని వెల్లడించారు. నగరంలో అల్లర్లను అణచేసేందుకు ర్యాపిడ్‌యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించామన్నారు. మరాఠాలకు రిజర్వేషన్ కోరుతూ వారం రోజుల క్రితం ఇదే సంస్థ పుణెలో ఆందోళన నిర్వహించిందన్నారు. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ మరాఠాల ఆందోళన హింసాత్మక రూపం దాల్చిన నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమైంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ నేతృత్వంలో గవర్నర్‌ను కలసిన నేతలు.. రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరి ప్రాణత్యాగం మరాఠాలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 16 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల మరాఠా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాయి. కానీ రాష్ట్రంలో కొన్నిచోట్ల అవి హింసాత్మక రూపం దాల్చడంతో ఆందోళనల్ని విరమించాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరిపై మనస్తాపం చెందిన ఔరంగాబాద్ వాసి ప్రమోద్ జైసింగ్(35).. ఆదివారం రాత్రి ముకుంద్వాడీ ప్రాంతంలో ఓ రైలు ముందు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఈ విషయాన్ని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా స్నేహితులకు తెలియజేశాడు. మరోవైపు నాందేడ్‌కు చెందిన మరో వ్యక్తి సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
కశ్మీర్లో ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం
పుల్వామా/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. గస్తీకి వెళ్లివస్తున్న ఆర్మీ వాహనంపై రాళ్లవర్షం కురిపించారు. దీంతో తొలుత హెచ్చరించిన అనంతరం ఆర్మీ అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయమై ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..నౌపొరా ప్రాంతంలో రాంగ్ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆ వాహనాలను పక్కకు తీయాలని కోరేందుకు ఆర్మీ అధికారులు వాహనం దిగారని,ఆందోళనకారులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని ఆర్మీ వాహనంపై రాళ్లదాడికి పాల్పడ్డారని వెల్లడించారు. మరోవైపు కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శ్రీనగర్‌లోని కక్ సరాయ్ ప్రాంతంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపడుతున్న భద్రతాబలగాలు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు ముగ్గురు పౌరులు గాయపడినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఐదు సెకన్ల పాటు మేం చాలా భయపడ్డాం!
గువాహటి: రెండో టీ-20 మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించి.. సిరీస్‌ను సమం చేసిన ఆస్ట్రేలియా జట్టుకు బుధవారం గువాహటిలో భయానక అనుభవం ఎదురైంది. ఎవరో దుండగుడు వారు ప్రయాణిస్తున్న బస్సుపై రాయి విసిరాడు. దీంతో బస్సు అద్దం పగిలింది. భారత్‌పై విజయం అనంతరం టీమ్ బస్సులో ఆసీస్ ఆటగాళ్లు హోటల్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోయినప్పటికీ దీంతో ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. రెండో టీ20లో ఎంఎస్ ధోనీ, కేదార్ జాధవ్ వికెట్లు తీసి.. ఆసీస్ విజయానికి దోహదం చేసిన లెగ్ స్పిన్నర్ ఆడం జంపా ఈ ఘటనపై స్పందించాడు. ఈ ఘటన చాలా నిరాశ కలిగించిందని చెప్పాడు. 'అప్పుడు నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకొని.. పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వింటున్నాను. బస్సు అవతలివైపు చూస్తుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఐదు సెకన్ల పాటు మేం చాలా భయపడ్డాం. ఎవరో రాయి విసిరి ఉంటారని మా సెక్యూరిటీ గార్డు చెప్పాడు. ఇది చాలా భయంకర ఘటన. ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఈ ఘటన బాధ కలిగించింది' అని ఆడం జంపా అన్నాడు. భారత అభిమానులు క్రికెట్ అంటే పడి చస్తారని, అందుకే భారత్‌లో ప్రయాణించడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, భారత్‌లోని మెజారిటీ క్రికెట్ అభిమానులు ఇలా అనుచితంగా ప్రవర్తించరని అన్నాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఈ ఘటనతో ఆసీస్ ఆటగాళ్లు ఎవరూ నిరుత్సాహ పడలేదని జంపా చెప్పాడు. బంగ్లాదేశ్ చిట్టగ్యాంగ్‌లో కూడా ఆసీస్ టీమ్ బస్సుపై ఇలాగే రాయి దాడి ఇటీవల పర్యటనలో చోటుచేసుకుంది. గువాహటిలో టీమ్ బస్సుపై రాయి దాడి తీవ్ర భయం రేకెత్తించిందని మరో ఆసీస్ ఆటగాడు ఆరన్ ఫించ్ ట్వీట్ చేశాడు. Pretty scary having a rock thrown through the team bus window on the way back to the hotel!! pic.twitter.com/LBBrksaDXI — Aaron Finch (@AaronFinch5) 10 October 2017 Adam Zampa discusses the incident which led to Australia's bus being damaged. READ MORE: https://t.co/SbmW6HXskK pic.twitter.com/7x2ZE2lSYv — cricket.com.au (@CricketAus) 11 October 2017 -
పోలీసులపై దొంగల రాళ్ల దాడి
రామాయంపేట/చేగుంట: పశువులను అపహరించిన ఓ ముఠా సభ్యులు పోలీసులపై దాడి చేసి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద చోటుచేసుకుంది. పుల్యానాయక్‌కు చెందిన ఒక ఎద్దును, మల్లేశంకు చెందిన రెండు ఎద్దులను దొంగల ముఠా వ్యాన్‌లోకి ఎక్కించింది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ లోపే దుండగులు వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, ఏఎస్ఐ మురళి ఆధ్వర్యంలోని రామాయంపేట పోలీసులు దౌల్తాబాద్ క్రాస్ రోడ్డు వద్ద దొంగల వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు పోలీసులపై రాళ్ల దాడికి దిగి వాహనంలో చేగుంట వైపు వెళ్లారు. అయితే పోలీసులు వెంబడిస్తున్న విషయాన్ని గుర్తించి తమ వాహనాన్ని పేట్ బషీర్‌బాగ్ బషీరాబాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వదిలి పారిపోయారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ రామకృష్ణ, హోంగార్డు కుతుబుద్దీన్‌లు గాయపడ్డారు.