Rojulu Marayi
-
వహ్వా వహిదా.. తెనాలి ఫిదా
తెనాలి: సినీ రంగంలో లబ్ధప్రతిష్టులైన కళాకారులకు భారత ప్రభుత్వం అందించే సర్వోన్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2021 సంవత్సరానికి స్వీకరించనున్న ప్రసిద్ధ బాలివుడ్ నటి వహిదా రెహమాన్ తెలుగు చిత్రసీమ నుంచే బాలివుడ్‌కు వెళ్లారు. విశాఖపట్టణంలో పెరిగిన వహిదా, అక్కణ్ణుంచే సినీరంగానికి పరిచయమయ్యారు. అయితే అందరికీ తెలీని విషయం ఏమిటంటే ఆమెకు ఆంధ్రాప్యారిస్ తెనాలితోనూ అనుబంధం ఉంది. విశాఖకు ముందు ఆమె తన తల్లిదండ్రులతోపాటు కొద్దికాలం తెనాలిలో ఉన్నారు. నాట్యం నుంచి ఆమె తెరంగేట్రం చేసినందున, ఆ నాట్యకళకు శ్రీకారం చుట్టింది కళల తెనాలిలోనే అని పెద్దలు చెబుతారు. వహిదా తండ్రి మున్సిపాలిటీ అధికారి వహిదా తండ్రి రెహమాన్ పట్టణ మున్సిపాలిటీలో అధికారిగా కొంతకాలం పనిచేశారు. అందుచేత వహిదా కొత్తపేటలోని తాలూకా హైస్కూలులో చదువుకున్నారు. అప్పట్లోనే ఆమె నాట్యం నేర్చుకుని ఉంటుందని, తనకు ఆమె బ్యాచ్‌మేట్ అని సీనియర్ కళాకారుడు, ‘నూరేళ్ల తెనాలి రంగస్థలి’ గ్రంథకర్త స్వర్గీయ నేతి పరమేశ్వరశర్మ చెప్పేవారు. ఆ తర్వాత ఆమె తండ్రికి విజయవాడకు బదిలీ అయింది. అక్కడకు వెళ్లాక కూడా వహిదా నాట్య సాధన కొనసాగించింది. పట్టణానికి చెందిన రాజకీయ నాయకుడు, కళాభిమాని, కళాపోషకుడు నన్నపనేని వెంకట్రావు అప్పట్లో ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలను స్వరాజ్ టాకీస్‌లో నిర్వహించేవారు. ఒకరోజు వహిదా రెహమాన్ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన తిలకించిన వారిలో తానూ ఒకణ్ణని పరమేశ్వరశర్మ సంతోషపడేవారు. ప్రేక్షకుల మది గెలిచిన నటి తర్వాత వహిదా తాపీ చాణక్య తీసిన ‘రోజులు మారాయి’ సినిమాతో వెండితెరపై మెరిశారు. ‘ఏరువాక సాగారో’ పాటకు అద్భుతంగా నృత్యం చేశారు. ప్రజా నాట్యమండలి డప్పు కళాకారులు అమృతయ్య, ఏసుదాసులే ఆ పాటకు డప్పు వాయించారు. ఆ సినిమా ఎంత హిట్టయిందో తెలిసిందే. రోజులు మారాయి సినిమా శతదినోత్సవం తెనాలిలో జరిగినప్పుడు ఆ సినిమా హీరో అక్కినేని నాగేశ్వరరావు, వహిదా రెహమాన్ ఇద్దరూ తెనాలి వచ్చారు. అక్కినేనితోపాటు వహిదాకు తెనాలికి దగ్గర్లోని సంగంజాగర్లమూడిలో ఒక ఇంట్లో బస ఏర్పాటుచేశారు. తెనాలిలో అయితే ప్రేక్షకుల తాకిడి తట్టుకోలేమని నిర్వాహకులు భావించారు. అయినా విషయం తెలుసుకున్న ప్రేక్షకులు అనేకమంది ఆ ఇంటిని చుట్టుముట్టారట. దీంతో బసచేసిన భవనంపై నుంచి అక్కినేని, వహిదా ప్రేక్షకులకు అభివాదం చేశారని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ, ‘యోగాచార్య’ షేక్ మొహిద్దీన్ బాచ్చా ఒక సందర్భంలో చెప్పారు. చేబ్రోలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను, బిల్లులు మార్చుకునే నిమిత్తం తెనాలి వస్తుండగా మార్గమధ్యంలో సంగంజాగర్లమూడిలో నాగేశ్వరరావు, వహిదాను చూశానని వివరించారు. తెలుగు తెర నుంచే బాలివుడ్‌కు వెళ్లిన వహిదా అక్కడ ఓ వెలుగు వెలిగారు. తన అందంతోనే కాకుండా నాట్యంతో ప్రేక్షక హృదయాలు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను స్వీకరించారు. మళ్లీ ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమె కీర్తి సిగలో కలికితురాయి కానుంది. -
మా రోజులు మారాయి
జిల్లావాసుల ఆదరణ మరువలేనిదని, తమ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తమ చిత్రయూనిట్ ఎంతగానో రుణపడి ఉందని, ఈ చిత్రంతో ‘మా రోజులు మారాయి’ అని అన్నారు ‘రోజులు మారాయి’ చిత్ర హీరోలు, హీరోయిన్. ఆ చిత్ర యూనిట్ బుధవారం కాకినాడ, రాజమహేంద్రవరంలలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా వచ్చిన హీరోలు పార్వతీశం, చేతన్‌మద్దినేని, హీరోయిన్ కృతిక, దర్శకుడు మురళీకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు. సినిమా విశేషాలు వెల్లడించారు. కాకినాడ శ్రీప్రియ థియేటర్‌ను సందర్శించిన చిత్రయూనిట్‌కు థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలతో అభినందించింది. చిత్ర కథానాయిక కృతిక మాట్లాడుతూ హాస్యం, సస్పెన్స్ తో నిర్మించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందన్నారు. తనకు ‘దృశ్యం’ చిత్రం బాగా గుర్తింపు తెచ్చిందన్నారు. ‘కేరింత’ నూకరాజని పిలుస్తున్నారు రోజులు మారాయి హీరో పార్వతీశం ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : తనను ఇప్పటి వరకు ప్రేక్షకులు ‘కేరింత’ నూకరాజుగానే గుర్తిస్తున్నారని, అదే తనపేరైందని ‘రోజులు మారాయి’ హీరో పార్వతీశం పేర్కొన్నారు. స్థానిక ఆనందరీజెన్సీ హోటల్లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : స్వగ్రామం, పెరిగింది ఎక్కడ? పార్వతీశం : స్వగ్రామం పలాస, బెంగళూరులో పెరిగా. అక్కడే బీటెక్ చదివా, యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్ వచ్చేశా. సాక్షి : ఇప్పటి వరకు చేసిన సినిమాలు? పార్వతీశం : కేరింత, రోజులు మారాయి చిత్రాలు చేశాను. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా ‘నాన్నా.. నేను నా బాయ్‌ప్రెండ్స్’ చిత్రం చేస్తున్నా. హెబ్సాపటేల్ హీరోయిన్గా చేస్తుంది. సాక్షి : రోజులు మారాయి చిత్రానికి ఎలాంటి స్పందన వస్తోంది? పార్వతీశం : రోజులు మారాయి చిత్రానికి రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. మేము వెళుతున్న ప్రతి థియేటర్లో ఈ సినిమాలో పీటర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరింత నూకరాజు అనేవారు పీటర్ అంటూ పిలుస్తున్నారు. సినిమాలోని డైలాగులు నాకంటే ముందే ప్రేక్షకులు చెప్పేస్తుండడంతో చాలా ఆనందంగా ఉంది. సాక్షి : ఏ పాత్రలు చేయాలని అనుకుంటున్నారు? పార్వతీశం : ప్రకాష్‌రాజ్, నాని, అమీర్‌ఖాన్‌లు అంటే చాలా ఇష్టం. అన్ని రకాల పాత్రలలో నటించాలన్నదే తన ఆకాంక్ష. ‘తొలి సినిమాకే ఆదరణ చూపిస్తున్నారు’ రోజులు మారాయి హీరో చేతన్ మద్దినేని తాను నటించిన మొదటి సినిమా ‘రోజులు మారాయి’కి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సినిమా హీరో చేతన్ మద్దినేని పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే. ‘‘మా స్వగ్రామం విశాఖపట్నం. 15 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు యూఎస్‌లో సెటిల్అయ్యారు. యాక్టింగ్‌పై మక్కువతో హైదరాబాద్‌లో ఉంటున్నా. రోజులుమారాయి నా మొదటి సినిమా. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో ‘గల్ఫ్’సినిమాలో నటించాను. మూడు భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రోజులు మారాయి చిత్రం నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. ప్రతి థియేటర్లో నన్ను ఈజీగానే గుర్తుపట్టారు. రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా వస్తున్నారు. మేము చెప్పే డైలాగులను ముందుగానే ప్రేక్షకులు చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అన్ని రకాల పాత్రలను చేస్తాను. అంతేకాకుండా దర్శకుడు మారుతి చిత్రాల్లోనే నటిస్తా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. ఆయన వల్లే చిత్రసీమకు వచ్చా. ‘మా అమ్మమ్మ వాళ్లది రాజమహేంద్రవరమే’ రోజులు మారాయి దర్శకుడు మురళీకృష్ణ ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం) : ‘మా స్వగ్రామం కృష్ణాజిల్లా గుడివాడైనా.. అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరమే’ అని రోజులు మారాయి చిత్ర దర్శకుడు మురళీకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. మురళీకృష్ణ : ఇప్పటివరకు సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. రోజులు మారాయి నా మొదటి చిత్రం. సాక్షి : ఏయే సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. మురళీకృష్ణ : నాన్న, చిన్నారి, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. మూడింటికీ ఉత్తమ సీరియల్స్‌గా నంది అవార్డులు అందుకున్నా. అలాగే నాన్న, అమ్మమ్మ డాట్ కమ్ సీరియల్స్‌కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు వచ్చింది. సాక్షి : రోజులు మారాయి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుంది? మురళీకృష్ణ : వెళ్లిన ప్రతి చోట ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. యూత్, ఫ్యామిలీ ఎంటర్టైైనర్ సినిమా. ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది. సాక్షి : కొత్తగా దర్శకత్వం వహించే సినిమాలు మురళీకృష్ణ : నిర్మాతలు దిల్‌రాజు, జి.శ్రీనివాసరావుల తో కలిసి కొత్తగా ఒక సినిమా చేద్దామని అన్నారు. త్వరలోనే మొదలు పెడతాం. సాక్షి : సెలవులకు రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఏం చేసేవారు? మురళీకృష్ణ : అమ్మమ్మవాళ్లది రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేట. చిన్నప్పుడు సెలవులకు వచ్చినప్పుడు సైకిల్ తొక్కుకుంటూ గోదావరి గట్లపై తిరుగుతూ ఉండేవాడిని. ఎంతో ఆనందంగా ఉండేది. ఇప్పటి కీ మరిచిపోలేని అనుభూతి. మరలా రాజమహేంద్రవరం ‘రోజులు మారాయి’ విజయోత్సవ ర్యాలీకి రావడం ఆనందంగా ఉంది. -
ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ
- ‘దిల్’ రాజు ‘‘మారుతి ఓసారి నన్ను కలిసి ‘రోజులు మారాయి’ కథ చెప్పి నన్ను కూడా ఈ చిత్రంలో భాగస్వామి అవ్వమన్నాడు. తన సక్సెస్‌లు, ఎంచుకున్న రూట్ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా. మారుతి కథను దర్శకుడు మురళి చక్కగా తెరకెక్కించాడు. జేబీ మంచి పాటలిచ్చాడు. జూలై 1న చిత్రం విడుదల చేయనున్నాం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు. చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక ప్రధాన పాత్రల్లో మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో మారుతి టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్‌పై జి.శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘రోజులు మారాయి’. జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని ‘దిల్’ రాజు, ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ- ‘‘ఒక ఆర్టికల్ నుంచి పుట్టిన కథ ఇది. మేం ఏ కథ అయితే అనుకున్నామో దాన్ని యథాతథంగా మురళి తెరకెక్కించాడు. ‘దిల్’ రాజుగారితో చేస్తున్న తొలి చిత్రమిది, ఎలా వస్తుందో అనే భయముండేది. కానీ, సినిమా చూశాక చాలా ఎగ్జయిట్ అయ్యా’’ అని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు మురళీకృష్ణ మాట్లాడుతూ- ‘‘వాస్తవ సంఘటన ఆధారంగా మారుతీగారు ఈ చిత్ర కథ తయారు చేసుకున్నారు. ‘భలేభలే మగాడివోయ్’ చిత్రం కంటే ముందే ఈ చిత్రం చేద్దామనుకున్నారాయన. కానీ, ఈ కథను నాకు ఇచ్చి నన్ను దర్శకుణ్ణి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, జి. నాగేశ్వరరావు, దర్శకులు జి.నాగేశ్వర రెడ్డి, సాయి రాజేష్, హీరో రోహిత్, చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక, ‘డార్లింగ్’ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: మారుతి, సమర్పణ: ‘దిల్’ రాజు. -
‘రోజులు మారాయి’ సినిమా స్టిల్స్
-
రోజులు మారాయి..
వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘రోజులు మారాయి’. చేతన్ మద్దినేని, పార్వతీశమ్, కృతిక, తేజస్వి ప్రధాన పాత్రల్లో మురళీ కృష్ణ ముడిదానిని దర్శకునిగా పరిచయం చేస్తూ జి.శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ‘దిల్’రాజు మాట్లాడుతూ- ‘‘మారుతి కథలు ప్రధానంగా యువతను ఆకట్టుకుంటాయి. కానీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బిజినెస్ ట్రేడ్‌లో సూపర్ క్రేజ్ రావడం విశేషం. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర, హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సారధ్యం: గుడ్ సినిమా గ్రూప్, సహ నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్