వహ్వా వహిదా.. తెనాలి ఫిదా | - | Sakshi
Sakshi News home page

వహ్వా వహిదా.. తెనాలి ఫిదా

Sep 28 2023 12:44 AM | Updated on Sep 28 2023 1:04 PM

- - Sakshi

తెనాలి: సినీ రంగంలో లబ్ధప్రతిష్టులైన కళాకారులకు భారత ప్రభుత్వం అందించే సర్వోన్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును 2021 సంవత్సరానికి స్వీకరించనున్న ప్రసిద్ధ బాలివుడ్‌ నటి వహిదా రెహమాన్‌ తెలుగు చిత్రసీమ నుంచే బాలివుడ్‌కు వెళ్లారు. విశాఖపట్టణంలో పెరిగిన వహిదా, అక్కణ్ణుంచే సినీరంగానికి పరిచయమయ్యారు. అయితే అందరికీ తెలీని విషయం ఏమిటంటే ఆమెకు ఆంధ్రాప్యారిస్‌ తెనాలితోనూ అనుబంధం ఉంది. విశాఖకు ముందు ఆమె తన తల్లిదండ్రులతోపాటు కొద్దికాలం తెనాలిలో ఉన్నారు. నాట్యం నుంచి ఆమె తెరంగేట్రం చేసినందున, ఆ నాట్యకళకు శ్రీకారం చుట్టింది కళల తెనాలిలోనే అని పెద్దలు చెబుతారు.

వహిదా తండ్రి మున్సిపాలిటీ అధికారి
వహిదా తండ్రి రెహమాన్‌ పట్టణ మున్సిపాలిటీలో అధికారిగా కొంతకాలం పనిచేశారు. అందుచేత వహిదా కొత్తపేటలోని తాలూకా హైస్కూలులో చదువుకున్నారు. అప్పట్లోనే ఆమె నాట్యం నేర్చుకుని ఉంటుందని, తనకు ఆమె బ్యాచ్‌మేట్‌ అని సీనియర్‌ కళాకారుడు, ‘నూరేళ్ల తెనాలి రంగస్థలి’ గ్రంథకర్త స్వర్గీయ నేతి పరమేశ్వరశర్మ చెప్పేవారు. ఆ తర్వాత ఆమె తండ్రికి విజయవాడకు బదిలీ అయింది. అక్కడకు వెళ్లాక కూడా వహిదా నాట్య సాధన కొనసాగించింది. పట్టణానికి చెందిన రాజకీయ నాయకుడు, కళాభిమాని, కళాపోషకుడు నన్నపనేని వెంకట్రావు అప్పట్లో ఆంధ్ర నాటక కళాపరిషత్‌ పోటీలను స్వరాజ్‌ టాకీస్‌లో నిర్వహించేవారు. ఒకరోజు వహిదా రెహమాన్‌ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శన తిలకించిన వారిలో తానూ ఒకణ్ణని పరమేశ్వరశర్మ సంతోషపడేవారు.

ప్రేక్షకుల మది గెలిచిన నటి
తర్వాత వహిదా తాపీ చాణక్య తీసిన ‘రోజులు మారాయి’ సినిమాతో వెండితెరపై మెరిశారు. ‘ఏరువాక సాగారో’ పాటకు అద్భుతంగా నృత్యం చేశారు. ప్రజా నాట్యమండలి డప్పు కళాకారులు అమృతయ్య, ఏసుదాసులే ఆ పాటకు డప్పు వాయించారు. ఆ సినిమా ఎంత హిట్టయిందో తెలిసిందే. రోజులు మారాయి సినిమా శతదినోత్సవం తెనాలిలో జరిగినప్పుడు ఆ సినిమా హీరో అక్కినేని నాగేశ్వరరావు, వహిదా రెహమాన్‌ ఇద్దరూ తెనాలి వచ్చారు. అక్కినేనితోపాటు వహిదాకు తెనాలికి దగ్గర్లోని సంగంజాగర్లమూడిలో ఒక ఇంట్లో బస ఏర్పాటుచేశారు.

తెనాలిలో అయితే ప్రేక్షకుల తాకిడి తట్టుకోలేమని నిర్వాహకులు భావించారు. అయినా విషయం తెలుసుకున్న ప్రేక్షకులు అనేకమంది ఆ ఇంటిని చుట్టుముట్టారట. దీంతో బసచేసిన భవనంపై నుంచి అక్కినేని, వహిదా ప్రేక్షకులకు అభివాదం చేశారని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ, ‘యోగాచార్య’ షేక్‌ మొహిద్దీన్‌ బాచ్చా ఒక సందర్భంలో చెప్పారు. చేబ్రోలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను, బిల్లులు మార్చుకునే నిమిత్తం తెనాలి వస్తుండగా మార్గమధ్యంలో సంగంజాగర్లమూడిలో నాగేశ్వరరావు, వహిదాను చూశానని వివరించారు. తెలుగు తెర నుంచే బాలివుడ్‌కు వెళ్లిన వహిదా అక్కడ ఓ వెలుగు వెలిగారు. తన అందంతోనే కాకుండా నాట్యంతో ప్రేక్షక హృదయాలు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డులను స్వీకరించారు. మళ్లీ ఇప్పుడు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఆమె కీర్తి సిగలో కలికితురాయి కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement