కోట్లలో మోసం..? చిక్కుల్లో రజనీ, కమల్ చిత్రాలు!
చెన్నై: తమిళ సినీ రంగంలో దిగ్గజాలతో సినిమాలను నిర్మిస్తున్న లైకా సంస్థ కోట్లాది రూపాయల మోసానికి పాల్పడిందంటూ వస్తున్న వార్తలు కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై తమిళ పత్రికల్లో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫ్రాన్స్ పోలీసులు ఆ సంస్థకు చెందిన ప్రధాన నిర్వాహకుడి సహా మొత్తం 19 మందిని అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
తపాలాశాఖ ద్వారా కోట్లాది రూపాయలను లైకా సంస్థ రహస్య చిరునామాలకు పంపిందనీ, ఆ డబ్బును అక్కడి నుంచి జర్మనీకి తరలించే ప్రయత్నం జరిగిందని తెలిసింది. ఈ విషయంపై యూరప్ దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ కు చెందిన పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, లైకా సంస్థ గతంలో శ్రీలంక కేంద్రంగా టెలికాం వ్యాపారాలను నడుపుతున్నట్లు ఆరోపణలను ఎదుర్కొంది. సంస్థ యజమాని అలీరాజా సుభాష్ కరణ్ కు బ్రిటన్, ఫ్రాన్స్ లలో సిమ్ కార్డుల వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా కార్యాలయాలను కలిగివుంది.
సినీరంగంలో నిర్మాణ సంస్థగా అడుగుపెట్టిన లైకా.. విజయ్ తో కత్తి చిత్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత రజనీకాంత్ తో 2.0, కమల్ హాసన్ తో శభాష్ నాయుడు చిత్రాలకు నిర్మాణసంస్థగా వ్యవహరిస్తోంది. విదేశాలకు అక్రమంగా రూ.129 కోట్లను తరలించారని, ఈ విషయం తెలుసుకున్న ఫ్రాన్స్ పోలీసులు సంస్థ ప్రధాన నిర్వహకుడిని అరెస్టు చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న రజనీ, కమల్ ల చిత్రాల నిర్మాణం చిక్కుల్లో పడతాయేమోనని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే, లైకా ఈ వార్తలను ఖండించింది. తమ సంస్థ ఎలాంటి మోసానికి పాల్పడలేదని ప్రకటన వెలువరించింది. సంస్థపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువునష్టం దావా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు.