రూల్సా.. రూళ్ల కర్రా!
స్పీకర్‌పై అవిశ్వాసంలో అడ్డుగా ఉన్న నిబంధనల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షంపై పెత్తనం చేయడమే లక్ష్యంగా శాసనసభ నిబంధనలను అధికారపక్షం తుంగలో తొక్కింది. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనల పర్వాన్ని సాగించింది. పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రక్షించడానికి మంగళవారం శాసనసభలో అడుగడుగునా నిబంధనలను అతిక్రమించడానికి అధికారపక్షం పాల్పడింది. స్పీకర్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై జరిగే ఓటింగ్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలూ పాల్గొనడానికి వీలుగా విప్‌కు తగిన సమయం లేకుండా చేయాలనే ఉద్దేశంతో అధికారపక్షం వ్యవహరించినట్లు సభ సాగిన తీరు స్పష్టం చేసింది.
అధికారపక్షానికి అడ్డంగా ఉన్న నిబంధనలను తొలగిస్తూ తీర్మానం చేయడం పట్ల న్యాయనిపుణులు నివ్వెరపోతున్నారు. ఇది ఒకరకంగా ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమని అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. సభ సాక్షిగా ప్రజాస్వామ్యానికి అధికారపక్షం పాతరవేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చిన 14 రోజుల తర్వాతే ఆ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలనే నిబంధన ఉన్నా, ఫిరాయింపునకు పాల్పడిన 8 మంది ఎమ్మెల్యేలను రక్షించడానికి స్పీకర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిరక్షించి, ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చర్యలు చేపట్టాల్సిన వారే.. రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రత్యక్ష సాక్షి కావడంపైనా విమర్శలు చెలరేగుతున్నాయి.
రాజ్యాంగాన్ని అనుసరించే సభ నియమావళి (బిజినెస్ రూల్స్) ఏర్పడ్డాయని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా సభ నియమావళిని వినియోగించుకోవడం అంటే.. నేరుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని పార్లమెంటేరియన్లు చెబుతున్నారు. చట్టసభలో రాజ్యాంగ ఉల్లంఘనను తీవ్ర అంశంగా పరిగణించాలని అభిప్రాయపడుతున్నారు. ‘71వ నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్ 179(సి) ప్రకారం రూపొందించారు.
స్పీకర్ తొలగింపు అంశంలో నోటీస్ ఇచ్చిన 14 రోజలు తర్వాతే అవిశ్వాసాన్ని సభలో ప్రవేశపెట్టాలని, తర్వాత చర్చ, ఓటింగ్ జరపాలని 179 (సి) నిబంధన స్పష్టంగా చెబుతోంది. రాజ్యాంగంలోని 208వ అధికరణను అనుసరించి శాసనసభ నిబంధనలు ఏర్పడ్డాయి. అంటే సభ నియమావళి రాజ్యంగానికి లోబడే ఉండాలి. నోటీసు ఇచ్చాక 14 రోజుల తర్వాతే తీర్మానం పెట్టాలని చెబుతున్న 71వ నిబంధనను సస్పెండ్ చేసి, రాజ్యాంగాన్ని అధికారపక్షం ఉల్లంఘించింది’ అని విపక్ష నేత స్పష్టం గా చెప్పినా అధికారపక్షం వెనక్కితగ్గకపోవడం బరితెగింపేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉదయం నుంచే వ్యూహరచన
ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై మంగళవారం ఉదయం నుంచే టీడీపీ వ్యూహప్రతివ్యూహాల్లో మునిగింది. చివరకు.. మంగళవారమే చర్చ చేపట్టాలని నిర్ణయించింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత వాయిదా పడిన సభ.. తిరిగి మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రారంభమయింది. స్పీకర్ తొలగింపునకు (స్పీకర్‌పై అవిశ్వాసానికి) వైఎస్సార్సీపీ ఇచ్చిన నోటీస్‌ను చర్చకు చేపడుతున్నట్లు ప్రకటించారు. నోటీస్ అందుకున్న 14 రోజుల తర్వాతే అవిశ్వాస తీర్మానం మీద చర్చకు చేపట్టాలని సభా నిబంధన 71 స్పష్టంగా చెబుతోందంటూ విపక్ష నేత వైఎస్ జగన్ ఆ నిబంధనలు చదివి వినిపించారు. అధికారపక్షం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో మేలుకున్న అధికారపక్షం.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడానికి అడ్డుగా ఉన్న 71 నిబంధనను తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికి అనుగుణంగా నిబంధన 71 తొలగించాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపిందని స్పీకర్ పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అయిందని ప్రతిపక్ష నేత అభ్యంతరం మధ్యే స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభాపతి స్థానం నుంచి కోడెల శివప్రసాదరావు దిగి బయటకు వెళ్లిపోయారు. సభాపతి స్థానంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కూర్చుని సభ నడిపించారు.
డిప్యూటీ స్పీకర్‌పై ఒత్తిడి..
చర్చకు రెండు గంటల సమయం కేటాయిస్తున్నామని, అందులో గంట సమయం అధికార టీడీపీకి, 40 నిమిషాలు ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి, 20 నిమిషాలు బీజేపీకి ఇచ్చామని తెలిపారు. మధ్యాహ్నం 1.55 గంటలకు చర్చ మొదలయింది. స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చిన వైఎస్సార్సీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి తొలుత అవకాశం ఇచ్చారు. విపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు.. పలుమార్లు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు యనమల, నారాయణ, పుల్లారావు, అచ్చెన్నాయుడు, శ్రీనివాస్ తదితరులు అడ్డుతగిలారు.
‘నిష్పాక్షింగా వ్యవహరిస్తున్న స్పీకర్’ అంటూ అధికారపక్ష సభ్యులు తమ ప్రసంగాల్లో పదేపదే చెప్పారు. స్పీకర్ వ్యక్తిగత విషయాలను సభలో ప్రస్తావించవద్దంటూ విపక్షానికి అడ్డుతగిలారు. నిబంధన 71ని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, దానిపై రూలింగ్ ఇవ్వాలని విపక్ష నేత వైఎస్ జగన్ డిప్యూటీ స్పీకర్‌ను కోరినా.. సానుకూలంగా స్పందించలేదు. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ స్పీకర్ రూలింగ్ ఇవ్వకూడదంటూ మంత్రి యనమల డిప్యూటీ స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చారు. రూలింగ్ ఇవ్వాలంటూ విపక్ష నేత డిమాండ్‌ను పట్టించుకోకుండానే అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. అనుకూలంగా 57, ప్రతికూలంగా 97 ఓట్లు వచ్చినట్లు డిప్యూటీ స్పీకర్ వెల్లడించి, తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు.