పేదలకు కార్పొరేట్ వైద్యం.. ప్రభుత్వ లక్ష్యం
► మంత్రులు పల్లె, పరిటాల
► రోటా వ్యాక్సిన్, చంద్రన్న సంచార చికిత్స ప్రారంభం
అనంతపురం మెడికల్ : పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ తరహా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో రోటా వైరస్ వ్యాక్సిన్, చంద్రన్న సంచార చికిత్స వాహనాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. పేదలు వైద్యం కోసం 50 శాతం డబ్బు వెచ్చిస్తున్నారన్నారు. దీనిని గ్రహించిన ప్రభుత్వం ఉచితంగా వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. చంద్రన్న సంచార చికిత్స పేరుతో పల్లెపల్లెకు వైద్యసేవలు తీసుకెళ్తామన్నారు.
ఈ వాహనాల్లో షుగర్, బీపీ, ఆస్తమా, మూర్ఛ, దీర్ఘకాలిక వ్యాధులు తదితర వాటికి ఉచితంగా చికిత్స చేయనున్నట్లు చెప్పారు. డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అనంతరం చిన్నారులకు రోటా వ్యాక్సిన్‌ను వేశారు. ‘చంద్రన్న సంచార చికిత్స’ వాహనానికి మంత్రి సునీత జెండా ఊపగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనాన్ని నడిపి ప్రారంభించారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చమన్‌సాహెబ్, ఎమ్మెల్సీ శమంతకమణి జేసీ-2 ఖాజామొహిద్దీన్, వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ రావెల సుధీర్‌బాబు, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, జాతీయ ఆరోగ్య మిషన్ డీపీఎంఓ డాక్టర్ అనిల్‌కుమార్, ఎస్ఓలు మారుతిప్రసాద్, ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.