'కర్ణాటక జల దోపిడీని అడ్డుకోండి'
కర్ణాటక జల దోపిడీని తక్షణమే కేంద్ర ప్రభుత్వం, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లాలని.. రాజకీయాలను పక్కనపెట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం, వ్యవసాయానికి మేలు జరిగేలా ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కర్నూలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. "పూడికతో తుంగభద్ర డ్యాం సామర్థ్యం తగ్గింది. దీనికి తోడు చుట్టూ 62 ఎత్తిపోత పథకాల ద్వారా 15 టీఎంసీ నీటిని చోరీ చేస్తున్నారు. వాటికి ఆ ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ సౌకర్యం కల్పించింది. సింగటలూరు ప్రాజెక్టు వల్ల మరో 40 టీఎంసీల నీటి దోపిడీ జరుగుతోంది.
ఇక పరిశ్రమలకు 3.5 టీఎంసీలు వాడుకుంటున్నామంటూ ఏకంగా 15 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఇవి కాకుండా తాజాగా భద్రపైన 30 టీఎంసీలు, తుంగపైన 30 టీఎంసీల చొప్పున 60 టీఎంసీల నీటి వినియోగంతో రెండు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇవి పూర్తయితే మనకొచ్చే 130 టీఎంసీల నీటిని తన్నుకుపోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు.. ప్రధానంగా రాయలసీమకు తీరని నష్టం జరుగుతంది" అని బెరైడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలకు అతీతంగా ఈ గండం నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలన్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేయాలన్నారు.