జిల్లాలో నష్టం రూ.500 కోట్లు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : భారీ వర్షాల కారణంగా జిల్లాలో పంటలు, ఇళ్లు, రోడ్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు అపార నష్టం వాటిల్లింది. దీని విలువ రూ. 500 కోట్లకు మించే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే క్షేత్రస్థాయి అంచనాలు ఇంకా ప్రారం భం కాలేదు. వర్షం తగ్గితే ఆదివారం నుంచి చేపట్టనున్నారు. శనివారం ఉదయం నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో శ్రీకాకుళం పట్టణమంతా నీటి ముంపునకు గురైంది. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు ప్రవహించింది. జిల్లావ్యాప్తంగా 2.15 లక్షల ఎకరాల్లో వరి, 15 వేల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 125 పశువులు మృతి చెందాయి.
గార మండలంలోని వమరవల్లి పెదచెరువుకు గండి పడటంతో 400 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు వరద బాధిత గ్రామాల్లో పర్యటించి రొట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరు మండలంలోని 3800 ఎకరాల్లో వరి, పత్తి, చెరుకు, ఇతర పంటలు దెబ్బతిన్నా యి. 86 ఇళ్లు కూలాయి. ఆమదాలవలస మండలంలో 3 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 15 ఇళ్ల గోడలు కూలాయి. బూర్జ మండలంలో 500 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో చెరుకు, 40 ఎకరాల్లో పత్తిపంటలు ముంపునకు గురికాగా 10 ఇళ్లు దెబ్బతిన్నాయి. సరుబుజ్జిలిలో 2500 ఎకరాల్లో వరి, చెరకు, ఇతర వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. వీరఘట్టం మండలంలో వేలాది ఎకరాల్లో వరి చేనుకు నల్లకంకి తెలుగు సోకింది.
సీతంపేట మండలంలో 250 ఎకరాల్లో జీడి, 70 ఎకరాల్ల అరటి, 30 ఎకరాల్లో వరి, 40 ఎకరాల్లో కంది పంటలు దెబ్బతిన్నాయి. పాలకొండ మండలంలో 2 వేల ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో చె రుకు పంటలు దెబ్బతిన్నా యి. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల పొలాల్లోని నీరు బయటకు వెళితే నష్టం తగ్గే అవకాశం ఉందంటున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పాతపట్నం మండలం చంగుడి, సీతారాంపల్లి గ్రామాల్లో ఇళ్లు కూలి నిరాశ్రయులైన కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నాయకురాలు నల్లి సుజాత బియ్యం పంపిణీ చేశారు. హిరమండలంలో 2100 ఎకరాల్లో వరికి, 25 ఎకరాల్లో చెరుకు పంటకు నష్టం వాటిల్లింది. మూడు ఇళ్లు పూర్తిగా కూలిపోగా ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతింది.
రాజాంలో 600 ఎకరాల్లో వరి, 1116 ఎకరాల్లో పత్తి, 20 ఎకరాల్లో చెరుకు, 40 ఎకరాల్లో మొక్కజొన్న నీట మునిగాయి. 108 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నగరపంచాయతీ పరిధి లో అప్పన్నపాత్రుని చెరువుకు గండి పడింది.
సంతకవిటి మండలంలో నారాయణపురం కుడికాలువకు పడిన గండి నుంచి నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. సాయన్న చానల్ పొంగడంతో మాధవరాయపురం నుంచి బూరాడపేట గ్రామం వరకూ 3వేల ఎకరాల్లో వరి, చెరకు పంటలు నీట మునిగాయి. సిరి పురం తామరచెరువు నీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. రెల్లిగెడ్డ వంతెన మీదుగా నీరు ప్రవహించటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మిర్తివలస సమీపంలో మడ్డువలస పిల్లకాలువకు గండి పడింది. మండలంలోని 2500 ఎకరాల్లో వరి, 320 ఎకరాల్లో పత్తి, 400 ఎకరాల్లో చెరుకు, 100 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లగా 58 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
రేగిడిలో అక్కన్న అగ్రహారం బండి గెడ్డకు గండి పడడంతో వందెకరాల్లో వరిపైరు నీట మునిగింది. ఏకేఎల్ గెడ్డ తగ్గుముఖం పట్టడంతో నీటిలోనే రాకపోకలు సాగుతున్నాయి. పీహెచ్సీ సిబ్బంది ట్రాక్టర్‌పై వె ళ్లి మందులు తీసుకొచ్చారు. మండలంలో 3 వేల ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో చెరుకు, 700 ఎకరాల్లో పత్తి దెబ్బతినగా 68 గృహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మడ్డువలస రిజర్వాయర్ గేట్లు ఎత్తివేసి 20 వేల క్యూసెక్కుల నీటిని నాగావళిలోకి వదులుతున్నారు. మండలంలో 225 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో పత్తి, 50 ఎకరా ల్లో అరటి, 25 ఎకరాల్లో కూరగాయల పంటలు నాశనమయ్యాయి. పదిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం మండలాల్లో ఓ మాదిరి వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగింది. ఇప్పటి వరకు నష్టాలపై ఎటువంటి అంచనాలు తయారు చేయలేదు.