ఆర్టీసీ చార్జీల పెంపుతో జిల్లా ప్రజలపై రూ.54 కోట్ల భారం
కడప అర్బన్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులపై ఏడాదికి రూ.54కోట్లు భారం పడనుంది. పల్లె వెలుగు నుంచి హైటెక్ బస్సుల దాకా కిలో మీటర్‌కు 4పైసల నుంచి 12పైసల వరకు అదనంగా వడ్డించనున్నారు. ఈ వడ్డెన మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. కడప ఆర్టీసీ రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో రోజూ 870 బస్సులు తిరగనున్నాయి. ఈ బస్సులు నడపడం వలన ప్రతిరోజూ రూ. 60 నుంచి 70లక్షలు ఆదాయం వచ్చేది. ఈ చార్జీలు పెంచడం వలన దాదాపు రూ.70 నుంచి 85లక్షల వరకు ఆదాయం పెరగనుంది. దీంతో సరాసరి రోజుకు రూ.15లక్షల భారం ఆర్టీసీ ప్రయాణికులపై పడనుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.54కోట్లు భారం పడనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశన్నంటి సామాన్యుని పరిస్థితి దుర్భరంగా తయారైంది. సగటు ప్రయాణికుడు ఆర్టీసీని ఆశ్రయించి గమ్యానికి చేరుతున్నాడు. ఈ చార్జీలు పెరగడంతో సగటు ప్రయాణికునిపై మరింత భారం పడడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లైంది. పల్లె వెలుగు కిలో మీటర్‌కు 55పైసల నుంచి 50పైసలకు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌కు కిలో మీటర్‌కు 72పైసల నుంచి 79పైసలకు పెంచారు. డీలక్స్ బస్సులకు 80పైసల నుంచి 89పైసలకు పెంచారు. సూపర్ లగ్జరీ బస్సులకు 94 పైసల నుంచి 1.05పైసలకు పెంచారు. ఇంద్ర బస్సులకు 1.20పైసల నుంచి రూ.1.32పైసలకు పెంచారు.