హైదరాబాద్లో 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్, ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: పన్ను ఎగవేసి తిరుగుతున్న హై ఎండ్ లగ్జరీ కార్లపై ఆర్టీఏ కొరడా ఝుళిపించింది. రవాణ శాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక దాడులు చేసి 11 వాహనాలను సీజ్ చేశారు. వివరాలు... డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ కె.పాపారావు నేతృత్వంలో మోటారు వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్ అయిన ఈ లగ్జరీ కార్లు రవాణా శాఖకు జీవితకాల పన్ను చెల్లించకుండా హైదరాబాద్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్నెల్లుగా ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి పథకం ప్రకారం దాడులు నిర్వహించి 11 కార్లను సీజ్ చేశారు.
జఫ్తు చేసిన వాహనాల నుంచి జీవితకాల పన్ను రూపంలో రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశంఉంది. సీజ్ చేసిన వాటిలో మెర్సెడస్ బెంజ్, మాసరట్టి, పెర్రారి, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గీని తదితర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. హై ఎండ్ వాహనాలపై దాడులు నిర్వహించడం ఆర్టీఏ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి కావడం గమనార్హం.