ఆర్టీసీ బస్సు బోల్తా
నెల్లూరు ,ఆత్మకూరు: నంద్యాల నుంచి నెల్లూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బోల్తాపడిన ఘటన ఆత్మకూరు మండలంలోని వాశిలి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బస్సు పొలాల్లో ఒరిగి నిలిచిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. 15 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి 10 గంటలకు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి అదే డిపోకు చెందిన సెమీలగ్జరీ ఆర్టీసీ బస్సు నెల్లూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఆత్మకూరు మండలంలోని వాశిలి గ్రామ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై విపరీతంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నెల్లూరు నుంచి బద్వేల్ వైపు ఓ లారీ వేగంగా వస్తుండడంతో బస్సు దానిని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుకు ఎడమవైపు పొలాల వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. తక్కువ వేగంతో ప్రయాణం చేసుండడంతో పెను ప్రమాదం తప్పిందని బస్సు సిబ్బంది పేర్కొన్నారు.
గాయపడిన వారు
నంద్యాలకు చెందిన ఎం.శాంతి, ఎం.గ్రీష్మ, కె.కృష్ణజ, పి.రామలింగం, పి.నాగరాజా, పి.శ్రీవిద్య, కర్నూలు జిల్లా గంగులపల్లికి చెందిన టి.సురేంద్ర, రుద్రవరానికి చెందిన వి.వెంకటలక్ష్మి, నెల్లూరు జిల్లా సీతారామపురానికి చెందిన డి.మహేశ్వర్రెడ్డి, ఆత్మకూరుకు చెందిన బి.అనిల్, బి.మహేష్, గోవింద్పల్లికి చెందిన బి.ప్రసాద్, కలువాయికి చెందిన సీహెచ్ చిన్నమ్మ, మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు, బుచ్చి 108 సిబ్బంది క్షతగాత్రులను మండల కేంద్రమైన సంగంలోని ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. అక్కడ వారికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ఆత్మకూరు ఎస్సై పి.నరేష్ సిబ్బందితోపాటు సంగం ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలాన్ని డీటీసీ శివరామప్రసాద్, ఆత్మకూరు ఎంవీఐ ఎస్కే బాబు సిబ్బంది పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.