భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలి
ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి
పట్నంబజారు : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి సూచించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో శనివారం రీజియన్ పరిధిలోని 13 డిపోల మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్చార్జిలు, గ్యారేజీ ఇన్చార్జిలు, స్టోర్ సూపర్ వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 12 రోజులపాటు జరిగే పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ వారి విధులను బాధ్యతగా నిర్వర్తించాలని చెప్పారు. ఇతర రీజియన్ల నుంచి గుంటూరు రీజియన్‌కు 500 బస్సులు వస్తున్నాయని, మూడు వేల మంది అదనపు సిబ్బంది వస్తున్నారని తెలిపారు. అమరావతి, సీతానగరం, తాళాయపాలెం, విజయపురిసౌత్, దైద, సత్రశాల, పొందుగల, పెనుమూడితో పాటు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వివరించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీటీఎంలు సీహెచ్ వెంకటేశ్వరరావు, వాణిశ్రీ, సీఎంవోలు శరత్‌బాబు, గంగాధర్, ట్రాఫిక్ అధికారి బెనర్జి, 13 డిపోల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.