rto officer
-
అత్తాపూర్ ఆర్డీవోకు రూ.10వేలు జరిమానా
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో 1989–2015 మధ్యకాలంలో పనిచేసిన ఎమ్మార్వోలు, కొత్వాల్‌గూడ వీఆర్వోల వివరాలు అందజేయాలన్న 2015 నాటి ఉత్తర్వుల్ని అమలు చేయని అత్తాపూర్ ఆర్డీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు సమయాన్ని ఆర్డీవో వృథా చేశారని, దీనికి మూల్యంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు రూ.10 వేలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2015లో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదంటూ ఏటూరు భూదేవి రియాల్టీ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. విచారణకు తొలుత ప్రభుత్వ న్యాయవాది హాజరుకాలేదు. పిటిషనర్ తరఫున మామిండ్ల మహేశ్ హాజరయ్యారు. అదేరోజు మధ్యాహ్నం మరోసారి విచారణ జరిపితే ప్రభుత్వ న్యాయవాది హాజరై గడువు కావాలని కోరారు. 2015లో ఉత్తర్వులను అమలు చేయాలని, ఆర్డీవో తమ ముందు హాజరుకావాలని గత నెల 30న కోర్టు చెప్పినా అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు సమయాన్ని ఆర్డీవో వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణనను ఈ నెల 20కి వాయిదా వేసింది. 20న ఉదయం 10.30గంటలకు విచారణకు ఆర్డీవో హాజరుకావాలని ఆదేశించింది. -
డ్రైవింగ్ టెస్ట్.. ఇకపై అక్రమాలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు ఆటోమేటెడ్‌గా జరగనున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనదారుల పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కోటి రూపాయల ఖర్చుతో పనులు పూర్తిచేశారు. అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. కొత్త ట్రాక్‌లను త్వరలో ప్రారంభించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి,చిత్తూరు రూరల్: చిత్తూరు ప్రశాంత్ నగర్ ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం రోజుకు వందల సంఖ్యలో వస్తుంటారు. కానీ ఈ కార్యాలయంలో గతంలో అక్రమంగా లైసెన్స్‌లు జారీ అయ్యే అవకాశం ఉండేది. అయితే వీటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆరు నెలల క్రితం ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో పనులను ప్రారంభించారు. ఇందుకు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. రెండు రోజుల క్రితమే పనులు పూర్తి చేసి ట్రయల్ నిర్వహిస్తున్నారు. ట్రాక్ నిర్మాణం ఇలా మొత్తం ఇక్కడ 13 ట్రాక్‌లు ఉన్నాయి. ఎంవీ(మోటార్ వెహికల్)కు సంబంధించి 5 ట్రాక్‌లు ఉండగా, అందులో 8 ట్రాక్, హెయిర్‌పిన్ ట్రాక్, బ్యాలన్స్ బ్రిడ్జి ట్రాక్, రఫ్ రోడ్డు ట్రాక్, గ్రేడియంట్ వంటి ట్రాక్‌లు ఉన్నాయి. ఎల్ఎంవీ(లైట్ మోటార్ వెహికల్)లో కూడా 5 ట్రాక్‌లు ఉంటాయి. 8 ట్రాక్, పార్కింగ్, హెచ్ ట్రాక్, టీ ట్రాక్, గ్రేడియంట్లు ఉంటాయి. హెచ్ఎంవీ (హెవీ మోటార్ వెహికల్)లో మూడు ట్రాక్‌లు మాత్రమే ఉండగా, హెచ్ ట్రాక్, గ్రేడియంట్, పార్కింగ్లు ఉన్నాయి. వీటిని కొత్త విధానంలో అమలులో భాగంగా రీ మోడలింగ్ చేశారు. ఈ ట్రాక్‌ల చుట్టూ 27 సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి ట్రాక్‌లోను బొలెట్స్ (సెన్సర్‌ను అమర్చిన పోల్స్) అమర్చారు. దీంతో పాటు ఆర్ఎఫ్ రీడర్స్ 26 దాకా ఏర్పాటు చేశారు. డిస్ప్లే బోర్డులు –13, సిగ్నల్ స్తంభాలు 13, కంప్యూటర్ పరికరాలు 15, మానిటర్ 2, ఒక కియోస్క్‌లు ఉన్నాయి. ఇవి మొత్తం సర్వర్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇక్కడ ఇన్స్పెక్టర్, నెట్ వర్కింగ్ ఇంజనీర్ పర్యవేక్షిస్తుంటారు. డ్రైవింగ్ ట్రయల్‌కు వెళ్లిన వ్యక్తిని ఈ కంట్రోల్ రూమ్ నుంచే చూస్తుంటారు. ఈ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. డ్రైవింగ్ శిక్షణకు ఎలా వెళ్లాలంటే.. ఆటోమెటిక్ పద్ధతి ద్వారా ఎల్ఎల్ఆర్ పొందిన వ్యక్తులు డ్రైవింగ్ ట్రయల్‌కు ముందుగా కియోస్కీ ద్వారా ఎల్ఎల్ఆర్ నంబరు నమోదు చేసి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత కంట్రోల్ రూమ్‌లో బయోమెట్రిక్ వేయాలి. అక్కడే శిక్షణకు వెళ్లేందుకు ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాక్‌లోకి వెళ్లేముందు ఆర్ఎఫ్ రీడర్‌కు ట్యాగ్‌ను మ్యాచింగ్కు చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ముందుకు వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోను రెడ్ సిగ్నల్‌ను దాటకూడదు. సూచిక బోర్డులో ఉన్న విధంగానే 8, ఇతర ట్రాక్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సిగ్నల్ వద్ద ట్యాగ్‌ను మ్యాచింగ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలను బట్టి 3 నుంచి 5 ట్రాక్‌లను పూర్తి చేయాలి. ఇలా శిక్షణ పూర్తి చేసి, వైట్ మార్క్ వద్దకు చేరుకున్న తరువాత స్టాప్ సిగ్నల్ ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి తప్పు జరిగిన సెన్సార్ రూపంలో కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తోంది. ఆటోమెటిక్ ట్రయల్‌లో తప్పిదం జరిగినట్లు సమాచారం వస్తుంది. ఈ విధానం ద్వారా అక్రమాలకు, దళారుల వ్యవస్థకూ చెక్ పడనుంది. పనులు పూర్తయ్యాయి ట్రాక్ పనులు గత ఆరు నెలలుగా చేస్తున్నారు. పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభం అవుతుంది. ఆటోమెటిక్ విధానం ద్వారానే ట్రయల్ ఉంటుంది. సెన్సార్ సాయంతో ఈ పరీక్షలు జరుగుతాయి. దీనిపై డ్రైవింగ్ శిక్షణకు వచ్చే వారు అవగాహన కలిగి ఉండాలి. – బసిరెడ్డి, డీటీసీ, చిత్తూరు -
మీకూ విజయారెడ్డి గతే!
కామారెడ్డి క్రైం: భూమి పాసు పుస్తకాలు జారీ చేయకపోతే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుందంటూ కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఆర్డీవోను బెదిరించిన వ్యక్తిని పోలీస్ శాఖలోని ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డిగా గుర్తించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం శివారులో సదరు కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన 9.12 ఎకరాల భూమి వివాదంలో ఉంది. దీనికి సంబంధించిన పాసు పుస్తకాలు తమ పేరిట మంజూరు చేయాలని ఈ నెల 5న శ్రీనివాస్‌రెడ్డి ఆర్డీవోకు ఫోన్ చేసి చెప్పాడు. లేకపోతే విజయారెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుందని బెదిరించినట్లు ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. -
రూ.100కోట్లకు పైనే అవినీతి
సాక్షి, అమరావతి/లక్ష్మీపురం (గుంటూరు)/ఒంగోలు క్రైమ్/నెల్లూరు (క్రైమ్): ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ ఆర్‌టిఓగా పనిచేసి అటాచ్‌మెంట్‌పై విజయవాడ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిసున్న బొల్లాపల్లి శేషాద్రి కృష్ణకిశోర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆయనపై పంజా విసిరింది. ఆయనతోపాటు ఆయన బంధువులు, బినామీల ఆస్తులపై గురువారం గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోని 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరులో కృష్ణకిశోర్ ఇంటితోపాటు ఆయన బినామీలుగా చెబుతున్న రవాణాశాఖ ఏజెంట్లు చెంచయ్య, ఎల్లయ్య ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. దాడుల్లో గుర్తించిన ఇళ్లు, స్థలాలు, పొలాలు తదితర ఆస్తుల విలువ రూ.వంద కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీఓలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకిశోర్ భార్య అనురాధ, కుమారుడు సత్య కమల్ కిషోర్, తండ్రి వెంకటేశ్వర్లు, సోదరుడు శ్రీనివాస రాంప్రసాద్ నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. కృష్ణకిషోర్ తండ్రి వెంకటేశ్వర్లు గుంటూరు రవాణా శాఖలో టైపిస్ట్‌గా చేరి జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది 1989లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందగా.. ఆ స్థానంలో కృష్ణకిశోర్ 1991 జూలై 13న గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. 1997లో సీనియర్ అసిస్టెంట్‌గా అక్కడే పదోన్నతి పొందారు. 2010లో నెల్లూరు ఆర్టీవో కార్యాలయ ఏఓగా బదిలీ అయ్యారు. ఏఓగా, ఇన్చార్జి ఆర్టీవోగా నెల్లూరులో సుమారు ఆరేళ్లకుపైగా బాధ్యతలు నిర్వహించారు. స్థలాలే స్థలాలు... కృష్ణకిశోర్‌కు గుంటూరు జిల్లా ఈదులపాలెంలో 400 చ.గజాలు, సత్తెనపల్లిలో 60 గజాలు, గుంటూరు స్తంభాలగరువులో 36.78, 112 గజాల స్థలాలు, తాడికొండలో 100 గజాలు, నరసరావుపేట మండలం కాకానిలో 2.4 ఎకరాలు, 9.10 ఎకరాలు, 9.66 ఎకరాలు, 2.98 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. పిట్లవారిపాలెంలో 25 సెంట్లు, కొరిటెపాడులో 175 గజాలు, గోరంట్లలో 195.5 గజాలు, వినుకొండలో 1.7 ఎకరాలు, రెండు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు ఉన్నట్టు గుర్తించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో రామ్‌లీలా అపార్ట్మెంట్లో టి.అనూరాధ పేరు మీద రెండు ఫ్లాట్లు, సంతపేటలో మరో ఇంటిని గుర్తించారు. పలు ప్రాంతాల్లో 10 ఇళ్ల ప్లాట్లు, విశాఖ జిల్లా రామాపురంలో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను గుర్తించారు. 250 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండి, రూ.1.37లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. -
అవినీతిలో ‘బ్రేక్’
ఏసీబీ వలలో డీటీసీ కార్యాలయ ఇన్స్పెక్టర్ అప్పారావు రూ.కోట్లాది విలువైన ఆస్తులు స్వాధీనం కాకినాడ రూరల్ : కాకినాడ రవాణా శాఖ (జిల్లా ట్రాన్‌పోర్ట్ కార్యాలయం) కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనడానికి ఏసీబీ దాడులే ప్రత్యక్ష నిదర్శనంగా మారాయి. నాలుగు నెలలు తిరక్కుండానే ఏసీబీ వలలో భారీ అవినీతికి పాల్పడిన వెహికల్ ఇన్స్పెక్టర్ రావు అప్పారావు చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంలో బుధవారం ఏసీబీ అధికారుల బృందం.. అప్పారావు, అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.లక్ష నగదు, వ్యవసాయ భూముల పత్రాలు, కాకినాడ, పరిసర ప్రాంతాల్లో భవనాలు, ఖాళీ స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. గత మే నెలలో ఇదే కార్యాలయానికి చెందిన డీటీసీ ఆదిమూలం మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేసి, రూ.కోట్లాది విలువైన ఆస్తులను సీజ్ చేశారు. తాజా సంఘటనతో రవాణా శాఖాధికారి కార్యాలయ సిబ్బంది, అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాఉంటే బుధవారం రవాణా శాఖ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ రావు అప్పారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో దుర్గా విద్యుత్‌నగర్‌లోని ఆయన నివాసంతో పాటు రమణయ్యపేట, అనపర్తి, నాగమల్లితోట జంక్షన్, రమణయ్యపేటల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు నిర్వహించి, రూ.కోట్లాది ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాగమల్లితోట జంక్షన్ సమీపంలో అప్పారావు డ్రైవర్ శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేయగా, భారీగా భూముల పత్రాలు లభ్యమయ్యాయి. రామారావు స్నేహితుడైన బొడ్డు రామారావు ఇంటి నుంచి రూ.కోట్లాది విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పది ఎకరాల పొలం, రమణయ్యపేట, తిమ్మాపురం, కాకినాడ, వాకలపూడి ప్రాంతాల్లో 3,500 గజాల స్థలాల డాక్యుమెంట్లు, కారు, పలు భవనాల పత్రాలు బయటపడ్డాయి. బొడ్డు రామారావు కోటేశ్వరుడైనా అతడికి తెల్లరేషన్ కార్డు, అతడి భార్య పేరిట కారు ఉందని ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపారు. వడ్డీ వ్యాపారం కూడా.. నాగమల్లితోట జంక్షన్‌లోని సత్యనారాయణ అనే మరో స్నేహితుని ఇంట్లో కూడా భారీగా ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. ఇతడితో రూ.కోట్లలో వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. తుని, రౌతులపూడిల్లో భూములున్నట్టు అధికారులు కనుగొన్నారు. బొడ్డు రామారావు రూ.80 లక్షలకు పైగా వడ్డీకి ఇచ్చినట్టు ప్రామిసరీ నోట్లు, వాటి వివరాలు వెలుగుచూశాయి. బిక్కవోలు మండలం రామవరంలో రామారావు బావమరిది చిర్ల లక్ష్మణరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. గత 18 ఏళ్లుగా అప్పారావు కాకినాడ కార్యాలయంలోనే ఉండడమే కాకుండా, కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు వివరించారు. గురువారం దాడులు కొనసాగుతాయని, మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందన్నారు. బ్యాంకు లాకర్లు కూడా తెరవాల్సి ఉందన్నారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, సూర్యమోహనరావు, రమేష్, రామకృష్ణ, లక్మోజీ, శ్రీనివాస్, విల్సన్ పాల్గొన్నారు.