సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో 1989–2015 మధ్యకాలంలో పనిచేసిన ఎమ్మార్వోలు, కొత్వాల్‌గూడ వీఆర్వోల వివరాలు అందజేయాలన్న 2015 నాటి ఉత్తర్వుల్ని అమలు చేయని అత్తాపూర్ ఆర్డీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు సమయాన్ని ఆర్డీవో వృథా చేశారని, దీనికి మూల్యంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు రూ.10 వేలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
2015లో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదంటూ ఏటూరు భూదేవి రియాల్టీ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు. విచారణకు తొలుత ప్రభుత్వ న్యాయవాది హాజరుకాలేదు. పిటిషనర్ తరఫున మామిండ్ల మహేశ్ హాజరయ్యారు. అదేరోజు మధ్యాహ్నం మరోసారి విచారణ జరిపితే ప్రభుత్వ న్యాయవాది హాజరై గడువు కావాలని కోరారు.
2015లో ఉత్తర్వులను అమలు చేయాలని, ఆర్డీవో తమ ముందు హాజరుకావాలని గత నెల 30న కోర్టు చెప్పినా అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు సమయాన్ని ఆర్డీవో వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణనను ఈ నెల 20కి వాయిదా వేసింది. 20న ఉదయం 10.30గంటలకు విచారణకు ఆర్డీవో హాజరుకావాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment