అవగాహన లేకే రోడ్డు ప్రమాదాలు
పాత శ్రీకాకుళం : సరైన అవగాహన లేకుండా వాహనాలు నడపడం వల్లే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని శ్రీకాకుళం ఆర్టీఓ వి.శివరామకృష్ణ అన్నారు. మునసబుపేటలోని గురజాడ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ఎన్సీసీ కేడెట్ల శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా గురువారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రహదారి ప్రమాదాల్లో 40 శాతం పాదచారులు, 28 శాతం ద్విచక్ర వాహనచోదకులు చనిపోతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ఎన్సీసీ కేడెట్లు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో శిబిరం కమాండెంట్ పి.రాజేంద్ర, ఎన్సీసీ అధికారులు, డిప్యూటీ కమాండెంట్ చంద్రుడు, కెప్టెన్లు మహేష్, మధు, సుబేదా తదితరులు పాల్గొన్నారు.