అక్రమార్కులకు బాస్ అండ!
పార్వతీపురం/కొమరాడ, న్యూస్‌లైన్:జంఝావతి రబ్బరు డ్యామ్ నిర్మాణం కోసం వినియోగించిన లక్షలాది రూపాయల విలువైన కంటైనర్, జీఐ పైపులు మాయమైనా సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికీ దర్యాప్తు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ అక్రమాల వెనుక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందని, అందుకే దర్యాప్తు ఊసెత్తడం లేదని తెలిసింది. రూ.40 లక్షల విలువైన ప్రాజెక్టు సామగ్రి కేవలం రూ.15 లక్షలకు సంబంధితశాఖ ఉన్నతాధికారుల ప్రోద్బలంతో విక్రయాలు సాగినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ‘జంఝావతి’ అక్రమాలపై నెల రోజులుగా పత్రికల్లో కథనాలు వెలువడుతున్నా సంబంధిత శాఖాధికారులకు చీమకుట్టినట్టయినా లేదు. కనీసం దర్యాప్తు చర్యలు చేపట్టలేదు. అప్పట్లో పైపులు మాయమైనట్లు పత్రికల్లో కథనాలు వెలువడటంతో వీటి స్థానంలో కొత్తపైపులను కొనుగోలు చేసి ప్రాజెక్టు కార్యాల యంలో పెట్టారు.
లక్షలాది రూపాయలు విలు వ చేసే కంటైనర్ ఆచూకీ ఇప్పటికీ లేదు. అయినప్పటికీ ఆ కార్యాలయ అధికారులుగాని, ఉన్నతాధికారులుగాని దీనిపై స్పందించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల రూపాయల విలువైన వస్తువుల గురించి పట్టిం చుకోని ఆ శాఖ అధికారులు కేవలం ఆ కార్యాల యానికి సంబంధించిన కిటికీలు, ద్వారబందా లు మాయమయ్యాయని కొమరాడ పోలీస్‌స్టేష న్లో ఫిర్యాదు చేయడంపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే కొమరాడ ఎస్ఐ జి.ఎ.వి.రమణ గతంలో మాయమైన కం టైనర్, పైపులు గురించి కూడా విచారించినట్లు సమాచారం. దీంతో ఆ శాఖాధికారుల్లో భయంపుట్టి పోలీసులను కూడా తమకు అనుకూలం గా మలుచుకునే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని పక్కదో వ పట్టించడానికే నెలలు గడుస్తున్నా సంబంధి త శాఖాధికారులు విచారణ చేయడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై కొన్ని ప్రజా సంఘాలు సబ్ కలెక్టర్ శ్వేతామహంతికి కూడా ఫిర్యాదు చేశాయి. దీంతో ఆమె సంబంధిత శాఖాధికారులకు దీనిపై సరైన సమాచారం కావాలంటూ లేఖరాశారు.
సబ్ కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..
జంఝావతి ప్రాజెక్టులో మాయమైన విలువైన సామగ్రి కోసం సంబంధిత కార్యాలయానికి సబ్ కలెక్టర్ శ్వేతామహంతి లేఖ రాసినప్పటికీ వారి నుంచి సమాధానం కరువయింది. సరిక దా ఈ వ్యవహారంపై తమశాఖకు చెందిన ఉన్నతాధికారులకే సమాధానం చెబుతామని, రెవెన్యూ అధికారులకు చెప్పవలసిన అవసరం లేదన్న చందంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బ ట్టి ఈ కథ వెనుక ఆ శాఖ ఉన్నతాధికారుల హస్తం ఏ మేరకు ఉందో వేరే చెప్పనక్కర్లేదు.
ఫైళ్లు మాయం ?
ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక ఫైళ్లు కొన్ని కార్యాలయం నుంచి మాయమైనట్టు తెలి సింది. కార్యాలయంలో పనిచేస్తున్నవారే తమ ఉన్నతాధికారి ఆదేశాలతో ఆ ఫైళ్లను మాయం చేసినట్టు సమాచారం. దీనిపై ప్రస్తుత డీఈఈ పి.వి.రమణారావును వివరణ కోరగా పెదవి విప్పడం లేదు.
పాత సామాన్ల కింద కంటైనర్ ను అమ్మేశాం
జంఝావతి ప్రాజెక్టుపై ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రబ్బరుడ్యామ్ కోసం ఆ దేశ నిపుణులు ఇక్కడ వాతావరణం తట్టుకునేందుకు ఏర్పాటుచేసిన కంటైనర్‌ను పాత సామాన్లకింద విక్రయించేశామని ఇక్కడ పనిచేసి పదవీ విరమణ పొందిన డీఈఈ కోటేశ్వరరావు తెలిపారు. కంటైనర్ ప్రాజెక్టు కార్యాలయంలో తుప్పుపట్టి ఉండడంతో తమ శాఖ ఎండీ ఆదేశాల మేరకు పాత సామగ్రి కింద విక్రయించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి అపోహలూ అవసరం లేదన్నారు.