ruchita goud
-
మరో ఐదుగురు డిశ్చార్జి
మాసాయిపేట బాధితుల్లో కోలుకుంటున్న మరో ఇద్దరు విషమ పరిస్థితిలోనే ఇద్దరు హైదరాబాద్: మాసాయిపేట బస్సు దుర్ఘటన లో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఐదు మంది విద్యార్థులు గురువారం ఆస్పత్రి నుం చి డిశ్చార్జి అయ్యారు. బుధవారం 9 మంది విద్యార్థులు డిశ్చార్జి కాగా మరో ఇద్దరిని డిశ్చార్జి చేసినా ఒక రోజు ఇక్కడే ఉంటామని చెప్పారు. గురువారం వారిద్దరితో పాటు మరో ముగ్గురిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్యతోపాటు వారికి చికిత్స చేసిన వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తమ అనుభవాలను వెల్లడించారు. రుచిత గౌడ్(8), శ్రావణి(6), శిరీష అలియాస్ త్రిష(8), దర్శన్‌గౌడ్ అలియాస్ ధనుష్(6), నబీరా ఫాతిమా(9)లను డిశ్చార్జి చేశారు. నితూష(7) ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ప్రత్యేక వార్డుకు తరలించారు. శరత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల పరిశీలనలోనే కొనసాగుతున్నాడు. ప్రశాంత్(6), వరుణ్‌గౌడ్(7) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. జూలై 24న జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 20 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. వైద్యు లు, నర్సింగ్ స్టాఫ్, వివిధ విభాగాల సిబ్బంది అంతా సమష్టిగా వైద్యం అందించడంతో విద్యార్థులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లగలిగారని డాక్టర్ లింగయ్య చెప్పారు. కార్యక్రమంలో ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, స్పెషలిస్టు వైద్యులు మారుతి, మురళీమోహన్‌రెడ్డి, రామకృష్ణ, జయంతి, శశిధర్, కార్తీక్ పాల్గొన్నారు. విషాదం.. ఒకింత ఆనందం డిశ్చార్జి అవుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొందరిలో సంతోషం కనిపించగా, ఇద్దరి కుటుంబాల్లో మనసంతా విషాదం తొంగిచూస్తుండగా ఒకింత ఆనందం వ్యక్తమైంది. ఒకరు మరణించగా, మరొకరు కోలుకోవడంతో దుర్ఘటన ఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి. స్కూల్ బస్సులో డీజిల్ అయిపోయిందా? సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. బస్సులో డీజిల్ అయిపోవడంతో అది పట్టాలపైకి రాగానే ఆగిపోయిందని, ఈ విషయాన్ని స్కూల్ యాజ మాన్యానికి తెలియజేసేందుకు డ్రైవర్ భిక్షపతి ఫోన్లో మాట్లాడుతుండగా ప్రమాదం జరిగిపోయిందని కొందరు గ్రామస్తులు రైల్వే పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఈ దిశగా రైల్వే పోలీసులు దృష్టిసారించి విచారణ జరుపుతున్నట్టు సమాచారం. లెవల్ క్రాసింగ్ వద్ద వాచ్‌మెన్‌తోపాటు గేటును ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం, స్థానికులు ఆరోపించగా.. డ్రైవర్ బిక్షపతి నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని రైల్వే పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు.రెగ్యులర్ డ్రైవర్ రాకపోవడంతో అనారోగ్యంగా ఉన్న భిక్షపతిపై స్కూలు యాజమాన్యం ఒత్తిడి తీసుకొచ్చి మరీ బస్సు నడిపేలా చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
కన్నుమూసిన మరో విద్యార్థిని
ఇద్దరు డిశ్చార్జ్...విషమంగా మరో ఇద్దరి పరిస్థితి మాసాయిపేట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేటలో రైలు స్కూలు బస్సును ఢీకొన్న ఘటనలో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో విద్యార్థిని మంగళవారం కన్నుమూసింది. దీంతో ఇప్పటి వరకు ఈ ఘటనలో 16 మంది విద్యార్థులతో పాటు ఒక డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తరుణ్ (7) మృతి చెందగా మంగళవారం ఉదయం 5.28 గంటలకు వైష్ణవి (11) మరణించింది. పూర్తిగా కోలుకున్న అభినందు(9), శివకుమార్(7)లను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు వారు ఆస్పత్రిలోనే ఉన్నారు. సాధారణ వార్డులో ఆరుగురు: మరో ఆరుగురు సాధారణ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిని కూడా ఒకటి, రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. నబీరాఫాతిమా (9), దర్శన్‌గౌడ్ (6), హరీష్ (7), త్రిష (8), శ్రవణ్ (6), నితూష (7) వార్డులో చికిత్స పొందుతున్నారు. మరో విద్యార్థి శరత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా వైద్యులు పరిశీ లనలో ఉంచారు. ఇతను కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్(6), వరుణ్‌గౌడ్ (7) పరిస్థితి మాత్రం మరింత ఆందోళనకరంగా ఉంది. ఒక్కగానొక్క కుమార్తె: ఇస్లాంపూర్‌కు చెందిన సంజీవ్‌గౌడ్, రమ్య దంపతుల ఏకైక కుమార్తె వైష్ణవి(11). రమ్య బీడీ కార్మికురాలు కాగా, సంజీవగౌడ్ దుబాయ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆమె ప్రమాద వార్త తెలిసి మూడు రోజుల క్రితం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమెకు కాలేయం, కడుపు, తలకు తీవ్ర గాయాలు కావటంతో డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వైష్ణవి మరణంతో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమ, మంగళవారాల్లో మృతి చెందిన తరుణ్, వైష్ణవి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. తలకు బలమైన గాయాలు కావడం, రక్తం గడ్డ కట్టడంతోనే చిన్నారులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలోనే రంజాన్ వేడుకలు.. మాసాయిపేట రైల్వే దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న నబీరా ఫాతిమా మంగళవారం ఆస్పత్రిలోనే రంజాన్ వేడుకలు జరుపుకుంది. ఈ నెల 24వ తేదీన ఆమె గాయపడగా ఆమె కోలుకుని సాధారణ వార్డులో చికిత్స పొందుతోంది. మంగళవారం రంజాన్ పండుగ కావడంతో అక్కడే తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు కూడా నబీరా ఫాతిమాకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నబీరా ఫాతిమా కోలుకోవడమే తమకు నిజమైన రంజాన్ పండుగ అని ఆమె తల్లిదండ్రులు అయూబ్, రబియా సుల్తానా అన్నారు. -
కోలుకుంటున్న చిన్నారులు
నలుగురి పరిస్థితి విషమం సాధారణ వార్డుకు 12 మంది తరలింపు హైదరాబాద్: మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు నెమ్మదిగా కోలుకుంటున్నారు. 12 మంది విద్యార్థులను సాధారణ వార్డుకు తరలించారు. శనివారం 9 మందిని సాధారణ వార్డుకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తిరిగి క్రిటికల్ వార్డుకు తరలించారు. ఆదివారం మరో నలుగురిని సాధారణ వార్డుకు తరలించారు. సాయిరాం, రుచితగౌడ్, సాత్విక, నబిరా ఫాతిమా, మహిపాల్‌రెడ్డి, సద్భావన్ దాస్, దర్శన్, కరుణాకర్, హరీష్, అభినందు, సందీప్, శిరీషలను సాధారణ వార్డుకు తరలించారు. శివకుమార్, నితూషల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. శరత్, శ్రవణ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండగా ప్రశాంత్, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా, మూడు రోజులుగా గాయపడ్డ విద్యార్థులను ఐసీయూ, ఏఎన్‌సీయూ, ఎస్ఐసీయూ వార్డుల్లో ఉంచడంతో తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని కన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.