
కన్నుమూసిన మరో విద్యార్థిని
ఇద్దరు డిశ్చార్జ్...విషమంగా మరో ఇద్దరి పరిస్థితి
మాసాయిపేట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేటలో రైలు స్కూలు బస్సును ఢీకొన్న ఘటనలో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో విద్యార్థిని మంగళవారం కన్నుమూసింది. దీంతో ఇప్పటి వరకు ఈ ఘటనలో 16 మంది విద్యార్థులతో పాటు ఒక డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తరుణ్ (7) మృతి చెందగా మంగళవారం ఉదయం 5.28 గంటలకు వైష్ణవి (11) మరణించింది. పూర్తిగా కోలుకున్న అభినందు(9), శివకుమార్(7)లను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు వారు ఆస్పత్రిలోనే ఉన్నారు.
సాధారణ వార్డులో ఆరుగురు: మరో ఆరుగురు సాధారణ వార్డులో చికిత్స పొందుతున్నారు. వీరిని కూడా ఒకటి, రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. నబీరాఫాతిమా (9), దర్శన్‌గౌడ్ (6), హరీష్ (7), త్రిష (8), శ్రవణ్ (6), నితూష (7) వార్డులో చికిత్స పొందుతున్నారు. మరో విద్యార్థి శరత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా వైద్యులు పరిశీ లనలో ఉంచారు. ఇతను కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్(6), వరుణ్‌గౌడ్ (7) పరిస్థితి మాత్రం మరింత ఆందోళనకరంగా ఉంది.
ఒక్కగానొక్క కుమార్తె: ఇస్లాంపూర్‌కు చెందిన సంజీవ్‌గౌడ్, రమ్య దంపతుల ఏకైక కుమార్తె వైష్ణవి(11). రమ్య బీడీ కార్మికురాలు కాగా, సంజీవగౌడ్ దుబాయ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆమె ప్రమాద వార్త తెలిసి మూడు రోజుల క్రితం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమెకు కాలేయం, కడుపు, తలకు తీవ్ర గాయాలు కావటంతో డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వైష్ణవి మరణంతో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమ, మంగళవారాల్లో మృతి చెందిన తరుణ్, వైష్ణవి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. తలకు బలమైన గాయాలు కావడం, రక్తం గడ్డ కట్టడంతోనే చిన్నారులు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ఆస్పత్రిలోనే రంజాన్ వేడుకలు..
మాసాయిపేట రైల్వే దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న నబీరా ఫాతిమా మంగళవారం ఆస్పత్రిలోనే రంజాన్ వేడుకలు జరుపుకుంది. ఈ నెల 24వ తేదీన ఆమె గాయపడగా ఆమె కోలుకుని సాధారణ వార్డులో చికిత్స పొందుతోంది. మంగళవారం రంజాన్ పండుగ కావడంతో అక్కడే తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు కూడా నబీరా ఫాతిమాకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నబీరా ఫాతిమా కోలుకోవడమే తమకు నిజమైన రంజాన్ పండుగ అని ఆమె తల్లిదండ్రులు అయూబ్, రబియా సుల్తానా అన్నారు.