గజ్వేల్‌లో ఇక పన్నుల మోత!
- ఆస్తి పన్ను 100 నుంచి 200 శాతం వరకు పెంపు!
- ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసన
- పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పాలకవర్గం
- తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే..
గజ్వేల్: గజ్వేల్ నగరపంచాయతీలో ఆస్తి పన్ను ఇక భారం కానున్నది. ప్రస్తుతమున్న విధానానికి 100 నుంచి 200 శాతం వరకు పెరగనున్నది. గృహాలతో పోలిస్తే దుకాణ, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు భారీగా పన్నుల వడ్డన జరగబోతున్నది. కొద్ది రోజుల్లోనే నూతన విధానం అమల్లోకి రాబోతుండగా ఈ వ్యవహారంపై వివాదం మొదలైంది. పాలకవర్గం సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది.
2012 జనవరిలో గజ్వేల్ మేజర్ పంచాయతీ నుంచి నగరపంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. దీంతో నగరపంచాయతీలో ప్రజ్ఞాపూర్‌తోపాటు ముట్రాజ్‌పల్లి, క్యాసారం గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. ఫలితంగా పరిధి పెరిగింది. జనాభా 40వేలకుపైగా చేరుకోగా నగరపంచాయతీ పరిధిలో ఇళ్ల సంఖ్య సైతం 9వేలకు పెరిగింది. నగరపంచాయతీగా ఆవిర్భవించిన తర్వాత తమకు మెరుగైన వసతులు సమకూరుతాయని భావించిన ప్రజలకు సౌకర్యాల మాటేమోగానీ పన్నుల భారం మాత్రం మొదలైంది. ఇప్పటివరకు నగరపంచాయతీలో సాధారణ పన్నుల విధానం అమలులో ఉంది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 25 నగరపంచాయతీలకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ పన్నుల భారం విపరీతంగా పెరుగుతున్నది. కొత్త విధానంలో నగరపంచాయతీని 4 జోన్లుగా విభజించారు. ఆ జోన్లలో ఆస్తుల విలువను బట్టి పన్నులను నిర్దారించారు. ఉదాహరణకు మొదటి జోన్లో గతంలో నివాస గృహానికి సెల్లార్, జి ప్లస్-1, రెండు, మూడు ఫ్లోర్లకు ఒక చదరపు మీటర్‌కు గతంలో రూ. 5చొప్పున పన్ను వసూలు చేస్తే ప్రస్తుతం అది రూ. 10కి చేరుకుంది. అంటే పెరుగుదల 100శాతం అన్నమాట. దుకాణాలు, ఆఫీసులు, బ్యాంకులు, హోటళ్లు, నర్సింగ్‌హోంలు, గోదాములు, సినిమాథియేటర్లు, విద్యాసంస్థలు, లాడ్జింగ్‌లు, రెస్టారెంట్లు, కమ్యునిటీహాల్లు, ఆడిటోరియం, పెట్రోల్‌బంక్, సెల్‌టవర్స్ లాంటి వ్యాపార, వాణిజ్య భవనాలపై 200శాతానికిపైగా పెరుగుదల ఉండబోతున్నది.
ఈ పెరుగుదల గ్రేడ్-1 మున్సిపాలిటీల్లో సైతం లేదని తెలుస్తున్నది. నాలుగుజోన్లలో ఇప్పటికే నగరపంచాయతీ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి పన్నుల పెంపునకు సంబంధించి విధానాన్ని రూపొందించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు సైతం అందించారు. ఇదే క్రమంలో గురువారం జరిగిన నగరపంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఈ వ్యవహారం వివాదస్పదమైంది. కౌన్సిలర్లు ముక్తకంఠంతో పన్నుల విధానాన్ని వ్యతిరేకించారు.
తుది నిర్ణయం ప్రభుత్వానిదే...
గజ్వేల్ నగరపంచాయతీలో కొత్త పన్నుల విధానంపై తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని అధికారులు వెల్లడిస్తున్నారు.
అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం...
కొత్త ఆస్తి పన్ను అమలుకు సంబంధించి మాకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. దీనిపై అభ్యంతరాలు వస్తే ప్రభుత్వానికి నివేదిస్తాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నడుచుకుంటాం.
-నగరపంచాయతీ కమిషనర్ ఎన్. శంకర్