rural doctors
-
పారామెడికోస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ టౌన్: పారామెడికోస్ శిక్షణను గ్రామీణ వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకన్న పిలుపునిచ్చారు. బుధవారం చిన వెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం పదో వార్షికోత్సవ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్యారోగ్యశాఖ పథకాలు విజయవంతం కావడంలో గ్రామీణ వైద్యులు అందిస్తున్న సహకారం మరవలేనిదర్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలో సంఘం సభ్యత్వాలను పూర్తి చేసి సంఘాలన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బాలరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తుందన్నారు. అంతకు ముందు సంఘం జిల్లా కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లాగౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ర్ట గౌరవ సలహాదారు బి.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు డిఎస్ఎన్ చారి, ప్రధాన కార్యదర్శి బొల్లెపల్లి శ్రీనివాసరాజు, కోశాధికారి జి.రాజశేఖర్‌రావు, ఉపాధ్యక్షుడు వనం యాదగిరిరావు, ప్ర చార కార్యదర్శి బ్రహ్మచారి, నర్సింహారెడ్డి, పి.వెంకటేశ్వర్లుగౌడ్, ఎ.కృష్ణారెడ్డి, ఎం.మధనాచారి, ఎ.యాదగిరి, నజీరుద్దిన్, పి.లలిత, కె.విజయేందర్‌రెడ్డి, మణికుమారి, వెంకటాచారి, ప్రభుదాస్, జహాంగీర్, వాసుదేవులు, చంద్రశేఖర్, కుతుబుద్దిన్, వీరన్న పాల్గొన్నారు. -
గ్రామీణ వైద్యులపై ప్రభుత్వం చిన్నచూపు
సాక్షి, మంచిర్యాల : గ్రామీణ వైద్యుల(ఆర్ఎంపీ)ను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పల్లెల్లో ఎవరికి ఏ జబ్బు వచ్చినా, ప్రమాదం జరిగినా పరుగెత్తుకెళ్లి వైద్యం అందించే వీరికి ప్రభుత్వ గుర్తింపు కరువైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యాప్తి చెందుతున్న కొత్త జబ్బులపై అవగాహన, ప్రాథమిక చికిత్సలు, సలహాలు, సూచనలు అందించేందుకు ఆర్ఎంపీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. శిక్షణ పొందిన వీరికి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆరు నెలలకోసారి శిక్షణ కూడా ఇవ్వాలని సంకల్పించారు. ఈ క్రమంలో జిల్లాలో 200 మందికి రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మరో 1,900 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా అంతలోనే వైఎస్సార్ అకా ల మరణం చెందారు. అనంతరం కిరణ్ ప్రభుత్వం నాలుగేళ్లుగా శిక్షణ కార్యక్రమాలను నిలిపి వేసింది. ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్న ప్రజలు జిల్లాలో 27 లక్షలకుపైగా జనం నివసిస్తున్నారు. వీరికి చికిత్స అందించడం కోసం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 469 ఆరోగ్య ఉప కేంద్రాలు, 17 సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రాలు, ఆరు ప్రాంతీయ ఆస్పత్రులు ఉన్నాయి. వైద్యాధికారుల మొదలు హెల్త్ ఎడ్యుకేటర్ల వరకు మొత్తం 1,697 పోస్టులు ఉండగా, ఇందులో 422 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు చాలా ప్రాంతాల్లో వైద్య సి బ్బంది స్థానకంగా ఉండకుండా విధులకు ఎగనా మం పెడుతున్నారు. సర్కారు వైద్యంపై ఉన్న అపనమ్మకం, అక్కడక్కడా అందని వైద్యంతో ప్రజలు గ్రామీణ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. జ్వరమొచ్చి నా, నొప్పొచ్చినా స్థానికంగా ఉండే ఆర్ఎంపీలను ఆశ్రయించే ప్రజలు లక్షల సంఖ్యలో ఉంటారు. వీరు ప్రభుత్వం గుర్తించకున్నా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. జబ్బులపై మెరుగైన శిక్షణ ఇస్తే బావుంటుందని ఆర్ఎంపీలు కోరుతున్నారు. వైఎస్ ఉంటే గుర్తింపు లభించేది.. వైఎస్ రాజ శేఖరరెడ్డి ఉన్నప్పుడు వ్యాధులపై మాకు శిక్షణ ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం నుంచి గుర్తింపు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు. వైఎస్సార్ మరణానంతరం శిక్షణ కార్యక్రమాలు నిలిపేశారు. పెద్దాయన ఉంటే మాకు గుర్తింపు లభించేది. - చందు, చింతపల్లి ఆర్ఎంపీ, దండేపల్లి శిక్షణ ఎందుకు నిలిపేశారో తెలియదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆర్ఎంపీలకు వ్యాధులపై శిక్షణ ఇచ్చారు. కానీ ఆయన మరణించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. శిక్షణ కార్యక్రమాలు జరగలేదు. - డాక్టర్ అరవింద్. సూపరింటెండెంట్, మంచిర్యాల ఏరియా ఆస్పత్రి