భార్య గొంతు నులిమి హత్యచేసిన భర్త..?
- హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు
- గాయాలు చూసి ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లి
నవీపేట: క్షణికావేశం ఇద్దరి జీవితాలను తారుమారు చేసింది. ఈ సంఘటనలో ఒకరు భార్య విగత జీవి కాగా భర్తపై కేసు నమోదైంది. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావ్ కథనం మేరకు వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ధర్మారం(ఎ) గ్రామానికి చెందిన తెనుగు అంజయ్య నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాలతో కొంత కాలంగా భార్య తెనుగు అనితతో తరచూ గొడవ పడేవాడు. వీరికి పలుమార్లు పంచాయతీ పెద్దలు, కుటుంబ పెద్దలు సర్ధిచెప్పారు.
శుక్రవారం రాత్రి రోజూలాగే ఇరువురు కలిసి మధ్యం సేవించి మళ్లీ గొడవకు దిగారు. దీంతో అంజయ్య అనితను తీవ్రంగా కొట్టి గొంతునులిమి చంపేశాడని తెలిపారు. పక్క గ్రామమైన అనంతగిరిలో ఉండే అనిత తల్లి శారదకు ఫోన్ చేసి ‘మీకూతురు మెట్లపై నుంచి పడిపోయింది తొందరగా రావాలని’ సమాచారమిచ్చాడు. దీంతో దీంతో బంధువులంతా తరలివచ్చారు. అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా మృతురాలి చెవి కింద రక్తం కారడంతో అనుమానం వచ్చి తల్లితరపు బంధువులు నిశితంగా పరిశీలించగా గొంతుపై గాయాలు కనిపించారుు.
తమ కూతురును భర్త అంజయ్య హత్య చేశాడని మృతురాలి తల్లి శరద పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావ్, ఎస్సై వేణుగోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
క్షణికావేశంలో తాగిన మైకంలో భర్త అంజయ్య తన భార్యను చంపాడని రూరల్ సీఐ విలేకరులకు తెలిపారు. మృతురాలికి అజయ్(9), అరవింద్(3) అనే తొమ్మిదేళ్ల లోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.