ruya
-
కదులుతున్న ‘కే ట్యాక్స్’ డొంక
సాక్షి, తిరుపతి : తిరుపతి రుయా ఆస్పత్రి వేదికగా ‘కే’ట్యాక్స్ మూలాలు వెలుగు చూశాయి. మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం బినామీ పేర్లతో రుయా ఆసుపత్రిలో ల్యాబ్ నిర్వహణ బాగోతం ఆదివారం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇదే విషయంపై అన్ని మీడియాల్లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ల్యాబ్ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. దీంతో కోడెల తనయుడికి సహకరించిన రుయా అధికారుల బాగోతం ఎక్కడ బయటపడుతుందో అనే ఆందోళన అధికారుల్లో స్పష్టమవుతోంది. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా ఇప్పటికే ల్యాబ్ నిర్వహణను రుయానే నిర్వహించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్ట్‌ను రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు ల్యాబ్ పేరుతో జరిగిన దోపిడీ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఎక్కువ పరీక్షల సంఖ్యను చూపి, అధిక రేట్లతో రుయా నుంచి కోట్లు పిండుకున్నారు. ఇదిలా ఉండగా, ఆగస్టు 15వ తేదీన సెలవు రోజు, అయితే అదేరోజు రూ.1.5లక్షలకు బిల్లు పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణ రోజులకన్నా సెలువు రోజు ఆ స్థాయిలో పరీక్షలు జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయట ల్యాబ్‌ల కన్నా కొన్ని పరీక్షల ధరలు ఎక్కువ చూపి దండుకున్నట్లు తెలుస్తోంది. ఇలా కే ట్యాక్స్ డొంక లాగితే అక్రమ దందా ఒక్కొక్కటే వెలుగు చూస్తోంది. 2014 నుంచి ల్యాబ్ ద్వారా చెల్లింపులపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఏమేరకు అక్రమాలు జరిగాయో తేటతెల్లమవుతుంది. ఇందుకు సహకరించిన వారెవరనే విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. సంబంధిత అధికారుల్లో మొదలైన అలజడి.. రాయలసీమకే పెద్దాసుపత్రిగా ఉన్న రుయాస్పత్రిలో అత్యాధునిక ల్యాబ్ నిర్వహణ పరికరాలు న్నాయి. అవసరమైన ప్రొఫెసర్లు, పీజీలు, టెక్నీషియనున్నారు. ల్యాబ్ నిర్వహణకు అవసరమయ్యే అన్ని సదుపాయాలున్నా అప్పటి టీడీపీ నేతల ఒత్తిడితో ల్యాబ్ నిర్వహణపై చేతులెత్తేశారు. కోడెల తనయుడు రుయా ల్యాబ్‌పై దృష్టి సారించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యూహాత్మకంగా సెంట్రల్ ల్యాబ్ నిర్వహణను చేజిక్కించుకున్నారు. ఇక అప్పటి నుంచి ల్యాబ్ నిర్వహిస్తూ నెలకు రూ. 30–40 లక్షల వరకు దండుకున్నారు. ఇలా ఏడాదికి 4కోట్లకు పైగా, ఐదేళ్లలో 22కోట్లకు పైగా కోడెల బినామీకి చేరింది. రుయానే ఈ ల్యాబ్ నిర్వహించి ఉంటే రూ.1.80 కోట్లు, ఐదేళ్లకు రూ.9కోట్లతో నాణ్య మైన వైద్యపరీక్షలను రోగులకు అందించి ఉండవచ్చు. ఇలా ల్యాబ్‌తో పాటు ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్, మందుల పంపిణీలోనూ భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. లోతైన విచారణ దిశగా చర్యలు తిరుపతిలో కోడెల అక్రమాల బాగోతం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. 2014 నుంచి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్లీనికల్ ల్యాబ్ పేరుతో రుయా సెంట్రల్ ల్యాబ్ నిర్వహిస్తున్నారు. నెలకు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు రుయా నిధులకు గండికొట్టారు. రుయాలో అత్యాధునిక ల్యాబ్ పరికరాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి బయట వ్యక్తులకు అప్పగించడంపై పైస్థాయి అధికారులు దృష్టి సారించారు. దీనికి కారకులెవరు? సహకరించిన అధికారులెవరు? అనే విషయాలపై విచారణ చేపట్టనున్నారు. అలానే రోజువారీ పరీక్షలు, వాటికి చెల్లించిన మొత్తంపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించనున్నట్లు ఓ అధికారి ద్వారా తెలుస్తోంది. ల్యాబ్ నిర్వహణపై ఇప్పుడే కొత్తకోణాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రోజువారీ పరీక్షల డేటాను వెలికి తీసి, ఒక్కో పరీక్షకు ఏమేరకు చెల్లింపులు చేశారనే లోతైన విచారణ దిశగా చర్యలకు దిగనున్నారు. ఇది చదవండి : చేసిన పాపాలే వెంటాడుతున్నాయి!! -
మంత్రి వర్యా.. సమస్యలు చూడవయ్యా..!
రాయలసీమ ప్రాంతవాసులకు పెద్ద ఆస్పత్రిగా పేరు పొందిన రుయాలో సమస్యలు రాజ్యమేలుదున్నాయి. రోజురోజుకూ వైద్య సేవలు దిగజారుతున్నాయి. అత్యవసర ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. రేడియాలజీ విభాగం పేలవంగా తయారైంది. పలు వార్డుల్లో అరకొర వసతులు ఉండడంతో రోగులు నరకయాతన పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైద్య విద్య శాఖా మంత్రి ఫరూక్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 1962లో లాల్ బహదూర్ శాస్త్రి రుయా ఆస్పత్రిని ప్రారంభిం చారు. రుయాకు నిత్యం 1500 నుంచి 2 వేల మం ది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. 1098 పడకల సామర్థ్యం ఉంది. వివిధ వార్డుల్లో 850 మందికి పైగా ఇన్‌పేషెంట్లు సేవలు పొందుతున్నారు. వార్డుల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండడంతో రోగులు నరకయాతన పడుతున్నారు. సేవలను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. పేలవంగా వైద్య సేవలు రుయా అత్యవసర విభాగం మొదలుకుని 18 విభాగాల్లో సేవలు నామమాత్రంగా ఉన్నాయి. ఓపీ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అధికారులు పూర్తిగా గాలికొదిలేశారు. ఫలితంగా ఉదయం 8.30 గంటలైతే ఓపీ నమోదు కోసం రోగులు బారులు తీరి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. వార్డుల్లో సిబ్బంది లేకపోవడంతో రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్లాస్టిక్ సర్జరీ వార్డులో స్టాఫ్ నర్సులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జనరల్ మెడిసిన్ వార్డులోనూ వైద్య సేవలు అంతంతమాత్రమే. సెక్యూరిటీ సిబ్బంది రోగులకు ఇన్జెక్షన్లు వేసిన ఘనత రుయాకు దుక్కుతుంది. ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు ఆలస్యం రుయాలో ఏడు నెలల క్రితం ప్రారంభం కావాల్సిన ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తిరుపతి నగరంలో డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకోవాలంటే రూ.3 వేల నుంచి రూ.4,500 ఖర్చవుతుంది. రుయాలో ఏంఆర్ఐ స్కానింగ్ కేంద్రం ఏర్పాటైతే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు బిజినెస్ తగ్గే అవకాశం ఉంది. ఈ కారణంగా రుయాలో స్కానింగ్ కేంద్రం ఏర్పాటుపై తీవ్ర జాప్యం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. అధ్వానంగా రేడియాలజీ సేవలు రుయాలో రేడియాలజీ సేవలు అద్వానంగా మారాయి. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం రోగులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రోగులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వేచిచూడాల్సిన దుస్థితి. రోజుకు 50 నుంచి 60 మంది స్కానింగ్ చేసుకోవాలని వైద్యులు రెఫర్ చేస్తున్నారు. రోగులకు సంఖ్యకు అనుగుణంగా అల్ట్రాసౌండ్ సేవలు అందడం లేదు. పాలన అస్థవ్యస్థం రుయాలో పరిపాలన అస్థవ్యస్థంగా మారింది. అధికారులు ప్రతి చిన్న పనికీ సమావేశాలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారు. రుయాలో మందుల కొరత నెలకున్నా.. తక్షణం సమస్యను పరిష్కరించడంలోనూ అధికారులు విఫలం చెందారు. గత ఏడాది కాలంలో రుయా పాలన వ్యవస్థ గాడితప్పింది. రుయా ఆస్పత్రిలో ఇన్చార్జ్ పాలన నడుస్తుండడం ఇందుకు ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంత పెద్దాస్పత్రి సమస్యలను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వైద్య శాఖా మంత్రి ఫరూక్ పరిష్కరిస్తారా అన్నది వేచిచూడాల్సింది. మెడికల్ షాపు టెండర్లు నాన్చుడే 2017 డిసెంబర్ 24న రుయాలో సాధారణ మెడికల్ షాపు నిర్వహణ గడువు ముగిసింది. దుకాణం మూతపడి ఏడాది గడుస్తున్నా ఇంత వరకు అధికారులు టెండర్ల జోలికి వెళ్లడం లేదు. టీడీపీ చోటా నాయకుల ఒత్తిడి కారణంగానే ఇంతకాలం టెండర్లకు దూరంగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల ప్రతిపాదనకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అధికారుల్లో చలనం లేకుండా పోవడం గమనార్హం. రుయా అధికారులు అవినీతి కారణంగా టెండర్ల ప్రతిపాదన ముందుకు సాగడం లేదన్న ప్రచారం ఆస్పత్రిలో జరుగుతోంది. -
జ్వరం..కలవరం
మునుపెన్నడూ లేనంతగా సెప్టెంబరు తొలి వారంలోనూ ఎండలు మండుతున్నాయి. అప్పుడప్పుడు పలకరింపుగా వరుణడు ప్రత్యక్షమవుతున్నాడు. అడపాదడపా జల్లులు కురిపిస్తున్నాడు. ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు జ్వరాలకు కారణమవుతున్నాయి. జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య రాన్రానూ పెరుగుతోంది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ప్రధానాస్పత్రుల్లో జ్వరపీడితులు పెరుగుతున్నారు. చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రాయలసీమ ప్రాంత పెద్దాస్పత్రి రుయాలో వైరల్ ఫీవర్‌తో రోజుకు 250 మందికి పైగా జనరల్ మెడిసిన్ ఓపీ విభాగానికి వస్తున్నారు. నిత్యం ఓపీ రద్దీగానే కనిపిస్తోంది. సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులపై వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. కొంత కాలంగా అడపాదడపా చిన్నపాటి వర్షం కురుస్తోంది. వెంటనే ఎండ దంచేస్తోంది. దీంతో ప్రజలు వ్యాధులతో సతమతమవుతున్నారు. రుయా ఓపీకి రోజూ 1,500 నుంచి 2వేల మంది వస్తుంటారు. వీరిలో తీవ్రమైన జ్వరంతో వస్తున్న వారు 250 మందికిపైగా ఉన్నారు. రక్త పరీ క్షల కోసం సెంట్రల్ ల్యాబ్ ముందు రోగులు గంటల తరబడి నిరీక్షించా ల్సిన దుస్థితి నెలకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. తిరుపతిలోని కార్పొరేట్ ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నగరంలో పేరు పొందిన 20 ఆస్పత్రుల్లో జ్వరంతో రోగులతాకిడి పెరిగింది. డెంగ్యూ, మలేరియా కేసులు నమోదైనట్లు సమాచారం. చిన్నపిల్లల ఆస్పత్రిలో జ్వరంతో వస్తున్న చిన్నారులసంఖ్య పెరుగుతోంది. పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లే వారికి రక్త పరీక్షల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారని రోగులు గగ్గోలు పెడుతున్నారు. సీజనల్ మార్పులకు అనుగుణంగా వచ్చే రోగాలపై వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మదనపల్లెలో రోగాల దాడి మదనపల్లె మున్సిపాలిటీతో పాటు పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు విషజ్వరాల బారిన పడి అల్లాడిపోతున్నారు. మలేరియా, టైఫాయిడ్, తదితర విషజ్వరాలతో ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులు రోగులతో కనిపిస్తున్నాయి. మదనపల్లె జిల్లా, íపీహెచ్సీ( ప్రాథమిక వైద్యకేంద్రాల)ల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లా ఆస్పత్రితో పాటు, రూరల్ పరిధిలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. డాక్టర్లు, ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్‌ఓలతో పాటు ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఫీల్డు అసిస్టెం ట్లు, అటెండర్లు, యూడిసి, సీనియర్ అసిస్టెంటుల పోస్టులు 81కి గానూ 39కిపైగా ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఆస్పత్రుల నుంచి వెనుతిరగాల్చి వస్తోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీలో డాక్టర్లు అందుబాటులో ఉండాలి. కానీ వారు 10.30కి వచ్చి 12 గంటలకే వెళ్లిపోతున్నారు. పీహెచ్‌సీలు, సబ్సెంటర్లలో డాక్టర్లు వారానికి రెండు మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఇప్పటి వరకు డెంగీ, మలేరియా, విషజ్వరాలతో నలుగురు చనిపోయారనే సమాచారం ఉంది. ఆరు నెలల వ్యవధిలో 1017 మంది విషజ్వరాల బారిన పడ్డారు. మెరుగైన సేవలందిస్తున్నాం తీవ్రమైన జ్వరంతో రుయాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. అత్యవసర విభాగంలో 24 గంటల ల్యాబ్‌తో పాటు సెంట్రల్ ల్యాబ్‌ను కూడా అందుబాటులో ఉంచాం. జ్వర బాధితులకు వేగవంతంగా రక్త పరీక్షలు నిర్వహించేలా ఇప్పటికే టెక్నీషియన్లకు ఆదేశాలు జారీ చేశాం.– డాక్టర్ సిద్ధానాయక్, సూపరింటెండెంట్, రుయా ఆస్పత్రి, తిరుపతి -
విజృంభించిన డెంగ్యూ
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో డెంగ్యూ మహమ్మారి పడగ విప్పింది. జిల్లాలోని రుయాలోగల చిన్నపిల్లలవార్డు డెంగ్యూ బాధితులతో కిటకిటలాడుతోంది. పడకలు సరిపోక పలువురు చిన్నారులు అవస్థపడుతున్నారు. రోజురోజుకూ డెంగ్యూ మరణాలు పెరిగిపోతున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ఉపశమన చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.