రేడియాలజీ విభాగం ఎదుట రోగుల అవస్థలు
రాయలసీమ ప్రాంతవాసులకు పెద్ద ఆస్పత్రిగా పేరు పొందిన రుయాలో సమస్యలు రాజ్యమేలుదున్నాయి. రోజురోజుకూ వైద్య సేవలు దిగజారుతున్నాయి. అత్యవసర ఎంఆర్‌ఐ స్కానింగ్ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. రేడియాలజీ విభాగం పేలవంగా తయారైంది. పలు వార్డుల్లో అరకొర వసతులు ఉండడంతో రోగులు నరకయాతన పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైద్య విద్య శాఖా మంత్రి ఫరూక్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 1962లో లాల్ బహదూర్ శాస్త్రి రుయా ఆస్పత్రిని ప్రారంభిం చారు. రుయాకు నిత్యం 1500 నుంచి 2 వేల మం ది ఔట్ పేషెంట్లు వస్తుంటారు. 1098 పడకల సామర్థ్యం ఉంది. వివిధ వార్డుల్లో 850 మందికి పైగా ఇన్‌పేషెంట్లు సేవలు పొందుతున్నారు. వార్డుల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండడంతో రోగులు నరకయాతన పడుతున్నారు. సేవలను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి.
పేలవంగా వైద్య సేవలు
రుయా అత్యవసర విభాగం మొదలుకుని 18 విభాగాల్లో సేవలు నామమాత్రంగా ఉన్నాయి. ఓపీ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అధికారులు పూర్తిగా గాలికొదిలేశారు. ఫలితంగా ఉదయం 8.30 గంటలైతే ఓపీ నమోదు కోసం రోగులు బారులు తీరి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. వార్డుల్లో సిబ్బంది లేకపోవడంతో రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్లాస్టిక్ సర్జరీ వార్డులో స్టాఫ్ నర్సులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జనరల్ మెడిసిన్ వార్డులోనూ వైద్య సేవలు అంతంతమాత్రమే. సెక్యూరిటీ సిబ్బంది రోగులకు ఇన్‌జెక్షన్లు వేసిన ఘనత రుయాకు దుక్కుతుంది.
ఎంఆర్‌ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు ఆలస్యం
రుయాలో ఏడు నెలల క్రితం ప్రారంభం కావాల్సిన ఎంఆర్‌ఐ స్కానింగ్ సెంటర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తిరుపతి నగరంలో డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఎంఆర్‌ఐ స్కానింగ్ తీసుకోవాలంటే రూ.3 వేల నుంచి రూ.4,500 ఖర్చవుతుంది. రుయాలో ఏంఆర్‌ఐ స్కానింగ్ కేంద్రం ఏర్పాటైతే ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు బిజినెస్ తగ్గే అవకాశం ఉంది. ఈ కారణంగా రుయాలో స్కానింగ్ కేంద్రం ఏర్పాటుపై తీవ్ర జాప్యం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
అధ్వానంగా రేడియాలజీ సేవలు
రుయాలో రేడియాలజీ సేవలు అద్వానంగా మారాయి. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం రోగులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రోగులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వేచిచూడాల్సిన దుస్థితి. రోజుకు 50 నుంచి 60 మంది స్కానింగ్ చేసుకోవాలని వైద్యులు రెఫర్ చేస్తున్నారు. రోగులకు సంఖ్యకు అనుగుణంగా అల్ట్రాసౌండ్ సేవలు అందడం లేదు.
పాలన అస్థవ్యస్థం
రుయాలో పరిపాలన అస్థవ్యస్థంగా మారింది. అధికారులు ప్రతి చిన్న పనికీ సమావేశాలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారు. రుయాలో మందుల కొరత నెలకున్నా.. తక్షణం సమస్యను పరిష్కరించడంలోనూ అధికారులు విఫలం చెందారు. గత ఏడాది కాలంలో రుయా పాలన వ్యవస్థ గాడితప్పింది. రుయా ఆస్పత్రిలో ఇన్‌చార్జ్ పాలన నడుస్తుండడం ఇందుకు ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంత పెద్దాస్పత్రి సమస్యలను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వైద్య శాఖా మంత్రి ఫరూక్ పరిష్కరిస్తారా అన్నది వేచిచూడాల్సింది.
మెడికల్ షాపు టెండర్లు నాన్చుడే
2017 డిసెంబర్ 24న రుయాలో సాధారణ మెడికల్ షాపు నిర్వహణ గడువు ముగిసింది. దుకాణం మూతపడి ఏడాది గడుస్తున్నా ఇంత వరకు అధికారులు టెండర్ల జోలికి వెళ్లడం లేదు. టీడీపీ చోటా నాయకుల ఒత్తిడి కారణంగానే ఇంతకాలం టెండర్లకు దూరంగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల ప్రతిపాదనకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అధికారుల్లో చలనం లేకుండా పోవడం గమనార్హం. రుయా అధికారులు అవినీతి కారణంగా టెండర్ల ప్రతిపాదన ముందుకు సాగడం లేదన్న ప్రచారం ఆస్పత్రిలో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment