Ryansamver
-
సైబర్ వసూళ్లు పెరుగుతున్నాయి!
- ర్యాన్సమ్ వేర్ అటాక్‌లో నాలుగో స్థానంలో భారత్ - నార్తర్న్ ఇండియా కంట్రీ మేనేజర్ రితేశ్ చోప్రా సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు కేవలం పీసీలు, ల్యాప్‌టాప్‌లకు పరిమితమనుకున్న బలవంతపు వసూళ్ల (ర్యాన్సమ్వేర్) వ్యవహారం ఇప్పుడు స్మార్ట్ఫోన్లకూ విస్తరించిందని, ప్రజలు వీటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్జాతీయ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ నార్తర్న్ బై సెమాంటిక్ హెచ్చరిస్తోంది. సైబర్ ప్రపంచంలో బలవంతపు వసూళ్ల విషయంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని నార్తర్న్ ఇండియా కంట్రీ మేనేజర్ రితేష్ చోప్రా పేర్కొన్నారు. ర్యాన్‌సమ్‌వేర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. స్మార్ట్‌వాచీల్లో, టెలివిజన్లలో వైరస్‌ను చొప్పించి అవి పనిచేయకుండా చేస్తున్నారని, అడిగిన డబ్బు ఇచ్చినా సమస్య పరిష్కారమవుతుందన్న గ్యారంటీ లేదని వివరించారు. సమాచారం మొత్తాన్ని రహస్య సంకేత భాషలోకి మార్చేసే టెక్నాలజీ (ఎన్క్రిప్షన్) అందరికీ అందుబాటులోకి రావడంతో సమస్య మరింత జటిలమవుతోందని చెప్పారు. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే దేశవ్యాప్తంగా 1.2 లక్షల ర్యాన్సమ్వేర్ ఇన్ఫెక్షన్లు జరిగాయని, రూ.200 నుంచి రెండు మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేసే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. స్మార్ట్‌ఫోన్, పీసీ, ల్యాప్‌టాప్‌ల సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవడం, బ్యాకప్ చేసుకోవడం, అనుమానాస్పద మెయిళ్లు, మొబైల్ ఆప్స్‌ను డౌన్లోడ్ చేసుకోకపోవడం వంటి పనులతో ర్యాన్సమ్ బారిన పడకుండా చూసుకోవచ్చునని సూచించారు. ర్యాన్సమ్ వేర్ సెల్ పెట్టాలేమో: ఏసీపీ రఘువీర్ నైజీరియన్ ఫ్రాడ్, క్రెడిట్, డెబిట్ కార్డులతో జరిగే మోసాలతోపాటు ఇటీవలి కాలంలో ర్యాన్సమ్వేర్ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ రఘువీర్ తెలిపారు. వివిధ కారణాల వల్ల చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయట్లేదని చెప్పారు. ఈ రకమైన నేరాలు పెరుగుతున్న విధానం చూస్తుంటే త్వరలోనే వీటి దర్యాప్తునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సి రావచ్చన్నారు. -
ఆండ్రాయిడ్‌కు విస్తరించనున్న ర్యాన్సమ్వేర్!
వేలకువేలు పోసి కొనుక్కునే మొబైల్‌ఫోన్ అకస్మాత్తుగా ఫ్రీజై పోయింది. విలువైన డేటా, ఫొటోలన్నీ అందులోనే ఉండిపోయాయి. ఇంతలో ఫలానా బ్యాంక్ అకౌంట్‌కు రూ.వెయ్యి డిపాజిట్ చేస్తే ఫోన్ బాగైపోతుందని మెసేజ్! ఏం చేస్తారు? పనిజరిగితే చాలనుకుని వెయ్యి వదిలించుకుని ఫోన్‌ను అన్‌ఫ్రీజ్ చేయించుకుంటారు. ఈ ఏడాది మొబైల్ ప్రపంచానికి దాపురించనున్న అతిపెద్ద సెక్యూరిటీ కష్టమిదేనంటోంది క్విక్‌హీల్ అనే సంస్థ. నిన్న మొన్నటివరకూ విండోస్ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే పరిమితమైన ఈ ర్యాన్సమ్వేర్ బెడద ఈ ఏడాది ఆండ్రాయిడ్ ప్లాట్ఫార్మ్కు కూడా విస్తరిస్తుందని క్విక్‌హీల్ విడుదల చేసిన వార్షిక నివేదిక హెచ్చరించింది. దీంతోపాటు మొబైల్, ట్యాబ్లెట్లపై అక్రమంగా ప్రకటనలు గుప్పించే యాడ్వేర్లు కూడా ఈ ఏడాది విజృంభించే అవకాశముంది. నివేదికలోని ముఖ్యాంశాలు... ► 2014లో ఆండ్రాయిడ్ ప్లాట్ఫార్మ్పై దాదాపు 30 లక్షల ఆండ్రాయిడ్ మాల్వేర్ శాంపిల్స్ కనిపించాయి. ► 2011 - 2014 మధ్యకాలంలో ఆండ్రాయిడ్ మాల్వేర్ దాదాపు 304 రెట్లు పెరిగింది. ► ఒక్క 2014లోనే ఈ పెరుగుదల నాలుగు రెట్లు ఉండటం గమనార్హం. ► గత ఏడాది మొత్తం 536 కొత్త మాల్వేర్ ఫ్యామిలీస్, 616 వేరియంట్స్‌ను క్విక్‌హీల్ గుర్తించింది. ► గూగుల్ ప్లే స్టోర్‌లో నకిలీ పెయిడ్ అప్లికేషన్లు కనిపించడం ఎక్కువగా ఉంది. ► క్యాష్‌లెస్ పేమెంట్ వ్యవస్థలు, బ్యాంకు లావాదేవీలు, అప్లికేషన్లపై మాల్వేర్ సృష్టికర్తల దాడి పెరిగే అవకాశం. ► ఇప్పటివరకూ డెస్క్‌టాప్, సర్వర్లపై దృష్టిపెట్టిన హ్యాకర్లు ఇకపై వైఫై నెట్‌వర్క్‌ల్లోకి విధ్వంసక సాఫ్ట్వేర్లు జొప్పించి, మొబైల్ ట్రాఫిక్ ప్యాకెట్ల రవాణాను చిన్నాభిన్నం చేసే అవకాశముంది. ► విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి కొత్త, వినూత్న మార్గాల్లో ర్యాన్సమ్ వేర్‌ను చేర్చేందుకు ప్రయత్నాలు ► ర్యాన్సమ్ వేర్ మెసేజీలు స్థానికభాషల్లోనూ ప్రత్యక్షమయ్యే అవకాశం. ► డీఫాల్ట్ వెబ్ బ్రౌజర్లను, సెర్చింజిన్లను మార్చేసి పీసీని నత్తనడకన నడిపించే మాల్వేర్ 2014లో విండోస్ వినియోగదారులను బాగా చికాకుపెట్టింది.