సైబర్ వసూళ్లు పెరుగుతున్నాయి! | Increasing cyber collections! | Sakshi
Sakshi News home page

సైబర్ వసూళ్లు పెరుగుతున్నాయి!

Published Thu, Sep 22 2016 6:17 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

సైబర్ వసూళ్లు పెరుగుతున్నాయి!

సైబర్ వసూళ్లు పెరుగుతున్నాయి!

- ర్యాన్‌సమ్ వేర్ అటాక్‌లో నాలుగో స్థానంలో భారత్
- నార్తర్న్ ఇండియా కంట్రీ మేనేజర్ రితేశ్ చోప్రా
 
 సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు కేవలం పీసీలు, ల్యాప్‌టాప్‌లకు పరిమితమనుకున్న బలవంతపు వసూళ్ల (ర్యాన్‌సమ్‌వేర్) వ్యవహారం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లకూ విస్తరించిందని, ప్రజలు వీటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్జాతీయ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ నార్తర్న్ బై సెమాంటిక్ హెచ్చరిస్తోంది. సైబర్ ప్రపంచంలో బలవంతపు వసూళ్ల విషయంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని నార్తర్న్ ఇండియా కంట్రీ మేనేజర్ రితేష్ చోప్రా పేర్కొన్నారు. ర్యాన్‌సమ్‌వేర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.

స్మార్ట్‌వాచీల్లో, టెలివిజన్లలో వైరస్‌ను చొప్పించి అవి పనిచేయకుండా చేస్తున్నారని, అడిగిన డబ్బు ఇచ్చినా సమస్య పరిష్కారమవుతుందన్న గ్యారంటీ లేదని వివరించారు. సమాచారం మొత్తాన్ని రహస్య సంకేత భాషలోకి మార్చేసే టెక్నాలజీ (ఎన్‌క్రిప్షన్) అందరికీ అందుబాటులోకి రావడంతో సమస్య మరింత జటిలమవుతోందని చెప్పారు. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే దేశవ్యాప్తంగా 1.2 లక్షల ర్యాన్‌సమ్‌వేర్ ఇన్ఫెక్షన్లు జరిగాయని, రూ.200 నుంచి రెండు మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేసే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. స్మార్ట్‌ఫోన్, పీసీ, ల్యాప్‌టాప్‌ల సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవడం, బ్యాకప్ చేసుకోవడం, అనుమానాస్పద మెయిళ్లు, మొబైల్ ఆప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోకపోవడం వంటి పనులతో ర్యాన్‌సమ్ బారిన పడకుండా చూసుకోవచ్చునని సూచించారు.

 ర్యాన్‌సమ్ వేర్ సెల్ పెట్టాలేమో: ఏసీపీ రఘువీర్
 నైజీరియన్ ఫ్రాడ్, క్రెడిట్, డెబిట్ కార్డులతో జరిగే మోసాలతోపాటు ఇటీవలి కాలంలో ర్యాన్‌సమ్‌వేర్ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ రఘువీర్ తెలిపారు. వివిధ కారణాల వల్ల చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయట్లేదని చెప్పారు. ఈ రకమైన నేరాలు పెరుగుతున్న విధానం చూస్తుంటే త్వరలోనే వీటి దర్యాప్తునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సి రావచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement