సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలి
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని కొన్నేళ్లుగా అభిమానులు, పార్టీలకతీతంగా నాయకులు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం గత లోక్‌సభ ఎన్నికల సమయంలో చెన్నైలోని రజనీ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. అయినా రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ తన మనసులోని మాటను ఎప్పుడూ బయటపెట్టలేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ తాజాగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, తుగ్లక్ మేగజైన్ ఎడిటర్‌గా కొత్తగా నియమితులైన ఎస్ గురుమూర్తి కోరారు. తుగ్లక్ మేగజైన్ 47వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నేను కోరాను కాబట్టి రజనీకాంత్ రాజకీయాల్లో రాకూడదు. ఆయన సొంత నిర్ణయం తీసుకోవాలి. తమిళనాడుకు మంచి చేయగల వ్యక్తులు రాజకీయాల్లో రావాలి. రజనీ స్నేహితుడు, తుగ్లక్ మాజీ ఎడిటర్ చో రామస్వామి చాలాసార్లు ఆయనకు ఇదే విషయం చెప్పారు. తమిళనాడుకు రజనీ అవసరముందని, రాజకీయాల్లోకి రావాలని చో రామస్వామి కోరారు. తుగ్లక్ పత్రికది, నాది ఇదే అభిప్రాయం’ అని గురుమూర్తి చెప్పారు.
తమిళనాడు రాజకీయాలకు, సిని రంగానికి విడదీయలేని సంబంధం ఉంది. సినీ రంగానికి చెందినవారే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. రజనీకాంత్‌కు కోట్లాదిమంది అభిమానులున్నారు. ఆయన మద్దతు కోసం రాజకీయ పార్టీలు పోటీపడుతుంటాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రజనీకాంత్ ఓ వ్యాఖ్య చేయడం తీవ్ర ప్రభావం చూపింది. జయలలితకు ఓటు వేస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడంటూ రజనీ వ్యాఖ్యానించడం డీఎంకే కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా రారా అన్నది తమిళనాడులో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.